తెలంగాణ కాంగ్రెస్‌లో మాదిగల కల్లోలం
x
GANDHI-BHAVAN (Photo Credit : Facebook)

తెలంగాణ కాంగ్రెస్‌లో మాదిగల కల్లోలం

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మాదిగలు కల్లోలం రేపుతున్నారు. మూడు ఎస్సీ రిజర్వుడ్ స్థానాలున్నా, ఒక్క టికెట్ కూడా మాదిగలకు కేటాయించక పోవడంతో మాదిగలు పోరుబాట పట్టారు.


తెలంగాణ రాష్ట్రంలోని ఎస్సీ సామాజిక వర్గంలో 70 శాతం మంది ప్రజలు మాదిగలున్నారు. రాష్ట్రంలో మూడు పార్లమెంట్ సీట్లు ఎస్సీలకు రిజర్వు చేయగా, మూడు స్థానాల్లోనూ కనీసం ఒక్క మాదిగ నాయకుడికి కాంగ్రెస్ టికెట్ కేటాయించక పోవడంతో ఆ పార్టీలోని మాదిగ నేతలు రగిలిపోతున్నారు.

- కాంగ్రెస్‌ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ నాగర్‌కర్నూల్‌ (మల్లు రవి), పెద్దపల్లి (గడ్డం వంశీ), వరంగల్‌ (కడియం కావ్య)లకు కాంగ్రెస్ టికెట్లు ప్రకటించింది. మూడు ఎస్సీ రిజర్వ్‌ స్థానాలను మాల సామాజికవర్గానికే కేటాయించడంతో ఒక్క టికెట్టు కూడా దక్కని మాదిగ సామాజికవర్గం నేతలు పోరుబాట పట్టారు.

బీజేపీ మాదిగలకు ప్రాధాన్యం
తెలంగాణలోని మూడు ఎస్సీ రిజర్వుడు స్థానాల్లో బీజేపీ టికెట్లు ఇద్దరు మాదిగలకు, మాల ఉపకులమైన ఒక నేతకాని వర్గానికి కేటాయించింది. బీజేపీ నాగర్ కర్నూల్ అభ్యర్థిగా మాదిగ సామాజిక వర్గానికి చెందిన పోతుగంటి భరత్‌ను ఎంపిక చేసింది. సిట్టింగ్ ఎంపీగా ఉన్న పోతుగంటి రాములు ఇటీవల బీఆర్ఎస్ పార్టీ నుంచి కాషాయ తీర్థం స్వీకరించారు. వరంగల్ పార్లమంట్ సీటు నుంచి మాదిగ సామాజికవర్గానికి చెందిన అరూరి రమేశ్‌ను అభ్యర్థిగా నిర్ణయించింది. ఆరూరి రమేశ్‌ ఇటీవల బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరారు.పెద్దపల్లి బీజేపీ అభ్యర్థిగా నేతకాని కులానికి చెందిన గోమాస శ్రీనివాస్‌కు టికెట్ కేటాయించింది. శ్రీనివాస్ గతంలో బీఆర్ఎస్ నుంచి పోటీచేసినా, తాజాగా బీజేపీలో చేరి అభ్యర్థి అయ్యారు.

ఎస్సీల్లో మూడు వర్గాలకు బీఆర్ఎస్ పార్టీ టికెట్లు
బీఆర్ఎస్ పార్టీ ఎస్సీల్లోని రెండు వర్గాల నేతలకు టికెట్లు కేటాయించి, సమన్యాయం చేసింది. మూడు స్థానాల్లో ఇద్దరు మాదిగ, ఒకరు మాల సామాజికవర్గం నుంచి అభ్యర్థిని ఎంపిక చేశారు. బైండ్ల సామాజికవర్గానికి చెందిన కడియం కావ్యకు మొదట పార్టీ టికెట్ కేటాయించినా, ఆమె పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరారు. దీంతో మాదిగ వర్గానికి చెందిన డాక్టర్ మారేపల్లి సుధీర్ కుమార్ పేరును గులాబీ బాస్ కేసీఆర్ ప్రకటించారు. బీఆర్ఎస్ నాగర్ కర్నూల్ అభ్యర్థిగా మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌ను అభ్యర్థిత్వాన్ని కేసీఆర్ ప్రకటించారు. బీఎస్పీ పార్టీ నుంచి బీఆర్ఎస్‌లో చేరిన ఈ మాజీ ఐపీఎస్‌ అధికారికి బీఆర్ఎస్ టికెట్ కేటాయించింది. పెద్దపల్లి నుంచి మాల సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కు గులాబీ బాస్ టికెట్‌ ఇచ్చారు.

