ఎక్సైజ్ శాఖకు మద్యం వ్యాపారుల షాక్
x
Liquor shops in Telangana

ఎక్సైజ్ శాఖకు మద్యం వ్యాపారుల షాక్

దరఖాస్తు ఫీజును అమాంతం పెంచేసి వేల కోట్ల రూపాయలు రాబడదామని అనుకున్న ఉన్నతాధికారుల ఆశలకు మొదటికే మోసం వచ్చేట్లుంది


అతిచేస్తే గతిచెడుతుందనే సామెత తెలంగాణ ఎక్సైజ్ శాఖకు బాగా సరిపోతుంది. దరఖాస్తు ఫీజును అమాంతం పెంచేసి వేల కోట్ల రూపాయలు రాబడదామని అనుకున్న ఉన్నతాధికారుల ఆశలకు మొదటికే మోసం వచ్చేట్లుంది. రు. 2 లక్షలున్న దరఖాస్తు ఫీజును ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు ఏకంగా ఒకేసారి రు. 3 లక్షలు చేశారు. అంటే లక్ష రూపాయలు పెంచేశారు. ఫలితంగా దరఖాస్తులు బాగా తగ్గిపోయి మొదటికే మోసం వచ్చేట్లుంది. ఇంతకీ విషయం ఏమిటంటే రెండేళ్ళకు లిక్కర్ షాపుల వేలం కోసం ఎక్సైజ్ శాఖ నోటిఫికేషన్ జారీచేసింది. రెండేళ్ళ క్రితం కేటాయించిన షాపుల కాలపరిమితి నవంబర్ 30వ తేదీకి అయిపోతుంది. అందుకనే రాబోయే రెండేళ్ళ కాలపరిమితితో ఎక్సైజ్ శాఖ లిక్కర్ షాపుల వేలానికి నోటిఫికేషన్ జారీచేసింది.

దసరాపండుగను నమ్ముకున్న ఉన్నతాధికారులు సెప్టెంబర్ 25వ తేదీన నోటిఫికేషన్ జారీచేశారు. ఎందుకంటే ఇప్పటికే మద్యం వ్యాపారంలో ఉన్నవాళ్ళకు అదనంగా మరికొందరు మద్యం వ్యాపారంలోకి వస్తారని అనుకున్నారు. అలాంటి వాళ్ళంతా దసరాపండుగ సందర్భంగా వీలైనన్ని దరఖాస్తులు వేస్తారని ఆశించారు. విజయదశమి రోజున కుప్పలు తెప్పలుగా దరఖాస్తులు వచ్చిపడిపోతాయని ఉన్నతాధికారులు భావించారు. ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు అంచనా ఏమిటంటే కనీసం 1లక్ష దరఖాస్తులు వస్తాయని. 1లక్ష దరఖాస్తుల ద్వారానే ప్రభుత్వానికి రు. 3 వేల కోట్లకు పైగా ఆదాయం వస్తుందని అంచనావేశారు. అందుకనే దరఖాస్తు ధరను రు. 2 లక్షల నుండి రు. 3 లక్షలకు పెంచింది. రెండేళ్ళ క్రితం వచ్చిన దరఖాస్తులు 1.31 లక్షలు. దరఖాస్తుల అమ్మకం ద్వారానే అప్పట్లో ప్రభుత్వానికి రు. 2645 కోట్ల ఆదాయం వచ్చింది. అందుకనే దరఖాస్తు ఫీజును 2 నుండి 3 లక్షల రూపాయలకు పెంచింది. దరఖాస్తులు 1.31 లక్షల నుండి తగ్గినా ఫీజు 3 లక్షల రూపాయలకు పెంచిన కారణంగా తక్కువలో తక్కువ రు. 3 వేల కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేశారు.

అయితే ఇక్కడే ఉన్నతాధికారుల ఆశ తిరగబడింది. ఒక్కసారిగా దరఖాస్తు ఫీజు లక్ష రూపాయలు పెరిగిపోవటంతో వ్యాపారస్తులు భయపడిపోయారు. దరఖాస్తు ఫీజే రు. 3 లక్షలైపుడు తర్వాత షాపుల వేలంపాటలో ఇంకెంత డబ్బులు చెల్లించాలనే ఆలోచన చేశారు. అందుకనే అన్ని లక్షలరూపాయల ఫీజులు దరఖాస్తులకు చెల్లించి(నాన్ రీఫండబుల్) షాపులు పాడుకోవటం ఎందుకులే అని కామ్ గా ఉండిపోయారు. ఇపుడు విషయం ఏమిటంటే నోటిఫికేషన్ ప్రకారం దరఖాస్తులకు ఆఖరుతేదీ ఈనెల 18. ఇప్పటికి వచ్చిన దరఖాస్తులు 1581 మాత్రమే. ఉన్న మద్యంషాపులు 2620. అంటే మొత్తం షాపుల సంఖ్యతో పోల్చితే వచ్చిన దరఖాస్తులు చాలా తక్కువన్న విషయం అర్ధమైపోతోంది. షాపుకు ఒక దరఖాస్తు కూడా రాలేదు.

