ఫోన్ ట్యాపింగ్‌పై న్యాయ విచారణకు మేధావుల డిమాండ్
x
;పోలీసులకు ఆదేశాలిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి

ఫోన్ ట్యాపింగ్‌పై న్యాయ విచారణకు మేధావుల డిమాండ్

తెలంగాణ పోలీసు విభాగంలో సంస్కరణలు తీసుకురావాలని ప్రజా ఉద్యమాల జాతీయ వేదిక తరపున 25 మంది మేధావులు కోరారు.ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి వారు బహిరంగ లేఖ రాశారు.


తెలంగాణ రాష్ట్రంలో గత పదేళ్లలో రాజ్యాంగం ప్రకారం మానవ హక్కులు, గోప్యత, పౌరుల భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను హరించి ఫోన్ ట్యాపింగ్ చేశారని, దీనిపై సీఎం ఎ రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోవాలని ప్రజా ఉద్యమాల జాతీయ వేదిక కోరింది.

తెలంగాణ సీఎంకు 25 ప్రజాసంఘాల ప్రతినిధుల సంచలన లేఖ

ఈ మేర మంగళవారం సీఎంకు హైదరాబాద్ నగరానికి చెందిన 25 మంది సోషల్ యాక్టివిస్టులు బహిరంగ లేఖ రాశారు. తెలంగాణ ప్రజల స్వేచ్ఛను కాపాడేందుకు పోలీసింగ్ లో సంస్కరణలు తీసుకురావాలని మేధావులు కోరారు. మెదక్ లో ఇటీవల జరిగిన హింసాత్మక సంఘటనను ఫోరం ఎత్తి చూపించింది. సమాజంలో చట్టబద్ధమైన పాలన ద్వారా న్యాయం కోసం పోలీసింగ్ అవసరమని వారు పేర్కొన్నారు.

హక్కులను హరించిన ఫోన్ ట్యాపింగ్
గత పదేళ్లలో ప్రజల హక్కులను కాలరాచేలా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని వారు ఆరోపించారు. ఆర్టికల్ 19, 21 ప్రకారం రాజ్యాంగం ఇచ్చిన గోప్యత, భావప్రకటనా స్వేచ్ఛ హక్కు ప్రజలకు ఉందని సుప్రీంకోర్టు తీర్పులిచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన పలు సంఘటనల పట్ల తమ పౌర సంఘాలు తీవ్ర ఆందోళన చెందుతున్నాయని వారు సీఎంకు రాసిన లేఖలో పేర్కొన్నారు. డీఎస్పీ ప్రణీత్ కుమార్ ఆధ్వర్యంలోని ఎస్ఐబీ బృందం తాము ఫోన్ ట్యాపింగ్ చేశామని నేరాన్ని ఒప్పుకొని వాంగ్మూలం ఇచ్చారు.

నిఘాతో స్వేచ్చను హరించారు...
విద్యార్థి సంఘాలు, కుల సంఘాల నాయకులు, జర్నలిస్టులు, హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదులు, బీఆర్ఎస్ వ్యతిరేకులు, పార్టీ నాయకుల వ్యక్తిగత జీవితాలు, వారి కార్యకలాపాలపై ఫోన్ ట్యాపింగ్ ద్వారా నిఘా పెట్టారని ఫోరం సభ్యులు తెలిపారు. తెలంగాణ పోలీసు వ్యవస్థను ఆధునీకరించి నిఘా పరికరాలతో ప్రజల స్వేచ్ఛను హరించారని సీఎంకు రాసిన లేఖలో పేర్కొన్నారు.

ట్యాపింగ్ పై హైకోర్టు సమోటో విచారణ
పోలీసులు ప్రతి పక్ష నేతలపై నిఘా వేయడమే కాకుండా సీనియర్ రాజకీయ నాయకులు, న్యాయవ్యవస్థ సభ్యులు, సామాజిక కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని కేసులు నమోదు చేశారు. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై తెలంగాణ హైకోర్టు కూడా సుమోటోగా స్వీకరించి దర్యాప్తు చేస్తుందని వారు తెలిపారు.