రెండు సీట్లలోనూ మాల నేతలకే కాంగ్రెస్ టికెట్
మూడు ఎస్సీ రిజర్వుడు స్థానాలకు కాంగ్రెస్ పార్టీ అధికారికంగా అభ్యర్థులను ప్రకటించింది. రెండు సీట్లను మాలలకే కేటాయించారు. మూడో స్థానం మాదిగ ఉప కులమైన బైండ్ల సామాజికవర్గానికి చెందిన కడియం కావ్యకు కేటాయించారు. నాగర్ కర్నూల్ స్థానం నుంచి మాల సామాజికవర్గానికి చెందిన మల్లు రవికి, పెద్దపల్లి నుంచి మాల సామాజికవర్గానికి చెందిన గడ్డం వంశీకృష్ణను అభ్యర్థులుగా కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ప్రకటించింది. ఓట్ల శాతంలో అధికంగా ఉన్నా, జనాభా ప్రాతిపదికగా తమ మాదిగ వర్గానికి టికెట్లు కేటాయించక పోవడంతో కాంగ్రెస్ పార్టీలోని మాదిగ నేతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

మాదిగ నేతల పోరుబాట
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాల కావడం వల్లే మాదిగలకు అన్యాయం జరుగుతుందని ఆ పార్టీలోని కొందరు కాంగ్రెస్ నేతలు ఆరోపించారు.పెద్దపల్లి, వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గాల్లో మాదిగ ఓటర్లు అధికంగా ఉన్నా, మాలవర్గాల నేతలకు కాంగ్రెస్ టికెట్లు కేటాయించడంపై మాదిగలు మండిపడుతున్నారు. పార్లమెంట్ టికెట్ల కేటాయింపులో తమ మాదిగ వర్గానికి జరిగిన అన్యాయంపై మాదిగ దండోరా, మాదిగ ప్రజాసంఘాల జేఏసీ, మాదిగ హక్కుల పోరాట సమితి, మాదిగ రాజకీయ పోరాట వేదిక సంఘాల ప్రతినిధులు పోరుబాట పట్టారు. ఢిల్లీలో గతంలో బీఆర్ఎస్ అధికార ప్రతినిధిగా ఉన్న మందా జగన్నాథం రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కానీ మాదిగలకు జరిగిన అన్యాయంతో మందా జగన్నాథం కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి బీఎస్పీ పార్టీలో చేరి నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బీఎస్పీ అభ్యర్థిగా బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నారు.

మాదిగ జాతికి అన్యాయం చేశారు : మాజీ మంత్రి మోతుకుపల్లి నర్సిములు
మాదిగ జాతికి అన్యాయం చేశారని మాజీ మంత్రి మోతుకుపల్లి నర్సిములు ఆరోపించారు. ‘‘నాకు పార్టీ టికెట్ దక్కలేదని బాధ లేదు, నా జాతికి అవమానం జరుగుతుంది, దళిత జాతికి జరిగిన అవమానం సరి చేసుకోక పోతే మూల్యం తప్పదు నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటా, పార్టీ మారే ఉద్ధేశం నాకు లేదు, పార్టీలో ఉండి మాదిగల కోసం పోరాడుతా’’అని నర్సిములు చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో తమను అంటరాని వారీగా చూస్తున్నారని, బీజేపీ, బీఆరెస్ రెండేసి టికెట్స్ ఇచ్చారని, కాంగ్రెస్ పార్టీ ఎన్ని ఇచ్చిందని మోత్కుపల్లి ప్రశ్నించారు.

