ట్యాపింగ్ కేసులో ఎంఎల్సీపై ఎల్ఓసీ
x
Telephone tapping

ట్యాపింగ్ కేసులో ఎంఎల్సీపై ఎల్ఓసీ

తెలంగాణా టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకమైన పరిణామం చోటుచేసుకున్నది. అదేమిటంటే బీఆర్ఎస్ ఎంఎల్సీపై లుక్ ఓట్ సర్క్యులర్ (ఎల్ఓసీ)ను సీఐడీ జారీచేసింది.


తెలంగాణా టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకమైన పరిణామం చోటుచేసుకున్నది. అదేమిటంటే బీఆర్ఎస్ ఎంఎల్సీపై లుక్ ఓట్ సర్క్యులర్ (ఎల్ఓసీ)ను సీఐడీ జారీచేసింది. ఎంఎల్సీపై వెంటనే ఎల్ఓసీ జారీచేయాలని ట్యాపింగ్ కేసును విచారిస్తున్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(సిట్) సీఐడీని కోరింది. ఇంతకీ విషయం ఏమిటంటే తెలంగాణాను కుదిపేసిన టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ లోని అనేకమంది పెద్దతలకాయలున్నట్లు జరుగుతున్న ప్రచారం అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగానే తీగలాగితే డొంక కదిలినట్లుగా బీఆర్ఎస్ హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేసిన ప్రభాకరరావుతో పాటు మీడియా యజమాని శ్రవణరావు పాత్రలు బయటపడ్డాయి.

ట్యాపింగులో కీలకంగా వ్యవహరించి అరెస్టయిన పోలీసు అధికారులు భుజంగరావు, ప్రవీణ్ రావు, ప్రదీప్ రావు, రాధాకిషన్ రావు తదితరులు అనేక విషయాలు విచారణలో బయటపెట్టారు. ఎప్పుడైతే కొందరు పోలీసు అధికారులు అరెస్టయ్యారో వెంటనే అలర్టయిన ప్రభాకరరావు, శ్రవణ్ రావు విదేశాలకు పారిపోయారు. గడచిన ఆరుమాసాలుగా వీళ్ళిద్దరు విదేశాల్లోనే ఉంటున్నారు. వీళ్ళని అరెస్టుచేసి హైదరాబాద్ కు తీసుకురావటానికి పోలీసులు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. విచారణలో పోలీసులు చెప్పిన అనేక అంశాల్లో మరో కీలకమైన విషయం బయటపడింది. అదేమిటంటే బీఆర్ఎస్ పెద్దలతో అత్యంత సన్నిహితంగా ఉన్న ఎంఎల్సీ నవీన్ రావు కూడా ట్యాపింగ్ విషయంలో చాలా కీలకంగా వ్యవహరించారని.

ప్రభాకరరావు, శ్రవణ్ రావు, డీఎస్పీ ప్రదీప్ రావుతో కలిసి నవీన్ రావు కూడా ట్యాపింగ్ వ్యవహరాలను ప్రతిరోజు పర్యవేక్షించారని ఇంటరాగేషన్లో పోలీసు అధికారులు చెప్పినట్లు సిట్ అధికారులు కోర్టులో దాఖలుచేసిన అఫిడవిట్లో చెప్పారు. ఇంతకాలం ట్యాపింగ్ అంశంలో ఒక ఎంఎల్సీ కూడా కీలకపాత్ర పోషించారని మాత్రమే ప్రచారం జరిగింది. అయితే సదరు ఎంఎల్సీ ఎవరనే విషయం అధికారికంగా బయటకు రాలేదు. తాజాగా సిట్ కోర్టులో దాఖలుచేసిన అఫిడవిట్ ప్రకారం సదరు ఎంఎల్సీ నవీన్ రావ అని బయటపడింది. ట్యాపింగ్ చేయటంతో పాటు తర్వాత హార్డ్ డిస్కుల ధ్వంసంలో ప్రభాకరరావు, ప్రదీప్ రావు తో కలిసి నవీన్ రావు కీలకపాత్ర పోషించినట్లు అఫిడవిట్లో సిట్ చెప్పింది.

