లోక్ సత్తా జయప్రకాశ్ నారాయణ్ ‘రైతు ఫిలాసఫీ’ ఏంటంటే..
డాక్టర్ జేపీ చేసే వాదనలన్నీ రైతుల గొంతునొక్కి, మోదీ ప్రభుత్వ చర్యలను బలపరిచేవే. రైతులను మార్కెట్ శక్తులకు వదిలి, ప్రభుత్వం తప్పుకోవాలనేది ఆయన వాదన. ఎలాగంటే
-కన్నెగంటి రవి*
ఫిబ్రవరి 13 న ఛలో డిల్లీ పిలుపు ఇచ్చి, తమ ట్రాక్టర్ లతో బయలు దేరిన వేలాది మంది పంజాబ్ రైతులపై హర్యానా రాష్ట్ర శంభు సరిహద్దులోనే కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అక్కడి బీజీపీ ప్రభుత్వం తీవ్ర నిర్బంధాన్ని ప్రయోగించింది. పెల్లెట్లు మాత్రమే కాకుండా బుల్లెట్లు కూడా వాడి వందల మందిని గాయపరిచింది. శుభ కరణ్ సింగ్ అనే యువ రైతును బలి గొంది.
దేశ వ్యాపితంగా రైతుల ఉద్యమం బలపడుతున్న కొద్దీ కేంద్ర ప్రభుత్వం ఉద్యమ నాయకత్వం పై , ఉద్యమ డిమాండ్ లపై దుష్ప్రచారం సాగిస్తున్నది. రైతుల డిమాండ్లు ఆచరణ సాధ్యం కానివనీ , ఈ డిమాండ్లను అంగీకరిస్తే ఆహార ద్రవ్యోల్బణం పెరిగి పోతుందనీ, ఈ డిమాండ్లను అమలు చేయడానికి కేంద్ర బడ్జెట్ కూడా సరిపోదనీ తప్పుడు వాదనలను ప్రచారంలో పెడుతున్నది.
పంటలకు ప్రకటించే కనీస మద్ధతు ధరలకు చట్టబద్ధత కల్పించాలని రైతు ఉద్యమం ముందుకు తెచ్చిన ముఖ్యమైన డిమాండ్ ను, ఇతర డిమాండ్లను తప్పు పడుతూ, కేంద్ర ప్రభుత్వానికి నిత్యం వత్తాసు పలికే లోక్ సత్తా జయ ప్రకాష్ నారాయణ లాంటి వాళ్ళు కూడా మీడియాలో మాట్లాడుతున్నారు. ఫిబ్రవరి 25 న ఆంధ్ర జ్యోతిలో “జబ్బు కంటే ప్రమాదం మద్ధతు ఔషధం” పేరుతో ఆయన రాసిన వ్యాసం ఇందులో భాగమే.
రైతు పక్షపాతిగా చెప్పుకునే ఆయన ఈ వ్యాసంలో ఎక్కడా, తమ డిమాండ్లను వినిపించడానికి, కేంద్ర ప్రభుత్వం రైతులను ఢిల్లీలోకి అనుమతించాలని, రైతు సంఘాలతో చర్చించాలని, రైతులపై ప్రభుత్వ నిర్బంధాన్ని ఆపాలని కోరక పోగా, రైతులను రైతు సంఘాలు పక్కదారి పట్టిస్తున్నాయని విమర్శించడం గమనార్హం.
ఆయన తన మొత్తం వ్యాసంలో ఎక్కడా, రైతులు పండించే అన్ని రకాల పంటలకు, ఇతర వ్యవసాయ అనుబంధ రంగాల ఉత్పత్తులకు, కనీస మద్ధతు ధరలు ప్రకటించాల్సిన అవసరం గురించి కనీస ప్రస్తావన చేయలేదు. అన్ని పంటలకు సమగ్ర ఉత్పత్తి ఖర్చులను లెక్కించి, స్వామినాథన్ కమిషన్ సిఫారసులకు అనుగుణంగా కనీస మద్ధతు ధరలను ప్రకటించాలని కూడా అడగలేదు .
