
హైదరాబాద్‌కు చేరుకున్న మాధవీలత, జేసీల వివాదం..
నటి మాధవీలత, టీడీజేపీ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభామకర్ మధ్య తీవ్ర వివాదం జరుగుతోంది.
నటి మాధవీలత, టీడీజేపీ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ మధ్య తీవ్ర వివాదం జరుగుతోంది. ఇప్పటికే ఈ అంశంపై ఫిర్యాదుల వరకు వెళ్లింది. తాజాగా ఇది హైదరాబాద్‌కు చేరుకుంది. జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలతో తీవ్ర మనస్తాపం చెందిన మాధవీలత.. న్యాయపోరాటం చేయాలని నిశ్చయించుకున్నారు. ఈ క్రమంలోనే సైబరాబాద్ పోలీస్ స్టేషన్‌లో టీడీపీ నేతపై ఫిర్యాదు చేశారు. తనను అసభ్య పదజాలంతో దూషించి తన పరువుకు భంగం కలిగించారని, ఇందుకుగానూ జేపీ ప్రభాకర్ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ మాధవీలత తన ఫిర్యాదులో కోరారు. తాను సైబరాబాద్ కమిషనరేట్‌లో రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో 15 సంవత్సరాలుగా నివాసం ఉంటున్నానని, ఈ నేపథ్యంలోనే తనపై జేసీ చేసిన వ్యాఖ్యలపై సైబరాబాద్‌లో ఫిర్యాదు చేసినట్లు మాధవీలత తెలిపారు.
బహిరంగ క్షమాపణ చెప్పిన జేసీ
మాధవీలతను ఉద్దేశించి తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు జేసీ ప్రభాకర్ బహిరంగంగా వెల్లడించారు. మాధవీలతకు క్షమాపణలు కూడా చెప్పారు. కానీ మాధవీ మాత్రం వెనక్కు తగ్గడం లేదు. జేసీపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. ‘‘ఒక మహిళ గురించి అలా మాట్లాడి ఉండకూడదు. వయసు, ఆవేశంలో అలా మాట్లాడేశాను. ఆమెపై నేను చేసిన వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణలు చెప్తున్నాను. నా వయసు 72 సంవత్సరాలు. ఆవేశంలో నోరుజారి అలా మాట్లాడానే తప్ప ఎవరినీ కించపరచాలని కాదు. ఎవరి బతుకుతెరువు వారిది’’ అని జేసీ క్షమాపణలు చెప్పారు.
అసలు వివాదం ఏంటంటే..
తాడిపత్రిలోని జేసీ పార్కులో డిసెంబర్ 31న నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు. మహిళల కోసం పరత్యేకంగా ఈ వేడుకలు చేశారు. కాగా ఈ వేడుకల్లో మహిళలు ఎవరూ పాల్గొనవద్దని, వారి రక్షణకు ఇబ్బందులు కలిగే అవకాశం ఉందంటూ మాధవీ ఓ వీడియోను విడుదల చేసింది. దీనిపై స్పందించిన జేసీ.. మాధవీలతను ఉద్దేశించి పరుష పదజాలం వాడారు. ఆ మాటలకే మాధవీలత తొలుత ‘మా’ అసోసియేషన్‌లో ఫిర్యాదు చేసింది. తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేసింది.