తెలంగాణ బీజేపీలో కొత్త లొల్లి
x
BJP state presidnt Kishan Reddy

తెలంగాణ బీజేపీలో కొత్త లొల్లి

గోషామహల్ జిల్లా అధ్యక్షుడి నియామకం విషయంలో ఎంఎల్ఏ రాజాసింగ్ పార్టీ నాయకత్వంపై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.


తెలంగాణ బీజేపీలో కొత్త లొల్లి మొదలైంది. అదేమిటంటే జిల్లాల అధ్యక్షుల నియామకం. పార్టీసౌలభ్యం కోసం నాయకత్వం తెలంగాణను 38 జిల్లాలుగా విభజించింది. ఇప్పటికి 23 జిల్లాలకు అధ్యక్షులను నియమించగా ఇంకా 15 జిల్లాలకు అధ్యక్షులను ప్రకటించాల్సుంది. అధ్యక్షులను నియమించటంలో పార్టీ నాయకత్వం ఒక్కో జిల్లాలో ఒక్కోతీరుగా వ్యవహరిస్తోంది. ఈకారణంతోనే ఎంపీలు, ఎంఎల్ఏలు, సీనియర్ నేతలు కొన్నిజిల్లాల్లో పార్టీ నాయకత్వంపై మండిపోతున్నారు. తాజాగా గోల్కొండ గోషామహల్(Gosha mahal) జిల్లా అధ్యక్షుడి నియామకం విషయంలో ఎంఎల్ఏ రాజాసింగ్(MLA Raja singh) పార్టీ నాయకత్వంపై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

పార్టీ తరపున 8 మంది ఎంపీలు, 8 మంది ఎంఎల్ఏలున్నారు. మామూలుగా అయితే పై 16 మంది ప్రజాప్రతినిధులున్న జిల్లాల అధ్యక్షులను నియమించటంలో వీళ్ళమాటే ఎక్కువగా చెల్లుబాటవుతుంది. అయితే నాయకత్వం మాత్రం అందరి విషయంలోను ఒకేలాగ వ్యవహరించటంలేదనే ఆరోపణలు రాజాసింగ్ రియాక్షన్ తో బయటపడింది. తాము సూచించిన వాళ్ళను అధ్యక్షులుగా నియమించలేదని కొందరు ఎంపీలు, మరికొందరు ఎంఎల్ఏలు నాయకత్వంపై మండిపోతున్నారు. తాజాగా నియమించిన గోల్కొడ గోషామహల్ జిల్లా అధ్యక్షుడు టీ ఉమామహేంద్ర నియామకమే కాదు గతంలో నల్గొండ జిల్లా, నిర్మల్ అధ్యక్షుల నియామకం అప్పుడు కూడా జిల్లాలోని చాలామంది సీనియర్ నేతలు నాయకత్వంపై మండిపోయారు.

పార్టీకోసం కష్టపడి పనిచేసే వారిని కాదని పార్టీ నాయకత్వం దగ్గర పట్టున్న కొందరి మాట ప్రకారమే అధ్యక్షుల నియామకాలు జరుగుతున్నాయనే ఆరోపణలు పార్టీలో పెరిగిపోతున్నాయి. ఇప్పటికే నియమించిన 23 జిల్లాల అధ్యక్షుల్లో కొందరి నియామకాల్లో గొడవలవుతుండటంతో నాయకత్వం మిగిలిన వాటిని పెండింగులో పెట్టేసింది. గద్వాల, నారాయణపేట, నాగర్ కర్నూల్, కొత్తగూడెం, సూర్యాపేట, సిరిసిల్ల, కరీంనగర్, రంగారెడ్డి అర్బన్, రంగారెడ్డి రూరల్ జిల్లాల అధ్యక్షుల నియమాకంలో ఎలాంటి గొడవలు వస్తాయో అన్న అనుమనాలతో ఇప్పటికైతే ప్రకటనను నిలిపేసింది.

