
నామినేషన్ వేసిన సునీత..
వెంట వచ్చిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా సీనియర్ నేతలు, కార్యకర్తలు.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీత బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. ఆమెతో కలిసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా సీనియర్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. షేక్‌పేట తహశీల్దార్ కార్యాలయంలో ఆమె తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఇక ఆమె పూర్తిగా ప్రచారంపై ఫోకస్ పెట్టనున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో సునీత.. ప్రచారంలో దూకుడు కనబరుస్తున్నారు. ఆమెకు బీఆర్ఎస్ శ్రేణులు ఫుల్ సపోర్ట్ ఇస్తున్నాయి. కేసీఆర్ నుంచి బీఫాం అందుకున్న సునీత.. బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. అయితే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్.. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇటీవల ఆయన అనారోగ్య కారణాలతో మరణించడంతో నియోజకవర్గంలో ఉపఎన్నిక అనివార్యమైంది. దీంతో ఉపఎన్నిక బరిలోకి గోపీనాథ్ భార్య సునీతను బీఆర్ఎస్ నిలబెట్టింది. కాంగ్రెస్ తరుపున నవీన్ యాదవ్, బీజేపీ తరుపున లంకల దీపక్‌లో ఉపఎన్నిక పోటీలో నిలబడనున్నారు.
గోపీనాథ్ ప్రస్థానం..
మాగంటి గోపీనాథ్.. హైదరాబాద్ హైదర్‌గుడాలో జన్మించారు. ఉస్మానియా యూనివర్సిటీ అనుబంధ కాలేజీలో గ్రాడ్యుయేషన్ చేశారు. ఆయన తన పొలిటికల్ జర్నీని 1983లో తెలుగు దేశం పార్టీతో ప్రారంభించారు. 1985-1992 మధ్య ఆయన టీడీపీ యూత్ వింగ్ ‘తెలుగు యువత’ అధ్యక్షుడిగా ఉన్నారు. 1987-1989 మధ్య హైదరాబాద్ అర్బన్ డవలప్‌మెంట్ అథారిటీ డైరెక్టర్‌గా కూడా విధులు నిర్వర్తించారు. 2014లో తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో ఆయనకు 50,898 ఓట్లు వచ్చాయి. ఆ తర్వాత ఆయన టీడీపీ నుంచి టీఆర్ఎస్ పార్టీలోకి మారారు. 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ తరుపున ఆయన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా పోటీ చేశారు. వాటిలో కాంగ్రెస్ అభ్యర్థి విష్ణువర్ధన్ రెడ్డిని 16,004 ఓట్ల తేడాతో ఓడించారు. 2023 ఎన్నికల్లో ముచ్చటగా మూడోసారి విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ అభ్యర్థి మొహమ్మద్ అజారుద్దీన్‌ను 16,337 ఓట్ల తేడాతో ఓడించారు.