మోత్కుపల్లి దీక్ష రేపు
ఒక్కో కుటుంబలో ఇద్దరిద్దరికి టికెట్ ఇచ్చారని, కానీ మాదిగ వాళ్లు ఎం పాపం చేశారని మోత్కుపల్లి ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ముఖ్య మంత్రి కావాలని తాను కోరుకున్న వ్యక్తినని, కానీ తనకు, ఇంతవరకు సీఎం అపాయింట్మెంట్ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మాదిగ జాతికి జరిగిన అన్యాయంపై జరగబోయే పరిణామాలకు సీఎం రేవంత్ రెడ్డి దే బాధ్యత అని ఆయన చెప్పారు. ‘‘మాదిగ వారు పార్లమెంట్ కి పోవొద్దా అని ఆయన ప్రశ్నించారు.ఇప్పటికైనా కాంగ్రెస్ నేతలు తేరుకొకపోతే పార్టీకి నష్టం కలుగుతుందని, మాదిగలకు టికెట్ల కేటాయింపులో జరిగిన అన్యాయంపై నిరసనగా తాను గురువారం దీక్ష చేస్తున్నట్లు మోత్కుపల్లి ప్రకటించారు.

మాదిగల ఆందోళన
ఎస్‌టీఎస్‌ఏ రాష్ట్ర అధ్యక్షుడు తాళ్ల అజయ్‌ అధ్యక్షతన ‘‘మాదిగల వాటా కోసం మాట – సామాజిక తెలంగాణ సాధన కోసం’’ అనే అంశంపై మాదిగలు ఓయూలో సదస్సు నిర్వహించారు. మాదిగల ఆగ్రహానికి కాంగ్రెస్‌ పార్టీ గురయ్యే అవకాశం ఉందని మాజీ మంత్రి మోత్కుపల్లి హెచ్చరించారు. ఈ సదస్సులో వరంగల్‌ ఎంపీ పసునూరి దయాకర్‌, ఈరమిళ్ళ రాధిక, సురేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

మాదిగ పల్లెలకు వస్తే తరిమికొడతాం : మంద కృష్ణ మాదిగ హెచ్చరిక
పార్లమెంట్ ఎన్నికల ప్రచారం కోసం కాంగ్రెస్ నాయకులు మాదిగ పల్లెలకు వస్తే, వారిని తరిమికొడుతామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఇటీవల హెచ్చరించారు. కాంగ్రెస్‌ పార్టీపై మాదిగలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ఆయన పేర్కొన్నారు.కాంగ్రెస్ పాలనలో మాలలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని మంద కృష్ణ ఆరోపించారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తీరును వ్యతిరేకిస్తూ బుధవారం నుంచి 10 రోజుల పాటు అన్ని సంఘాలు కలిసి రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు.

మాదిగలకు సముచిత గౌరవం ఇస్తాం : సీఎం రేవంత్​రెడ్డి
కాంగ్రెస్​ ప్రభుత్వంలో మాదిగలకు సముచిత గౌరవం ఇస్తామని సీఎం రేవంత్​రెడ్డి తాజాగా హామీ ఇచ్చారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మాదిగ సామాజిక వర్గానికి చెందిన కాంగ్రెస్ నేతలు గజ్జెల కాంతం, పిడమర్తి రవి, ఊట్ల వరప్రసాద్​తో సీఎం సమావేశమయ్యారు. వివిధ అంశాలపై వారితో రేవంత్​ చర్చించారు.‘‘రాజ్యసభ, శాసనమండలితోపాటు నామినేటెడ్ పోస్టుల్లో మాదిగలకు అవకాశం కల్పిస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఎస్సీ వర్గీకరణకు తాము కట్టుబడి ఉన్నామని సీఎం చెప్పారు.


Read More
Next Story