ఇద్దరితో సహజీవనం...మరొకరితో వివాహం
x

ఇద్దరితో సహజీవనం...మరొకరితో వివాహం

బంగ్లాదేశ్ యువతిని అరెస్ట్ చేసిన నల్లకుంటపోలీసులు


ఇద్దరితో సహజీవనం చేస్తూ మరొకరిని వివాహమాడిన కిలేడిని నల్ల కుంట పోలీసులు అరెస్ట్ చేశారు. బంగ్లాదేశ్ కు చెందిన రీతూ మోని 2020లో హైదరాబాద్ కు వలసవచ్చింది. తన పేరును రీతూ రావుగా మార్చుకుంది. సోషల్ మీడియా ద్వారా పలువురిని తన వలపు మాటలతో ఆకర్షించేది.

ఒకరికి తెలియకుండా మరొకరిని

అలా పరిచయమైన వారిలో హైదరాబాద్ అసిఫ్ నగర్ కు చెందిన నరేష్ ఉన్నాడు. అతనితో సహజీవనం కొనసాగించింది.అతని అడ్రస్ పైనే ఆధార్ కార్డు, పాన్ కార్డు, సిమ్ కార్డులను సంపాదించింది. నరేష్ తో అక్రమ సంబంధం కొనసాగుతుండగానే గన్ ఫౌండ్రికి చెందిన శంకర్ తో పరిచయం పెంచుకుంది. ఈ పరిచయం కాస్తా అక్రమ సంబంధానికి దారి తీసింది. అతనితో కూడా సహజీవనం కొనసాగించింది. అసిఫ్ నగర్ అడ్రస్ లో ఉన్న ఆధార్ కార్డును గన్ ఫౌండ్రి అడ్రస్ కి అప్ డేట్ చేసుకుంది. ఈమె వ్యవహారాన్ని గమనించిన శంకర్ రీతూరావుతో గొడవపడ్డాడు. శంకర్రావును భయపెట్టడానికి రీతూరావు ఇంట్లో ఉన్న షాంపు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. దీంతో శంకర్రావు ఆమెను గుడిమల్కాపూర్ ఆస్పత్రిలో చేర్చాడు. ఆమె ఆత్మహత్యాయత్నం చేసినట్లు ఫిర్యాదురావడంతో గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.

నరేష్, శంకర్రావులతో సహజీవనం కొనసాగుతున్న సమయంలోనే నిజామాబాద్ కు చెందిన ప్రవీణ్ ను ఇన్ స్టా గ్రామ్ ద్వారా రీతూరావ్ పరిచయం చేసుకుంది. తనను శంకర్రావ్ అనే వ్యక్తి వదిలి వెళ్లిపోయాడని ప్రవీణ్ కు చెప్పి దగ్గరైంది. వీరిద్దరూ ఓయో రూములో గడిపారు. తర్వాత వీళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారు.

పెళ్లి ఫోటోలతో రీతూ రావు మరో గేమ్

ప్రవీణ్ తో ఉన్న పెళ్లి ఫోటోలతో రీతూ రావు మరో గేమ్ ఆడింది. ఫేస్ బుక్ లో ప్రవీణ్ భార్యకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టుకుంది. తర్వాత ప్రవీణ్ తో దిగిన పెళ్లి ఫోటోలను భార్యకు పంపింది. దీంతో ప్రవీణ్ భార్య భర్తను నిల దీసింది. తనను డబ్బుల కోసం రీతూరావు వేధిస్తుందని భార్యకు చెప్పేశాడు. భార్య తన భర్తను తీసుకుని నల్లకుంట పోలీస్ స్టేషన్ వెళ్లి కంప్లైంట్ చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రీతూరావుతో బాటు ప్రవీణ్ ను అరెస్ట్ చేశారు. భార్య ఉండగానే రీతూరావును పెళ్లి చేసుకున్న కారణంగా ప్రవీణ్ కూడా అరెస్టయ్యాడు. రీతూ రావుతో సహజీవనం చేసిన శంకర్రావు, నరేష్ పరారీలో ఉన్నారు.

Read More
Next Story