కనీస మద్ధతు ధరలకు చట్టబద్ధత కల్పించాలని, వ్యవసాయ రుణాలను మాఫీ చేయాలని ప్రపంచ వాణిజ్య సంస్థ నుండీ భారత దేశం బయటకు రావాలని, స్వేచ్చా వాణిజ్య ఒప్పందాలను రద్ధు చేయాలని , విద్యుత్ బిల్లును ఉపసంహరించుకోవాలని రైతులు చేసే డిమాండ్లు ఆయనకు పనికి మాలిన డిమాండ్లుగా కనిపించాయి. రైతు సంఘాలు, తప్పుడు వాదనలతో ఈ డిమాండ్లు ముందుకు తెచ్చి, రైతులను పక్కదారి పట్టిస్తున్నాయని కూడా ఈ వ్యాసంలో ఆయన విమర్శించారు. పైగా రైతుల డిమాండ్లను నెరవేర్చడానికి బడ్జెట్ లో డబ్బులు ఎక్కడి నుండీ వస్తాయని కూడా ఆయన వాపోయారు.
డాక్టర్ జేపీ చేసే ఈ వాదనలన్నీ రైతుల గొంతును బలహీన పరిచి, మోడీ ప్రభుత్వ చర్యలను బలపరిచేవే . అంటే అసంఘటితమైన, ఆర్ధికంగా బలహీనమైన భారత రైతులను తిమింగలాల వంటి కార్పొరేట్ మార్కెట్ శక్తులకు వదిలేసి, ప్రభుత్వం పక్కకు తప్పుకోవాలని ఆయన చెప్పకనే చెబుతున్నారన్నమాట.
2020 జూన్ లో మోడీ ప్రభుత్వం తెచ్చిన మూడు రైతు వ్యతిరేక చట్టాలను దేశమంతా వ్యతిరేకిస్తే, డాక్టర్ జేపీ మాత్రం వాటిని బలంగా సమర్ధించారు. రైతు ఉద్యమ ఒత్తిడికి లొంగి, మోడీ ప్రభుత్వం ఆ మూడు చట్టాలను రద్ధు చేయడాన్ని కూడా ఆయన మింగలేక పోయారు. ప్రభుత్వం చేతకాని తనాన్ని ప్రదర్శించి, రైతులకు లొంగిపోయిందని విమర్శించారు.
1990 దశకం నుంచి నూతన ఆర్ధిక, పారిశ్రామిక విధానాల సమర్ధకుడిగా, దేశ అభివృద్ధి నమూనాలో ప్రభుత్వాల పాత్ర తగ్గి, మార్కెట్ శక్తుల క్రియాశీల పాత్ర పెరగాలని ఆయన కోరిక. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించాలని, అన్ని రంగాల లోకీ విదేశీ పెట్టుబడులు, విదేశీ వాణిజ్య సంస్థలు రావాలని, దేశాల మధ్య వాణిజ్యంలో ,స్వేచ్చా వాణిజ్య ఒప్పందాలు ముఖ్యమైన పాత్ర పోషించాలని డాక్టర్ జేపీ గట్టిగా వాదిస్తారు.
ఈ దేశం సంక్షేమ రాజ్యంగా వర్ధిల్లాలని, పేదరికం, ఆర్ధిక అసమానతలూ, సామాజిక వివక్షా దేశంలో కొనసాగినన్ని రోజులూ ప్రభుత్వాలు ప్రజల పట్ల మరింత బాధ్యతతో వ్యవహరించాలని భారత రాజ్యాంగం కోరుకుందనీ మర్చిపోయి, ప్రజాస్వామ్య సంస్కరణల వేదిక పేరుతో పని చేసే డాక్టర్ జేపీ చేసే వాదనలు చూస్తే, దేశంలో ఆయన ఎటువంటి సంస్కరణలను కోరుకుంటున్నారో స్పష్టమవుతుంది.
కార్పొరేట్ కంపెనీల ప్రయోజనాలకు పెద్ద పేట వేస్తూ, ప్రభుత్వ రంగ సంస్థలను తెగ నమ్ముతూ, మొత్తం దేశ పాలనా వ్యవస్థలో కీలక సంస్థలను తన నియంత్రణలోకి తెచ్చుకుంటూ, రాష్ట్రాల హక్కులను కూడా హరిస్తూ, దేశ ప్రజల పట్ల అత్యంత నిరంకుశ పాలకుడిగా వ్యవహరిస్తున్న మోడీని, ఆయన విధానాలను డాక్టర్ జేపీ అమితంగా ఆరాధిస్తారని కూడా మనం ఈ సందర్భంగా గుర్తుంచుకోవాలి.