విచారణలో భాగంగానే సిట్ అధికారులు నవీన్ కు నోటీసులు జారీచేయటానికి ప్రయత్నించారు. అయితే నోటీసులు జారీచేయలేకపోయారు. ఎందుకంటే నోటీసులు జారీచేసి విచారణ కోసం తనను అదుపులోకి తీసుకోవటానికి సిట్ అధికారులు సిద్ధమయ్యారన్న విషయం నవీన్ తెలుసుకున్నారు. దాంతో మూడోకంటికి తెలీకుండా నవీన్ విదేశాలకు పారిపోయినట్లు తర్వాతెప్పుడో సిట్ అధికారులు తెలుసుకున్నారు. విచారణ చేసినపుడు సదరు ఎంఎల్సీ దుబాయ్ కు వెళ్ళినట్లు తెలుసుకున్నారు. అందుకనే తాజాగా నవీన్ రావుపై నోడల్ ఏజెన్సీ సీఐడీ పోలీసుల ద్వారా ఎల్ఓసీ జారీచేయించారు. దేశంలోని అంతర్జాతీయ విమానాశ్రయాలు, ఓడరేవులన్నిటికీ ఎల్ఓసీ జారీ అయ్యింది. దేశంలోకి నవీన్ అడుగుపెట్టడమే ఆలస్యం వెంటనే అరెస్టు చేసేట్లుగా ఎల్ఓసీలో పోలీసులు మిగిలిన రాష్ట్రాల పోలీసులకు విజ్ఞప్తిచేశారు.

అయితే ఇక్కడ అనుమానం ఏమిటంటే తనను అరెస్టుచేస్తారని తెలిసిన నవీన్ విదేశాల నుండి తిరిగి ఇండియాకు ఎందుకు తిరిగొస్తారు ? టెలిఫోన్ ట్యాపింగ్ అంశం బయటపడుతుందని, బయటపడినపుడు తన పాత్రకూడా బడయటపడతుందని ఆలోచించనంత అమాయకుడు కాదు నవీన్. ప్రభుత్వం మారితే, టెలిఫోన్ అంశం బయటపడి, అరెస్టులు మొదలైన తర్వాత తన పాత్ర కూడా బయటపడితే ఏమిచేయాలనే విషయాన్ని ముందుగానే ఆలోచించుకుని ఉంటారు. దానికి తగ్గట్లుగానే ప్లాన్ చేసుకునుంటారనంటంలో సందేహంలేదు. ప్రభాకరరావు, శ్రవణ్ రావు ఇలాగే కదా ఆలోచించి ప్లాన్ చేసుకుని విదేశాలకు పారిపోయింది. ప్రభాకరరావు అమెరికాలో ఉన్నాడని తెలిసింది కాని శ్రవణ్ రావు ఎక్కడున్నాడనే విషయంలో ఇంతవరకు సమాచారం కూడా లేదు.

ఇపుడు నవీన్ దుబాయ్ లో ఉన్నాడని పోలీసులు అనుకుంటున్నారు. దుబాయ్ నుండి ఎంఎల్సీ కూడా అమెరికాకు వెళిపోయాడా లేకపోతే ఇంకేదైనా దేశానికి వెళ్ళాడా అన్న సమాచారం పోలీసుల దగ్గరలేదు. దేశంలోకి నవీన్ అడుగుపెడతారనే నమ్మకం లేదు. ఒకవేళ దేశానికి తిరిగొస్తున్నాడంటే ముందుగానే పోలీసు ఉన్నతాధికారులతో ‘అన్నీ విషయాలు’ మాట్లాడుకుని తగిన హామీ తీసుకున్న తర్వాత మాత్రమే తిరిగొస్తారని అనుకోవాలి. ప్రభాకరరావు, శ్రవణ్ రావు, నవీన్ రావులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తే కాని బీఆర్ఎస్ పెద్దతలకాయలు, కీలక సూత్రదారులు ఎవరన్న విషయం బయటకు రాదు. ఆ విషయం బయటకు రానంతవరకు దర్యాప్తు పూర్తికాదు. మరిదంతా ఎప్పుడు జరుగుతుందో ఏమో వెయిట్ చేసి చూడాల్సిందే.

Read More
Next Story