Kalvakuntla Kavitha
x
ఖమ్మంలో నిర్వహించిన జాగృతి జనం బాట కార్యక్రమంలో మాట్లాడుతున్న కల్వకుంట్ల కవిత

కేసీఆర్ చేసిన తప్పు అదే: కవిత

జూబ్లీహిల్స్ కాంగ్రెస్ గెలవడానికి ప్రతిపక్షాలైన బీఆర్ఎస్, బీజేపీ వైఫల్యమే కారణమన్న కవిత.


బీఆర్ఎస్ పార్టీపై కల్వకుంట్ల కవిత మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సారి తన తండ్రి కేసీఆర్‌ను ఉద్దేశించి కూడా మాట్లాడారు. తన తండ్రి చేసింది ఒకే ఒక్క తప్పని, అది సీనియర్ నాయకులను వదులుకోవడమని ఆమె చెప్పుకొచ్చారు. తుమ్మల నాగేశ్వరరావు లాంటి సీనియర్ నాయకులను వదులుకోవడం వల్లే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయిందని ఆమె తెలిపారు. జాగృతి జనం బాట మంగళవారం ఖమ్మం జిల్లాలో కొనసాగింది. ఈ సందర్బంగానే ఆమె మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ గెలుపు కారణాలను వివరించారు. కేవలం బీజేపీ, బీఆర్ఎస్ వైఫల్యాల వల్లే కాంగ్రెస్ గెలిచింది తప్పా.. కాంగ్రెస్‌కు సొంత సత్తా ఏమీ లేదని చురకలంటించారు. కాంగ్రెస్ పేరు ఎత్తితేనే ప్రజలు భయంకరంగా తిడుతున్నారని, అయినా ఆ పార్టీ జూబ్లీ ఉపఎన్నికలో ఎలా గెలిచిందని ప్రశ్నించారు. ఈ సందర్భంగానే ఆమె తన రాజకీయ పార్టీపై కూడా స్పందించారు.

చాలా నేర్చుకోవాల్సి ఉంది: కవిత

‘‘ఇప్పుడే రాజకీయ పార్టీ గురించి ఆలోచన చేయటం లేదు. నేను ఇంకా చాలా నేర్చుకోవాల్సి ఉంది. ప్రస్తుతం ప్రజల సమస్యలపై పోరాటం చేస్తున్నాం. బీఆర్ఎస్ మూడోసారి ఓడిపోవటానికి కారణాల్లో తుమ్మలను వదులుకోవటం కూడా ఒక కారణం. అంత అనుభవజ్ఞులైన నాయకున్ని బీఆర్ఎస్ వదులుకుంది. దాంతో రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నుంచి చాలా మంది వెళ్లిపోతున్నారనే భావన వచ్చింది. కేసీఆర్ లాంటి రాజకీయ అనుభవజ్ఞులే తప్పులు చేశారు. అందుకే నేను చాలా నేర్చుకోవాలని అనుకుంటున్నా. గతంలో నన్ను నిజామాబాద్ కు మాత్రమే పరిమితం చేశారు. మళ్లీ మేము జాగృతిని బలోపేతం చేసుకుంటాం. ప్రజల కోసం పోరాటం చేస్తాం’’ అని తెలిపారు.

పార్టీని ఢంకాబజాయించి ప్రకటిస్తా..

‘‘రాష్ట్రంలో ప్రస్తుతం అధికార పక్షం, ప్రతిపక్షం నిద్ర పోతుంది. పార్టీ పెట్టాలనుకుంటే ప్రజలకు వజ్రాయుధమయ్యే విధంగా పార్టీని పెడతాం. ఏదో పార్టీ పెట్టామా? నడిపించామా అన్నట్లుగా మాత్రం చేయం. పార్టీ పెట్టేది ఉంటే మాత్రం హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టి ఢంకా బజాయించి ప్రకటిస్తా. జాగృతి గత 20 ఏళ్లుగా రాజకీయ అంశాలపై మాట్లాడుతోంది. పోరాటం చేస్తోంది. పార్టీ లేకుండా కూడా రాజకీయ అంశాలపై మా పోరాటం కొనసాగుతుంది. బీఆర్ఎస్ తో నాకు సంబంధం లేదు. 20 ఏళ్లు ఆ పార్టీ కోసం పనిచేశా. 20 ఏళ్లు పార్టీ లో ఉండి బయటకు వచ్చాక పార్టీ నాయకుడిని విమర్శించటం నీచ సంస్కృతి. నేను కేసీఆర్‌ని విమర్శించటం లేదు’’ అని స్పష్టం చేశారు.

కుట్ర చేసే నన్ను దూరం చేశారు..

‘‘నా మీద కుట్ర చేసి పార్టీకి, కుటుంబానికి కొంతమంది దూరం చేశారు. వారి మీద మాత్రం నేను కచ్చితంగా మాట్లాడుతాను. అలాగని ప్రూప్స్ లేకుండా మాట్లాడే వ్యక్తిని కాదు. కచ్చితంగా అన్ని ఆధారాలుంటేనే మాట్లాడుతాను. తుమ్మల లాంటి వ్యక్తినే బీఆర్ఎస్ కాపాడుకోలేదు. అదే విధంగా సొంత బిడ్డను నన్ను కూడా బయటకు పంపించారు. అసలు కాంగ్రెస్ పేరు చెబితేనే ప్రజలు లకారాలతో తిడుతున్నారు. అలాంటి పార్టీ ఇవ్వాళ జూబ్లీహిల్స్ లో ఎలా గెలిచింది? దీని కచ్చితంగా ప్రతిపక్షాలైన బీఆర్ఎస్, బీజేపీ ల వైఫల్యమే కారణం. దేశంలో కాంగ్రెస్ ప్రతిపక్షంగా విఫలమైంది. బీహార్ లో ఘోరంగా ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఎలా గెలిచింది? అంటే ప్రజల తరఫున పోరాటం చేయాల్సినంత ప్రతిపక్షాలు చేయటం లేదు’’ అని అన్నారు.

Read More
Next Story