సీఎం దృష్టికి ప్రజాసంఘాల కీలక అంశాలు
- తెలంగాణలో మానవ హక్కుల ఉల్లంఘనలు, ఫోన్ ట్యాపింగ్ పై రిటైర్డు న్యాయమూర్తితో సమగ్ర విచారణ జరపాలి.
- తెలంగాణ రాష్ట్రంలో పోలీసింగ్ పద్ధతులు, ఇంటెలిజెన్స్ కార్యకలాపాలపై అన్ని వివరాలతో పోలీసు మాన్యవల్ ప్రచురించాలని కోరారు.
- ఫోన్ ట్యాపింగ్ కేసులు, అక్రమ నిఘా సమస్యలు, పోలీసింగ్ పద్ధతులు, మానవ హక్కుల ఉల్లంఘనలపై సుప్రీంకోర్టు రిటైర్డు న్యాయమూర్తి లేదా హైకోర్టు న్యాయమూర్తి నేత్వత్వంలో ఉన్నత స్థాయి విచారణ కమిషన్ నియమించాలని కోరారు.
- గూఢచార కార్యకలాపాలను శాసన పర్యవేక్షణలోకి తీసుకువచ్చి, దీనిలో దుర్వినియోగాన్ని అరికట్టాలి.
- మెదక్ పట్టణంలో పోలీసు కస్టడీలో మరణించిన మహమ్మద్ ఖదీర్ ఖాన్ ఘటనలో హింసకు పాల్పడిన పోలీసులపై విచారణ జరపాలని కోరారు. మృతుడు ఖదీర్ ఖాన్ భార్య సిద్ధేశ్వరి అలియాస్ ఫర్జానా, వారిపై ఆధారపడిన వారికి ఆర్థిక సహాయాన్ని అందించాలని మేధావులు కోరారు.
-తెలంగాణలోని అన్ని జిల్లాల్లో పోలీసు ఫిర్యాదుల అథారిటీని పనిచేసేలా చేయాలి.
- రాష్ట్రంలోని అన్ని పోలీసుస్టేషన్లలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసి, సమాచార హక్కు చట్టం కిద దరఖాస్తు చేసిన వారికి సీసీటీవీ ఫుటేజీ ఇవ్వాలని కోరారు. సుప్రీం ఆదేశాల మేర కస్టడీ హింసను నిరోధించాలని వారు డిమాండ్ చేశారు.
- శాంతియుతంగా నిరసనల్లో పాల్గొన్న వ్యక్తులపై తాత్కాలిక నిర్బంధాన్ని విధించొద్దు
- 2019 డిసెంబరు 6వతేదీన నలుగురు నిందితులు ఆరిఫ్, జాలీ నవీన్, జొల్లి శివ, చింతకుంట చెన్నకేశవులను హతమార్చడంపై జస్టిస్ సిర్పూర్ కర్ ఇచ్చిన నివేదికపై పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలి.
- జంతువుల విక్రయదారులపై పోలీసుల వేధింపులను ఆపాలి.
- తెలంగాణలో అట్టడుగు వర్గాలు నివసిస్తున్న ప్రాంతాల వ్యక్తుల గౌరవం, గోప్యతను ఉల్లంఘించే కార్డన్ సెర్చ్ కార్యకలాపాలను పోలీసులు నిలిపివేయాలి. కార్డన్ సెర్చ్ లో వాహనాలను స్వాదీనం చేసుకోవద్దు.
- పోలీసులు వారెంట్లను డిజిటలైజ్ చేసి వాటిని బహిరంగంగా అప్ లోడ్ చేయాలని సూచించారు.
- పాతబస్తీలో మిషన్ చబుత్రా పేరిట యువకులను లక్ష్యంగా చేసుకొని వారిపై పోలీసింగ్ ను ఆపాలని కోరారు.
- చిన్న కేసుల్లో పారదర్శకంగా విచారణ జరిపి, అందులో నిందితులకు న్యాయ సహాయం అందించాలి.
- దళితులు, ఆదివాసీలు, అణగారిన వర్గాలు, సెక్స్ వర్కర్లు, మైనారిటీలు, బలహీనవర్గాల హక్కులను కాపాడాలి.

25 ప్రజా సంఘాల యాక్టివిస్టులు కలిసి...
ప్రజా ఉద్యమాల జాతీయ వేదిక తరపున 25 మంది సోషల్ యాక్టివిస్టులో సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. ఈ లేఖ రాసిన వారిలో రమా మెల్కోటే (రిటైర్డ్ అకడమిక్, ఉస్మానియా యూనివర్సిటీ),జీవన్ కుమార్ (మానవ హక్కుల వేదిక, తెలంగాణ)కె.సజయ (మహిళలు & లింగమార్పిడి సంస్థల జేఏసీ),మీరా సంఘమిత్ర (నేషనల్ అలయన్స్ ఆఫ్ పీపుల్స్ మూవ్‌మెంట్స్ ),మసూద్ (సామాజిక కార్యకర్త),శంకర్ (నేషనల్ ఫోరమ్ ఫర్ అర్బన్ స్ట్రగుల్స్ - తెలంగాణ),ఖలీదా ప్రవీణ్ (సామాజిక కార్యకర్త),షేక్ సలావుద్దీన్ (తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫాం వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు),రోహిత్ (మానవ హక్కుల వేదిక, తెలంగాణ),రుచిత్ ఆశా కమల్ (క్లైమేట్ ఫ్రంట్ హైదరాబాద్),జాన్ మైఖేల్, హైదరాబాద్ గార్బేజ్ కలెక్టర్స్ కలెక్టివ్ ,వర్ష (వేర్ ఆర్ ది విమెన్, తెలంగాణ),నికితా నాయుడు (క్లైమేట్ యాక్షన్),శ్రీహర్ష టి (రైతు స్వరాజ్య వేదిక),సయ్యద్ ఫిరోజ్ (నిరాశ్రయ శ్రామిక సంఘటన్),అంబటి నాగయ్య (తెలంగాణ విద్యావంతుల వేదిక),కృష్ణ (తెలంగాణ విద్యావంతుల వేదిక),కనీజ్ ఫాతిమా (పౌర హక్కుల కార్యకర్త),ఎస్.సీతాలక్ష్మి (స్వతంత్ర పరిశోధకురాలు),శ్రీనివాస్ కొడాలి (స్వతంత్ర పరిశోధకుడు),కుద్సియా తబస్సుమ్ (న్యాయవాది & సామాజిక కార్యకర్త),ఎస్ ఆశాలత (రైతు స్వరాజ్య వేదిక & మకం), షకీల్ (అడ్వకేట్ & సామాజిక కార్యకర్త),నటాషా రామరత్నం (డెవలప్‌మెంట్ కన్సల్టెంట్, హైదరాబాద్),సౌమ్య కిదాంబి (స్వతంత్ర పరిశోధకురాలు)లు ఉన్నారు.



Read More
Next Story