వీళ్లు తెలంగాణ కాంగ్రెస్ అపూర్వ సహోదరులు, సీక్రెట్ ఏమిటి?
x
MALLU BROTHERS

వీళ్లు తెలంగాణ కాంగ్రెస్ అపూర్వ సహోదరులు, సీక్రెట్ ఏమిటి?

తెలంగాణ కాంగ్రెస్ ఖాన్ దాన్ రాజకీయాలు సాగుతున్నాయి.గడ్డం బ్రదర్స్, కోమటిరెడ్డి బ్రదర్స్, ఇప్పుడు మల్లు బ్రదర్స్ రాజకీయాల్లో రాణిస్తున్నారు.


తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో మల్లు బ్రదర్స్ అంటే తెలియని వారుండరు...ఖమ్మం జిల్లా వైరా మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన ముగ్గురు మల్లు బ్రదర్స్ కాంగ్రెస్ పార్టీ విధేయులుగా పనిచేస్తూ రాజకీయాల్లో రాణిస్తున్నారు. కాంగ్రెస్ వారసత్వ రాజకీయాల్లో మల్లు బ్రదర్స్ సాధించిన విజయాలు చర్చనీయాంశంగా మారాయి. మల్లు బ్రదర్స్‌లో ఒకరైన మల్లు భట్టివిక్రమార్క గతంలో కాంగ్రెస్ పార్టీ లెజిస్లేచర్ నాయకుడిగా ఉండి, అనూహ్యంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఏకంగా డిప్యూటీ సీఎం అయ్యారు. దీంతో రాజకీయాల్లో మల్లు బ్రదర్స్ విజయ ప్రస్థానం వార్తల్లోకి ఎక్కింది.


బిగ్ బ్రదర్ మల్లు అనంతరాములు ప్రస్థానం
ఖమ్మం జిల్లాకు చెందిన మల్లు అనంతరాములు కాంగ్రెస్ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షుడు కావడంతో ఆయన బ్రదర్స్ మల్లు భట్టి విక్రమార్క, మల్లు రవిలు రాజకీయ తెరమీదకు వచ్చారు. ఎంఏ పొలిటికల్ సైన్సు పూర్తి చేసిన అనంతరాములు 1962వ సంవత్సరంలో గ్రామాభివృద్ధి అధికారిగా ఉద్యోగంలో చేరారు. ప్రభుత్వ ఉద్యోగిగా గ్రామ అభివృద్ధి ఆఫీసర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, ఆంధ్రప్రదేశ్ పంచాయితీరాజ్ ఉద్యోగుల సమస్వయ కమిటీకి చైర్మన్‌గా 16 సంవత్సరాలపాటు ఈయన పనిచేశారు.

ఎంపీ నుంచి పీసీసీ అధ్యక్షుడి దాకా...
1978వ సంవత్సరంలో ఉద్యోగ సంఘ నాయకుడిగా ఎదిగిన మల్లు అనంతరాములు ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఖమ్మం జిల్లా స్వస్థలమైనా తన ఎన్నికల కార్యక్షేత్రంగా ఎస్సీ రిజర్వుడ్ ఎంపీ స్థానం నాగర్ కర్నూల్ ను ఎంచుకున్నారు. 1980,1989 సంవత్సరాల్లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మల్లు అనంతరాములు కాంగ్రెస్ ఎంపీగా విజయం సాధించారు. అనంతరం కేంద్రమంత్రిగా కూడా పనిచేశారు. అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ పార్లమెంట్ కమిటీలో ప్రతినిధిగా రెండు సార్లు విదేశాలకు వెళ్లారు. 1986వ సంవత్సరంలో రాజీవ్ గాంధీ ఆధ్వర్యంలో స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఛైర్మన్‌గా ,అఖిల భారత కాంగ్రెస్ కమిటీకి జాయింట్ సెక్రటరీగా పనిచేశారు. 1989లో పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు.అనంతరం మల్లు అనంతరాములు పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. రాజకీయాల్లో ఉన్నత స్థానానికి చేరిన మల్లు అనంతరాములు 1990 ఫిబ్రవరి 7వతేదీన గుండెపోటుతో మరణించారు.

వివాదాలకు అతీతంగా...లాయల్టీగా...
మల్లు భట్టివిక్రమార్క, మల్లు రవి బ్రదర్స్ వివాదాలకు అతీతంగా, కాంగ్రెస్ పార్టీకి లాయల్ గా వ్యవహరిస్తుంటారు. మల్లు బ్రదర్స్ కుటుంబాలు వివాదాస్పద వ్యాపారాల్లో లేవు. భట్టి విక్రమార్క, మల్లు రవి పదహారణాల కాంగ్రెస్ వాదులు. గతంలో భట్టి విక్రమార్కను బీఆర్ఎస్ పార్టీ వైపు లాగే ప్రయత్నాలు జరిగాయి. అవేవి సక్సెస్ కాలేదు. భట్టి సొంత నియోజకవర్గమైన మధిరలో కేసీఆర్ దళితబంధు అమలు చేశారు. ఆ సందర్భంగా భట్టి గత బీఆర్ఎస్ సర్కారుకు మంచి సూచనలు చేశారు. పార్టీ మారమని చేసినా ప్రయత్నాలను కాదని కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ కాంగ్రెస్ విధేయుడిగా ఆ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు విశేష కృషి చేశారు.

