
అదృష్టమంటే కొంగర మల్లమ్మదే..సర్పంచ్ గా జాక్ పాట్
సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించటమే ఆలస్యం
అధికారుల తప్పులు కొందరికి శాపంగా మారితే మరికొందరికి వరంగా మారుతుంది. అధికారులు చేసిన తప్పుల వల్ల అదృష్టదేవత కొందరి తలుపుతట్టి మరీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అధికారులు చేసిన తప్పువల్లే కొంగర మల్లమ్మ అనే ఎస్సీ మహిళ ఏకగ్రీవంగా సర్పంచ్ అయిపోయింది. సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించటమే ఆలస్యం. ఇంతకీ విషయంఏమిటంటే జనగామజిల్లా జఫర్ గఢ్ మండలంలో రామారం అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో కొంగరమల్లమ్మ, కొంగర వెంకటయ్య దంపతులున్నారు. వీళ్ళు బ్రతుకుతెరువు కోసం ఎక్కడి నుండో రామారం గ్రామానికి ముగ్గురు పిల్లలతో చేరుకున్నారు.
కాలక్రమంలో పిల్లలు అందరికీ వివాహాలు చేసి పంపించేశారు. ఈమధ్యనే వెంకటయ్య కూడా మరణించగా మల్లమ్మ ఒంటరిగా జీవిస్తోంది. ఎస్సీ సామాజికవర్గంకు చెందిన వాళ్ళు రామారం గ్రామం మొత్తంమీద ఎవరైనా ఉన్నారంటే అది మల్లమ్మ మాత్రమే. ఇపుడు విషయంఏమిటంటే తొందరలో జరగబోయే సర్పంచ్ ఎన్నికలకు అధికారులు రిజర్వేషన్లు ఖరారుచేశారు. ఇందులో రామారం సర్పంచ్ సీటు ఎస్సీ, మహిళకు రిజర్వయ్యింది. రామారం పంచాయితి ఎస్సీ, మహిళకు రిజర్వు అయ్యింది కాబట్టి గ్రామంలోని ఏకైక ఎస్సీ మహిళ మల్లమ్మ సర్పంచ్ అయిపోయినట్లే.
పంచాయితి ఎస్సీ, మహిళకు రిజర్వ్ అవటాన్ని ఇతరసామాజికవర్గాలు అంగీకరించటంలేదు. వెంటనే రిజర్వేషన్ మార్చాలంటు మాజీ సర్పంచ్ కిశోర్ యాదవ్ తో పాటు కాంగ్రెస్ మండలఅధ్యక్షుడు మాధవరెడ్డి తదితరులు అభ్యంతరాలు వ్యక్తంచేస్తున్నారు. అధికారులను కలిసి ఇదే విషయాన్ని డిమాండ్ చేశారు. జిల్లా పంచాయితి అధికారి రామిరెడ్డితో కూడా మాట్లాడారు. ఒకసారి రిజర్వేషన్లు ఖరారైన తర్వాత దాన్నిమర్చటం సాధ్యంకాదని రామిరెడ్డి బదులిచ్చారు. దాంతో ఏమిచేయాలో తెలీక గ్రామంలోని పెద్దలు దిక్కులు చూస్తున్నారు. ఇదేసమయంలో మల్లమ్మ అదృష్టంపై గ్రామంలోని జనాలు పెద్దఎత్తున చర్చించుకుంటున్నారు.
అధికారులదే తప్పు
హోలు మొత్తంమీద అర్ధం అవుతున్నది ఏమిటంటే తప్పంతా అధికారులదే అని. రామారం గ్రామ పంచాయితి ఎస్సీ, మహిళకు ఎలాగ రిజర్వయ్యింది ? ఎలాగంటే అధికారులు 2011 జనాభా లెక్కలను ఆధారంగా తీసుకున్నారు. విచిత్రం ఏమిటంటే ఎనుముల రేవంత్ రెడ్డి ప్రభుత్వం 2025లో కులగణన చేయించింది. తాజా లెక్కలను చూసుకుని రిజర్వేషన్ విధానాన్ని పాటించేందుకు కోర్టునుండి అనుమతి తీసుకునుండవచ్చు. అయితే ఆపని చేయకుండానే 2011 జనభా లెక్కల ప్రకారం అధికారులు రిజర్వేషన్లకు లాటరీ తీశారు. దాంతో రామారం గ్రామ పంచాయితి ఎస్సీ, మహిళకు రిజర్వయపోయింది. 2011 లెక్కల ప్రకారం గ్రామజనాభా 1807 మంది. అప్పటిలెక్కల ప్రకారమైతే ఎస్సీ జనాభా 350గా ఉంది. అయితే వివిధ కారణాలతో 14 ఏళ్ళల్లో గ్రామంలోని ఎస్సీల్లో కొందరు చనిపోయారు, కొందరు వివాహాలు చేసుకుని తరలిపోయారు. మరికొందరు ఉద్యోగాల్లో ఇంకెక్కడికో వెళ్ళిపోగా మిగిలింది మల్లమ్మ ఒక్కతే. కాబట్టి మల్లమ్మే రామారం గ్రామ సర్పంచ్ గా ఏకగ్రీవంగా జాక్ పాట్ కొట్టేసింది.