ఉమామహేంద్ర నియామకంపై రాజాసింగ్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తంచేయటం పార్టీలో సంచలనంగా మారింది. కొందరు అధ్యక్షుల నియామకాల్లో ఎంపీలు, ఎంఎల్ఏల్లో కూడా అసంతృప్తి ఉన్నా రాజాసింగ్ లాగ బయటపడలేదంతే. తమ అసంతృప్తిని నాయకత్వానికి లేఖల రూపంలోనో లేదా నేరుగా కలిసో అభ్యంతరాలను వ్యక్తంచేసినట్లు పార్టీవర్గాల సమాచారం. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడిన, మొదటినుండి పార్టీకోసమే కష్టపడినవారిని కాదని మధ్యలో వచ్చిన వారికి నాయకత్వం అందలాలు ఎక్కిస్తున్నాదనే మంట చాలామంది ప్రజాప్రతినిదులు, సీనియర్ నేతల్లో పెరిగిపోతోంది. ఇదే విషయాన్ని రాజాసింగ్ బహిరంగంగానే ఆరోపించారు. నాయకత్వం నియమించిన ఉమామహేంద్ర ఎంఐఎం నేతలతో బాగా సన్నిహితంగా ఉంటాడని రాజాసింగ్ చేసిన ఆరోపణ కలకలం రేపింది. తాను ఎంఐఎం మీద సంవత్సరాలుగా పోరాటంచేస్తుంటే కొత్తగా అపాయింటైన జిల్లా అధ్యక్షుడు ఎంఐఎం నేతలతో సన్నిహితంగా ఉంటాడని నాయకత్వానికి తెలీకపోవటమే విచిత్రమన్నారు.

జిల్లాల అధ్యక్షులుగా నియమితులైన మరికొందరిపైన కూడా దాదాపు ఇలాంటి ఆరోపణలే ఉన్నాయి. జిల్లాల అధ్యక్షుల నియామకాల్లో తమమాటకు విలువలేనపుడు కొత్త అధ్యక్షులు తమకేమి గౌరవం, మర్యాద ఇస్తారన్నది ప్రజాప్రతినిధుల ఆవేధన. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే చాలామంది ఎంపీలు, ఎంఎల్ఏలతో తెలంగాణ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy)కి మంచి సంబంధాలు లేవని పార్టీలో చాలాకాలంగా టాక్ ఉంది. సహచర మంత్రి బండి సంజయ్, ఎంపీలు ఈటల రాజేందర్(Eatala Rajendar), రఘునందనరావు, గోడం నగేష్, విశ్వేశ్వరెడ్డి, రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ తో కిషన్ కు మంచి సంబధాలు లేవని పార్టీవర్గాల సమాచారం. ఎంపీలు, ఎంఎల్ఏల సిఫారసుల ప్రకారం కాకుండా తన మద్దతుదారులే జిల్లాల అధ్యక్షులుగా ఉండాలన్న కిషన్ ఆలోచన కారణంగానే చాలాచోట్ల వివాదాలు రేగుతున్నాయని పార్టీనేతలంటున్నారు. మహబూబ్ నగర్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల అధ్యక్షుల నియామకంలో కూడా బాగా గొడవలవుతున్నట్లు పార్టీ సీనియర్ నేత ‘తెలంగాణ ఫెడరల్’ తో చెప్పారు.

అధ్యక్షుల నియామకంలో ప్రజాప్రతినిధుల్లో అసంతృప్తి ఉందని పార్టీ నాయకత్వం ఎవరినీ మార్చదని స్పష్టంచేశారు. ఒకజిల్లాలో అధ్యక్షుడిని మార్చితే మిగిలిన జిల్లాల్లోని ప్రజాప్రతినిధులు, సీనియర్ నేతలు కూడా అధ్యక్షులను మార్చమని గొడవలు చేస్తారని చెప్పారు. అధ్యక్షుడి పనితీరు ఆధారంగా మార్చటమో లేదా కంటిన్యు చేయటమో చేస్తారు కాని గొడవలు, అసంతృప్తి కారణంగా మార్చరని చెప్పారు. మరి తాజాలొల్లి చివరకు ఎక్కడికి దారితీస్తుందో చూడాల్సిందే.

Read More
Next Story