Madhavi Latha
x
image source : twitter

Madhavi Latha | 'యుద్ధం ప్రకటిస్తున్నాను.. నా శవాన్ని దాటాల్సిందే..'

హైదరాబాద్ బిజెపి పార్లమెంటు అభ్యర్థిగా బరిలో దిగిన మాధవి లత (Madhavi Latha) స్పీడ్ పెంచారు. నియోజకవర్గంలో ఎన్నికల సమాయత్తానికి కార్యాచరణను ప్రారంభించారు.


హైదరాబాద్ బిజెపి పార్లమెంటు అభ్యర్థిగా బరిలో దిగిన మాధవి లత స్పీడ్ పెంచారు. నియోజకవర్గంలో ఎన్నికల సమాయత్తానికి కార్యాచరణను ప్రారంభించారు. గత సంవత్సర కాలంగా వివిధ సేవా కార్యక్రమాలు చేపడుతూ స్థానిక ప్రజలకు సుపరిచితురాలయ్యారు. బిజెపి అధిష్టానం ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీపై పోటీకి మాధవి లత పేరును ప్రకటించిన నాటి నుంచి ప్రత్యక్ష రాజకీయ అడుగులు వేస్తున్నారు.


ఎంఐఎం ప్రాతినిధ్యంలో పాతబస్తీ అభివృద్ధికి నోచుకోలేదని, ఇక్కడి ప్రజలను పాలకులు నిర్లక్ష్యం చేశారని ఎత్తిచూపే ప్రయత్నం చేస్తున్నారు. తనని ఎన్నుకుంటే ఓల్డ్ సిటీని సమస్యల కూపం నుండి బయటకి తెస్తానని చెబుతున్నారు. హైదరాబాద్ లో కేవలం ముస్లింలే కాదని, 8 లక్షలకు పైగా హిందూ ఓటర్లు ఉన్నారని వారంతా తమ ధర్మాన్ని కాపాడుకునేందుకు బీజేపీకి ఓట్ వేయాలని పిలుపునిస్తున్నారు. అలాగే, ఓల్డ్ సిటీ పరిధిలో అనేక చారిత్రాత్మక హిందూ దేవాలయాలు దుస్థితిలో ఉన్నాయని, వాటిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ఉందని నొక్కి చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఎన్నికల వేళ హనుమాన్ టెంపుల్ వేదికగా ఆందోళన చేపట్టారు.

శిఖరం తాకాలంటే నా శవాన్ని దాటాలి.. మాధవీలత

ఎన్నికల దూకుడు పెంచిన బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీ లత ప్రభుత్వం పై పోరాటానికి దిగారు. సైదాబాద్‌లోని హనుమాన్‌ ఆలయంపై నుంచి స్టీల్‌ బ్రిడ్జి నిర్మించాలన్న పౌరసరఫరాల సంస్థ నిర్ణయానికి వ్యతిరేకంగా బీజేపీ నాయకులు, స్థానిక భక్తులతో కలిసి నిరసనకు దిగారు. స్టీల్‌ బ్రిడ్జిని మార్చాలని కోరుతూ స్థానిక భక్తులు, BJP నాయకులు మంగళవారం హనుమాన్‌ దేవాలయం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నారు.


ఈ సందర్భంగా మాధవీలత మాట్లాడుతూ.. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా జీహెచ్‌ఎంసీ అధికారులు సైదాబాద్ హనుమాన్ దేవాలయం పై స్టీల్ బ్రిడ్జి కడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హనుమాన్ దేవాలయం పై చేపట్టిన స్టీల్ బ్రిడ్జి నిర్మాణం వెంటనే ఆపాలని ఆమె డిమాండ్ చేశారు. దీనిపై జీహెచ్‌ఎంసీ అధికారికంగా ప్రకటన చేసే వరకు నిరాహారదీక్షలో ఉంటానని హెచ్చరించారు. "యుద్ధం ప్రకటిస్తున్నాను.. ఇక్కడే కూర్చుంటాను.. హనుమాన్ దేవాలయ శిఖరం తాకాలంటే ముందు నా శవాన్ని దాటాలంటూ" శపథం చేశారు.



స్టీల్ బ్రిడ్జితో తగ్గనున్న ట్రాఫిక్..

నల్గొండ క్రాస్‌ రోడ్స్‌ నుంచి ఒవైసీ జంక్షన్‌ వరకు సాఫీగా ప్రయాణించేందుకు జీహెచ్‌ఎంసీ ఈ స్టీల్‌ ఫ్లైఓవర్‌ను నిర్మిస్తోంది. హనుమాన్ ఆలయంపై నుంచి నిర్మించే ఈ నాలుగు లేన్ల స్టీల్ బ్రిడ్జి నల్గొండ క్రాస్ రోడ్స్ - సైదాబాద్ - ఐఎస్ సదన్ నుండి ఒవైసీ జంక్షన్ వరకు ట్రాఫిక్ సమస్యను తగ్గిస్తుంది. IS సదన్ జంక్షన్ వద్ద అప్ అండ్ డౌన్ ర్యాంప్ కారిడార్‌కు యాక్సెస్‌తో స్టీల్ పీర్, స్టీల్ పీర్ క్యాప్, స్టీల్ గిర్డర్‌లతో వంతెన నిర్మించబడుతుంది.


రూ. 523.37 కోట్ల అంచనా వ్యయంతో తెలంగాణ ప్రభుత్వ వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి ప్రణాళిక (ఎస్‌ఆర్‌డిపి) కింద ఈ 3.38 కి.మీ నాలుగు లేన్‌ల బై డైరక్షనల్ ఫ్లైఓవర్‌ను నిర్మిస్తున్నారు. ఈ వంతెన కోసం GHMC యొక్క ప్రణాళికలో రూ. 370 కోట్ల నిర్మాణ ఖర్చుతో పాటు రూ. 153.37 కోట్ల భూ సేకరణ వ్యయం కూడా ఉంది. హనుమాన్‌ దేవాలయంపై స్టీల్‌ బ్రిడ్జి ఏర్పాటు చేయడం వల్ల నల్గొండ క్రాస్‌ రోడ్స్‌, ఒవైసీ హాస్పిటల్‌ జంక్షన్‌ మధ్య తలెత్తే ట్రాఫిక్‌ ఇబ్బందులు కూడా తీరే అవకాశం ఉంది.

Read More
Next Story