మొత్తం ప్రభుత్వ యంత్రాంగం అవినీతిలో కూరుకు పోయింది కనుక, ప్రజలు దానిపై ఆధారపడ కూడదని , సమర్ధంగా పని చేసే ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలు, ప్రజలకు న్యాయం చేస్తాయని కూడా ఆయన నమ్ముతున్నారు. మనల్ని నమ్మమంటున్నారు .
వివిధ రంగాలలో ప్రైవేట్ సంస్థల, ముఖ్యంగా కార్పొరేట్ సంస్థల వైఫల్యం, ప్రభుత్వాలు పెద్ద ఎత్తున పన్ను రాయితీలు అందించినా, ఆయా సంస్థలను నడపలేక ఆర్ధికంగా దివాళా తీయడం, బ్యాంకుల నుం,ి ఈ సంస్థలు తీసుకున్న రుణాలను ఎగ్గొట్టడం –వీటిపై ఆయన పెద్దగా విమర్శనాత్మకంగా స్పందించరు.
ఈ బడా కార్పొరేట్ సంస్థలకు దేశ సహజ వనరులను కట్టబెట్టడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలను కూడా ఆయన పెద్దగా విమర్శించరు . ఆయా ప్రైవేట్ సంస్థల లాభాపేక్షపై, అక్రమ పద్ధతులపై ఎప్పుడైనా ప్రభుత్వాలు విధించే ఆంక్షలను మాత్రం ఆయన సహించరు. పైగా అటువంటి వాటిని లైసెన్స్ రాజ్ చర్యలుగా విమర్శిస్తారు.
భారత రైతుల ఆదాయాలు పెంచడానికి ప్రభుత్వాలు నిర్ధిష్టంగా ఏమి చేయాల్సి ఉంటుందో ఆయన తన వ్యాసంలో ఎక్కడా సూచించలేదు. ఆయన ఈ వ్యాసంలో చేసిన కొన్ని సూచనలు - పంట ధరలని అణగ దొక్కుతున్న అన్ని నియంత్రణలను తొలగించడం, చౌక ధర దిగుమతులు వెల్లువెత్తకుండా హేతుబద్ధమైన సుంకం విధించడం, ధరల ఆంతరాల్ని తట్టుకునేలా నిల్వ, ఋణ వ్యవస్థలను బలోపేతం చేయడం , అదనపు విలువను ప్రోత్సహించడం , మార్కెట్ గొలుసును కుదించడానికి , రిటైల్ చెయిన్ల ఏర్పాటు, ఎగుమతులకు ప్రోత్సాహం వంటివి కూడా ప్రభుత్వాల పాత్రను పూర్తిగా పక్కన పెట్టి, ప్రైవేట్ రంగ పాత్రను పెంచేవే.
ఆహార శుద్ధి పరిశ్రమల ఆవశ్యకతను, నిల్వ సదుపాయాల అవసరాన్ని ఆయన గుర్తిస్తారు కానీ, ఇందులో రైతు సహకార సంఘాల పాత్రను బలోపేతం చేయడం కాకుండా, ఆయన ఆ బాధ్యతను కార్పొరేట్, ప్రైవేట్ సంస్థలకు అప్పగించాలని వాదిస్తారు.
భాష వేరు గానీ, ప్రపంచ వాణిజ్య సంస్థలో అమెరికా చాలా కాలంగా భారత దేశాన్ని అడుగుతున్న డిమాండ్లు ఇవే. మన దేశంలో కనీస మద్ధతు ధరలను ప్రకటించడం మానేయాలని, ప్రభుత్వ సేకరణను మానేయాలని, ప్రజా పంపిణీ వ్యవస్థను ఎత్తేయాలని అమెరికా చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నది. రైతుల సంక్షేమం పేరుతో భారత ప్రభుత్వం చేసే పై చర్యలన్నీ, మార్కెట్ ను వక్రీకరిస్తున్నాయని, భారత రైతులకు సరైన ధరలు అందకుండా చేస్తున్నాయని కూడా వాదిస్తున్నది.
ఈ మేరకు అమెరికా, WTO కోర్టులో భారత దేశంపై కేసు కూడా వేసింది. డాక్టర్ జయప్రకాశ్ నారాయణ చేసిన ప్రధాన సూచనలు కూడా ఈ అమెరికా చేస్తున్న వాదనల కోవకు చెందినవే.
సన్నకారు,చిన్నకారు రైతులు 80 శాతం ఉన్న మన దేశంలో ఆయన సూచనలు, నిజంగా వ్యవసాయ కుటుంబాల సంక్షోభాన్ని పరిష్కరిస్తాయా ? గ్రామం దాటి తమ ఉత్పత్తులను బయటకు తీసుకు వెళ్లలేని పరిస్థితి, రైతులు తమ ఆర్ధిక అవసరాల కోసం వెంటనే పంటను అమ్ముకోవాల్సిన ఆర్ధిక దుస్థితి ఉన్నచోట, ప్రభుత్వాల సేకరణ వ్యవస్థలు ఉనికిలో ఉండాలని , కేవలం, వరి, గోధుమ లాంటి పంటలను మాత్రమే కాకుండా ఇతర ఆహార పంటలను కూడా సేకరించడం లాంటి చర్యలను కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలని ఆయన తన వ్యాసంలో ఎక్కడా అడగలేదు.
ప్రభుత్వ జోక్యం లేకుండా, ప్రైవేట్ వ్యాపారులు, రైతులకు ఎక్కువ ధరలు చెల్లించిన ఉదాహరణలను కూడా ఆయన తన వ్యాసంలో ఎక్కడా ప్రస్తావించ లేదు. పైగా అన్ని చోట్లా ప్రైవేట్ వ్యాపారులు కనీస మద్ధతు ధరలు చెల్లించకుండా, అతి తక్కువ ధరలకే పంటలను సేకరించడానికి ప్రయత్నం చేయడం రైతులకు ఉన్న అనుభవం.
ఆయన బలంగా సమర్ధించే నూతన ఆర్ధిక విధానాలు ( ఆయన కోరుకున్నట్లుగా లైసెన్స్ రాజ్ రద్దయి ) ప్రారంభమైన గత మూడు దశాబ్ధాలుగా ప్రైవేట్ ,కార్పొరేట్ సంస్థలు రైతు కుటుంబాలను అప్పుల ఊబి నుండీ ఎందుకు బయట పడ వేయలేక పోయాయో, రైతు కుటుంబాల ఆదాయాలను ఎందుకు పెంచలేకపోయాయో, ఈ మూడు దశాబ్ధాలలో మూడు లక్షల మంది రైతులు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారో, ఆయన మనకు ఎప్పుడూ చెప్పరు.
అమెరికా, యూరప్ లలో పూర్తిగా , కార్పొరేట్ ఆర్ధిక వ్యవస్థ వ్యవసాయ రంగాన్ని శాశిస్తున్నప్పటికీ, అక్కడి ప్రభుత్వాలు వందల బిలియన్ల డాలర్లు అక్కడి రైతులకు సబ్సిడీలుగా ఎందుకు అందిస్తున్నాయో కూడా ఆయన మనకు చెప్పడు. ఆయా దేశాల రైతులలో కూడా ప్రతి సంవత్సరం చిన్న రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారో కూడా ఆయన మనకు వివరణ ఇవ్వడు .
కానీ మళ్ళీ మళ్ళీ వ్యవసాయ కుటుంబాల సంక్షోభ నివారణ బాధ్యతను కార్పొరేట్ సంస్థల కేంద్రంగా పని చేసే మార్కెట్ వ్యవస్థ పైనే ఆయన పెడతారు.ఆయన లక్ష్యం స్పష్టం. రైతులే ఆయనను మరింత లోతుగా కొత్త కోణంలో అర్థం చేసుకోవాల్సిన అవసరముంది.
(*కన్నెగంటి రవి, రైతు స్వరాజ్యవేదిక, హైదరాబాద్)
Next Story