కీలక నేతలకు సన్నిహితుడిగా మల్లు రవి
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా మల్లు రవి కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నారు. కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీ‌తో ఉన్న నాయకుడిగా ఆయనకు పేరుంది. తొలుత ఆయన అప్పటి సీఎం కోట్ల బీజయభాస్కర్ రెడ్డి అనుచరుడు. కోట్ల మరణం తర్వాత ఆయన వైస్సార్ కు సన్నిహితుడు అయ్యారు. ఎన్నికల్లో ఓడిపోతే పరిగెత్తుకుంటూ పోయి వేరే పార్టీలో చేరని నాయకులెవరైనా ఉంటే అందులో మల్లు రవి ఒకరు. హై కమాండ్ దగ్గర మల్లు రవికి ఉన్న పట్టుకు ఆదే కారణం.కాంగ్రెస్ పార్టీ విధేయ నేతల్లో ఒకరైన మల్లు రవికి నాగర్ కర్నూల్ ఎంపీ టికెట్ ఇచ్చి పార్టీ గౌరవించింది.

సోదరుడి బాటలో భట్టి
ఖమ్మం జిల్లాకు చెందిన మల్లు అనంతరాములు సోదరుడైన మల్లు భట్టివిక్రమార్క రాజకీయాల్లో రాణిస్తున్నారు. నిజాం కళాశాలలో డిగ్రీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో పీజీ చదివిన భట్టి తన పెద్దఅన్నయ్య బాటలో పయనిస్తూ 1990వ సంవత్సరంలో రాజకీయాల్లోకి వచ్చారు.పీసీసీ కార్యవర్గ సభ్యుడిగా తన రాజకీయ ప్రస్థానాన్ని ఆరంభించిన భట్టి 8 ఏళ్లకు పీసీసీ కార్యదర్శి అయ్యారు. 2007వ సంవత్సరంలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.

ఓటమి ఎరగని నేత...మల్లు భట్టివిక్రమార్క
మల్లు భట్టివిక్రమార్క మొదటి సారి ఖమ్మం జిల్లా మధిర ఎస్సీ రిజర్వుడ్ అసెంబ్లీ స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి విజయ ఢంకా మోగించారు. అనంతరం వరుసగా జరిగిన 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లోనూ విజయం సాధించి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా నిలిచారు. మధిర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బోడెపుడి వెంకటేశ్వరరావు తర్వాత భట్టి విక్రమార్క మూడు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించి రికార్డు నెలకొల్పారు. ఓటమి ఎరగని నేతగా భట్టి ప్రత్యేక గుర్తింపు పొందారు. కాంగ్రెస్ పార్టీకి లాయల్ గా ఉండటం వల్లనే మల్లు బ్రదర్స్ రాజకీయంగా ఎదిగారని ఖమ్మం జిల్లాకు చెందిన సీనియర్ జర్నలిస్ట్ సీ ఆదినారాయణ చెప్పారు.

రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగి...
మల్లు భట్టి విక్రమార్క అంచెలంచెలుగా ఎదిగి ఏకంగా తెలంగాణ డిప్యూటీ సీఎం అయ్యారు. 2009వ సంవత్సరంలో మొదటి సారి ఎమ్మెల్యే కాగానే చీఫ్ విప్ అయ్యారు. అనంతరం 2011వ సంవత్సరంలో డిప్యూటీ స్పీకరు అయ్యారు. 2019వ సంవత్సరంలో భట్టిని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ లెజిస్లేచర్ నాయకుడిగా కాంగ్రెస్ అధిష్ఠానవర్గం నియమించింది. సీఎల్పీ నేతగా ఉండి 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలంగాణలో పాదయాత్ర చేసిన భట్టి ఎన్నికల్లో విజయం సాధించాక డిప్యూటీ సీఎం అయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో కీలకమైన ఆర్థికశాఖ, ప్రణాళిక, విద్యుత్ శాఖల మంత్రిగా భట్టి పనిచేస్తున్నారు.

నాగర్ కర్నూల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మల్లు రవి
అనంతరాములు బ్రదర్స్ లో ఒకరైన మల్లు రవి కూడా రాజకీయంగా అనూహ్యంగా ఎదిగారు. బిగ్ బ్రదర్ అనంతరాములు పీసీసీ అధ్యక్షుడు అయ్యాక మల్లు కుటుంబానికి రాజకీయంగా ప్రత్యేక గుర్తింపు వచ్చింది. 1990వ సంవత్సరంలో నాగర్ కర్నూల్ నియోజకవర్గ సిట్టింగ్ ఎంపీ అయిన మల్లు అనంతరాములు మరణించడంతో అతని సోదరుడైన మల్లు రవి 1991 పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి ఎంపీ అయ్యారు. అనంతరం 1998 పార్లమెంట్ ఎన్నికల్లోనూ మల్లు రవి 19,675 ఓట్ల మెజారిటీతో రెండోసారి ఎంపీగా గెలిచారు.

తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి పదవిని వదిలి... ఎన్నికల బరిలో దిగి...
ప్రస్థుతం టీపీసీసీ ఉపాధ్యక్షుడిగా ఉన్న మల్లు రవి ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధిగా కూడా పనిచేశారు. ఇటీవల ఆ పదవికి రాజీనామా చేసి నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగారు. మల్లు రవి 2008 ఉప ఎన్నికల్లో జడ్చర్ల నుంచి పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు. అనంతరం 2009, 2014అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినా ఓటమి పాలయ్యారు. తాజాగా పార్లమెంట్ బరిలోకి మల్లు రవి దిగారు.






Read More
Next Story