
అతిపెద్ద సినిమా పైరసీ ముఠా గుట్టురట్టు
దుబాయ్,నెదర్లాండ్, మయన్మార్ నుంచి కార్యకలాపాలు,తెలుగు సినిమా ఇండస్ట్రీకి భారీగా నష్టం చేసినట్లు అంచనా
అతిపెద్ద సినిమా పైరసీ ముఠాను తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు పట్టుకున్నారు .తెలుగు సహా పలు భాషలలో సినిమాలను పైరసీ చేస్తున్న 6గురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు.హ్యాష్ ట్యాగ్ సింగిల్ సినిమా పైరసీపై అందిన ఫిర్యాదుతో విచారణ చేపట్టి జులై 3న వనస్థలిపురానికి చెందిన కిరణ్‌ను అరెస్టు చేశారు.దీనిపై అతడిని కస్టడీలోకి తీసుకుని విచారించిన పోలీసులు పలు విషయాలు రాబట్టారు. ఈపైరసీ ముఠా దుబాయ్, నెదర్లాండ్, మయన్మార్‌లో ఉన్నట్లు గుర్తించారు.సినిమా ఇండస్ట్రీకి భారీగా నష్టం చేసినట్లు అంచనా వేస్తున్నారు.రికార్డు చేసిన కంటెంట్‌ను ఇతర వెబ్‌సైట్లకు పైరసీ ముఠా విక్రయిస్తోంది. ఓటీటీ కంటెంట్లను ఐబొమ్మ సహా పలు ప్లాట్‌ఫామ్‌లకు అమ్ముతోంది. థియేటర్లలో ప్లే అయ్యే శాటిలైట్ కంటెంట్ ఐడీ, పాస్‌వర్డ్‌లను నేరగాళ్లు క్రాక్ చేస్తున్నారు. కొందరిని ఏజెంట్లు గా పెట్టుకొని , వారికి రహస్య కెమెరాలు ఇచ్చి థియేటర్లకు పంపించి రికార్టు చేయిస్తారని తెలిసింది.ఏజెంట్లకు క్రిప్టో కరెన్సీ రూపంలో నిందితులు కమీషన్లు ఇస్తున్నారు.చొక్కా జేబు, పాప్‌కార్న్ డబ్బా, కోక్ టిన్‌లలో కెమెరాలు పెట్టి సినిమా చూస్తున్నట్లు నటిస్తూ చిత్రీకరిస్తున్నారు.
తెలుగు చిత్ర పరిశ్రమకు రూ.3,700 కోట్ల మేర నష్టం
ఈ ముఠా పైరసీ వల్ల తెలుగు చిత్ర పరిశ్రమకు రూ.3,700 కోట్ల మేర నష్టం వాటిల్లిందని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. దీనివల్ల నిర్మాతలు తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పారు.టెలిగ్రామ్ ఛానల్స్, టొరెంట్స్ ద్వారా సినిమాల పైరసీ జరుగుతోందని తెలిపారు. సినిమా పైరసీలకు నెదర్లాండ్స్‌కు చెందిన ఐపీ అడ్రస్ వాడుతున్నారని, ఈ ముఠాను పట్టుకునేందుకు అత్యాధునిక టెక్నాలజీని వినియోగించామని తెలిపారు. పోలీసులు ఎప్పటికీ పట్టుకోలేని టెక్నాలజీ వాడుతున్నామని నిందితులు విచారణలో వెల్లడించారని, మేం కేసును ఛేదించిన విధానం తెలిసి షాక్ అయినట్లు నిందితుడే చెప్పాడని సీవీ ఆనంద్ వెల్లడించారు.
"క్రిప్టో కరెన్సీ పేమెంట్స్ ద్వారా మాకు కొంత క్లూ దొరికింది. మరో ప్రధాన నిందితుడు పట్నాకు చెందిన అశ్వనీకుమార్ హ్యాకింగ్‌లో నిపుణుడు. డిజిటల్ మీడియా సర్వర్స్ మొత్తం హ్యాక్ చేసే నైపుణ్యం అతడికి ఉంది.కొన్ని సందర్భాల్లో గవర్నమెంటు వెబ్‌సైట్లను కూడా హ్యాక్ చేశాడు. ఎలక్షన్ కమిషన్ వెబ్‌సైట్‌ను కూడా హ్యాక్ చేశాడు. బిహార్‌లో ఉన్న అతని ఇంటికి మా టీమ్ వెళ్లింది. అతని ఇంటికి 22 సీసీటీవీ కెమెరాలు పెట్టుకున్నాడు. పట్నాలో కూర్చుని పలు కంపెనీల సైట్లను హ్యాక్ చేశాడు"అని సీపీ తెలిపారు.సిరిల్ అనే వ్యక్తి నెదర్లాండ్, ప్యారిస్ ఐపీ అడ్రస్‌లు పెట్టి సినిమాలు పైరసీ చేసి అప్లోడ్ చేస్తున్నాడని, ఇతనికి బెట్టింగ్ యాప్‌ల నిర్వాహకులు నెలకు రూ.9లక్షలు ఇస్తున్నారని, ఇప్పటి వరకు 500 సినిమాలు పైరసీ చేసినట్లు గుర్తించాం అని సీవీ ఆనంద్ తెలిపారు.