ఈనెల 23వ తేదీన లాటరీ పద్దతిలో షాపులను ఉన్నతాధికారులు కేటాయించబోతున్నారు. మామూలుగా అయితే షాపులను దక్కించుకునేందుకు వ్యాపారులు సిండికేట్ గా ఫామ్ అవుతారన్న ప్రచారం అందరికీ తెలిసిందే. ఎక్కువ డిమాండ్ ఉన్న షాపులకు పోటీకూడా అంతేస్ధాయిలో చాలా ఎక్కువగా ఉంటుంది. అలాంటిది ఇపుడు షాపుకు ఒక దరఖాస్తు కూడా రాకపోవటం ఉన్నతాధికారులకు షాక్ తగలినట్లయ్యింది. దరఖాస్తులకు ఆఖరిగడువు ఉన్నది మరో తొమ్మిదిరోజులు మాత్రమే. రోజుకు ఎన్నిదరఖాస్తులు వస్తే ఉన్నతాధికారులు అంచనా వేసినట్లు లక్ష దరఖాస్తులు అందుతాయి.

క్షేత్రస్ధాయిలో పరిస్ధితులు చూస్తుంటే గడువులోగా 98వేల దరఖాస్తులు వస్తాయనే నమ్మకాలు సన్నగిల్లుతున్నాయి. అందుకనే ఇపుడు షాపులు నడుపుతున్న వారితో ఉన్నతాధికారులు మాట్లాడుతు దరఖాస్తులు చేసుకోవాలని రిక్వెస్టులు చేస్తున్నారు. కొన్నిచోట్ల ఒత్తిడి కూడా చేస్తున్నట్లు వార్తలు వినబడుతున్నాయి. రెండేళ్ళ క్రితం తెలంగాణలో షాపులను దక్కించుకునేందుకు కర్నాటక, ఏపీ నుండి కూడా బాగా దరఖాస్తులు అందాయి. అలాంటిది ఇపుడు పై రెండు రాష్ట్రాల వ్యాపారస్తులు పెద్దగా దరఖాస్తులు చేయలేదు. అలాగే స్ధానికసంస్ధల ఎన్నికల బిజీలో ఉన్న కొందరు మద్యంషాపుల దరఖాస్తులను పట్టించుకోలేదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తం 2620 షాపుల్లో 1834 షాపులు మాత్రమే ఓపెన్ కేటగిరీలో ఉన్నాయి.

1834 షాపులకు వచ్చిన దరఖాస్తులు 992 మాత్రమే. అలాగే గౌడ్ లకు 393 షాపులు కేటాయించగా వచ్చిన దరఖాస్తులు 223. ఎస్సీలకు కేటాయించిన 262 షాపులకు వచ్చిన దరఖాస్తులు 55, ఎస్టీలకు 131 షాపులు రిజర్వ్ చేయగా 13 దరఖాస్తులు మాత్రమే అందాయి. దరఖాస్తు ఫీజు బాగా పెంచేసిన ఉన్నతాధికారుల అత్యాస కారణంగా మొదటికే మోసం వచ్చినట్లయ్యింది.


దరఖాస్తులు తగ్గినా ఆదాయం వస్తుంది : దళపతిరావు

వైన్ షాపులకు దరఖాస్తులు తగ్గినా ఎక్సైజ్ శాఖ అనుకున్నట్లు ఆదాయం వచ్చే అవకాశాలున్నాయని తెలంగాణ వైన్ డీలర్ల అసోసియేషన్ అధ్యక్షుడు దళపతిరావు వెంకటేశ్వరరావు చెప్పారు. తెలంగాణ ఫెడరల్ తో మాట్లాడుతు ‘‘చివరి మూడు, నాలుగు రోజుల్లోనే దరఖాస్తులు వేస్తార’’ని చెప్పారు. ‘‘దరఖాస్తుల సంఖ్య తగ్గినా ఆదాయం మాత్రం పెరిగే అవకాశముంద’’ని అభిప్రాయపడ్డారు. ‘‘దరఖాస్తు ఫీజు కామన్ మ్యాన్ కు కూడా అందుబాటులో ఉండాల’’ని అభిప్రాయపడ్డారు. కర్నాటకలో దరఖాస్తుఫీజు పద్దతే లేదన్నారు. ‘‘13వ తేదీనుండి మంచిరోజులున్నాయి కాబట్టి చివరి రోజుల్లో దరఖాస్తులు బాగానే అందుతాయ’’ని చెప్పారు. ‘‘దరఖాస్తులు అనుకున్నట్లు రాకపోతే గడువు తేదీని పొడిగించే అవకాశాలున్న’’ట్లు వెంకటేశ్వర్లు చెప్పారు.

Read More
Next Story