
ఢిల్లీ పేలుళ్లకు బిజెపి తో ముడిపెట్టడం నీచమైన పని
మెదక్ ఎంపీ రఘునందన్ రావు
ఢిల్లీ ఎర్రకోట వద్ద బాంబు ఘటనతో బిజెపిని ముడిపెట్టడం పట్ల బిజెపి ఎంపీ రఘు నందన్ రావు బుధవారం తీవ్రంగా ఖండించారు. పేలుళ్లకు బిజెపికి ఏం సంబంధం అని ఆయన ప్రశ్నించారు. ఢిల్లీ పేలుళ్లలో మొత్తం 12 మంది చనిపోయారు. ఈ ఘటనపై ప్రధాన మంత్రి నరేంద్రమోడీ తీవ్రంగా హెచ్చరించారు. దోషులను వదిలేది లేదని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో బిజెపి ప్రభుత్వానికి పలువురు సంఘీభావం ప్రకటించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని ఈ రోజు సంగారెడ్డి లోని ఐబి నుంచి కలెక్టరేట్ వరకు సర్దార్ ఏక్తా యాత్ర జరిగింది. ఈ యాత్రలో మెదక్ ఎంపీ, బిజెపి మెదక్ జిల్లా అధ్యక్షుడు గోదావరి అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రఘు నందన్ రావు మాట్లాడుతూ ఎన్నికలు వస్తే బ్లాస్టులు జరుగుతున్నాయని కొందరు సోషల్ మీడియా వేదికగా మాట్లాడుతున్నారని, ఇంత కంటే నీచమైంది లేదని ఆయన అన్నారు. చేతిలో సెల్ ఫోన్ ఉంది కదా అని సోషల్ మీడియలో విషప్రచారానికి తెగబడ్డారని ఆయన విమర్శించారు. పేలుళ్ల వెనక బిజెపి హస్తం ఉంది అని కొందరు చేస్తున్న ప్రచారాన్ని వారి విచక్షణకు వదిలి వేస్తున్నట్టు రఘు నందన్ రావు అన్నారు. అలాంటి వ్యక్తులను ఎవరూ సమర్దించవద్దని ఆయన హితవు పలికారు. బాంబులు పేల్చాలని ఓ వర్గం కుట్ర పన్నినట్లు రఘు నందన్ రావు ఆరోపించారు.
కేంద్ర ప్రభుత్వ వైఫల్యం: సిపిఎం
ఢిల్లీ పేలుళ్లకు కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ(సిపిఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేస్తూ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.ఢిల్లీలోనూ బిజెపి ప్రభుత్వమే అధికారంలో ఉందని, వారి ఆధీనంలోనే నిఘా సంస్థలు ఉన్నాయని జాన్ వెస్లీ అన్నారు. బాంబు పేలుళ్ల సమచారాన్ని సేకరించడంలో నిఘా సంస్థలు వైఫల్యం చెందినట్టు ఆయన అన్నారు. ఈ ఘటనపై అత్యున్నత స్థాయి విచారణజరిపి దోషులను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని, గాయపడిన వారికి మెరుగైన వైద్యం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఆయన డిమాండ్ చేశారు.
సోమవారం సాయంత్రం ఢిల్లీ ఎర్రకోట ట్రాఫిక్ సిగ్నల్ వద్ద కదులుతున్న కారును వేగంగా వచ్చిన కారు ఢీ కొట్టడంతో భారీ పేలుడు సంభవించి 12 మంది దుర్మరణం చెందిన సంగతి తెలిసిందే.

