మహబూబ్‌నగర్‌లో సీఎం రేవంత్‌కు ఉన్న రెండు సవాళ్లివే...
x
Mahaboobnagar MP Candidates (Photo Credit : Facebook)

మహబూబ్‌నగర్‌లో సీఎం రేవంత్‌కు ఉన్న రెండు సవాళ్లివే...

పాలమూరు ఎన్నికల్లో సీఎం రేవంత్ రెండు సవాళ్లు ఎదుర్కొంటున్నారు.సిట్టింగ్ ఎంపీ, డీకే అరుణను ఓడించాలి.తన ఇలాఖాలో అసెంబ్లీ విజయ పరంపరను కొనసాగించాలి. ఇదే ఛాలెంజ్.


నిత్య కరవు పీడిత ప్రాంతంగా పేరొందిన మహబూబ్ నగర్‌ పార్లమెంట్ నియోజకవర్గానికి చెందిన కూలీలు పొట్ట చేతబట్టుకొని ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళుతుంటారు. రెక్కలు డొక్కలు కుంగిపోగా కూడు, గుడ్డ లేక పాలమూరు వలస కూలీల కష్టాలు అన్నీ ఇన్నీ కాదు...అలాంటి వలస కూలీలకు నిలయమైన పాలమూరు పార్లమెంట్ నియోజకవర్గంలో ఈ అంశమే ఎన్నికల్లో ప్రధాన ఏజెండాగా ఓటర్ల ముందుకు మరో సారి వచ్చింది.

- ఈ పార్లమెంట్ ఎన్నికల్లో సిట్టింగ్ ఎంపీ అయిన బీఆర్ఎస్ పార్టీకి చెందిన మన్నే శ్రీనివాసరెడ్డితో మాజీ ఎమ్మెల్యేలు డీకే అరుణ(బీజేపీ), వంశీచంద్ రెడ్డి(కాంగ్రెస్) పోటీ పడుతున్నారు. దీంతో పాలమూరు ఎన్నికల్లో నెలకొన్న త్రిముఖ పోరు ఆసక్తికరంగా మారింది. ముగ్గురు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలవటం మరో ప్రత్యేకత.
- బీజేపీ అభ్యర్థిగా ఎంపీ బరిలోకి దిగిన హ్యాట్రిక్ ఎమ్మెల్యే డీకే అరుణ కాంగ్రెస్ పార్టీ మారిన తర్వాత ఒక్కసారి కూడా ఎన్నికల్లో గెలవలేదు.దీంతో ఈ సారి పార్లమెంట్ ఎన్నిక ఆమెకు చాలెంజ్. గతంలో మహబూబ్ నగర్ ఎంపి టెకెట్ ఇవ్వనందుకే డీకే అరుణ పార్టీ మారారు.బీజేపీ గతంలో ఒకసారి సీటు ఇచ్చినా ఆమె ఓటమి పాలయ్యారు. ఇపుడు పార్లమెంట్ ఎన్నికల్లో రెండో సారి డీకే అరుణ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అందుకే డీకే అరుణకు ఈ ఎన్నిక ఛాలెంజ్.
- సీఎం రేవంత్ రెడ్డికి ఈ పార్లమెంట్ ఎన్నిక డబుల్ ఛాలెంజ్. ఒకటి సీఎం రేవంత్ రెడ్డి సిట్టింగ్ బీఆర్‌ఎస్ అభ్యర్థి అయిన మన్నే శ్రీనివాసరెడ్డిని ఓడించాలి. బీజేపీ అభ్యర్థి డీకే అరుణ గెలవకుండా చూడటం రెండో ఛాలెంజ్. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల్లో అన్నీ సీట్లను రేవంత్ రెడ్డి గెలిచారు. అదే అసెంబ్లీ ఎన్నికల వరవడి పార్లమెంట్ ఎన్నికల్లోనూ కొనసాగాలి. లేదంటే, సీఎం రేవంత్ మీద సొంత జిల్లాలోనే ప్రజలకు విరక్తి వచ్చిందంటారు.
- 1957లో మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉంది. ఇక్కడి నుంచి 12 సార్లు కాంగ్రెస్ విజయం సాధించగా, బీఆర్ఎస్ మూడుసార్లు గెలిచింది. 1999 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పక్షాన ఏపీ జితేందర్ రెడ్డి విజయదుందుభి మోగించారు. 1984 ఎన్నికల్లో అప్పటి అభ్యర్థి ఎస్ జైపాల్ రెడ్డి జనతాపార్టీ అభ్యర్థిగా ఈ స్థానం నుంచి విజయం సాధించారు.
- కేసీఆర్, ఎస్ జైపాల్ రెడ్డి, మల్లిఖార్జున్, జె రామేశ్వరరావు లాంటి ఉద్ధండ రాజకీయ నేతలు ఎంపీలుగా ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించారు.
- కోహినూర్, గోల్కొండ వజ్రాలు లభ్యమైన మహబూబ్ నగర్ ప్రాంతంలో పిల్లలమర్రి, మల్లెల తీర్థం జలపాతం, వనపర్తి కోట, మన్ననూర్ పులుల అభయారణ్యం విస్తరించి ఉన్నాయి.

కుటుంబ వ్యాపారం నుంచి రాజకీయాల్లోకి...
ప్రస్థుతం సిట్టింగ్ ఎంపీ అయిన మన్నే శ్రీనివాసరెడ్డి కుటుంబ వ్యాపారం నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. మండలస్థాయి నాయకుడైన శ్రీనివాసరెడ్డి 2019వ సంవత్సరంలో అనూహ్యంగా పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్ పై పోటీ చేసి ఎంపీగా విజయం సాధించారు. రెండోసారి ప్రస్థుత పార్లమెంట్ ఎన్నికల్లో బరిలోకి దిగారు.

ఎన్ఎస్‌యూఐ నుంచి ఎంపీ ఎన్నికల దాకా...
కాంగ్రెస్ అనుబంధ సంస్థ ఎన్ఎస్‌యూఐ అధ్యక్షుడిగా పనిచేసిన చల్లా వంశీచంద్ రెడ్డి గతంలో కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ప్రస్థుతం కాంగ్రెస్ పార్టీ సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడిగా అత్యున్నత హోదాలో ఉన్న వంశీ చంద్ అనూహ్యంగా పార్లమెంట్ ఎన్నికలబరిలోకి కాంగ్రెస్ అభ్యర్థిగా దిగారు. ఎంబీబీఎస్ చదివిన ఈయన డాక్టర్ వృత్తిని వదిలి రాజకీయాల్లోకి వచ్చారు.

ఎంపీ బరిలోకి దిగిన హ్యాట్రిక్ ఎమ్మెల్యే
మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా రంగంలోకి దిగిన డీకే అరుణ సీనియర్ నాయకురాలు. తన భర్త డీకే భరతసింహారెడ్డి ప్రోత్సాహంతో జడ్పీటిసీగా రాజకీయాల్లోకి వచ్చిన డీకే అరుణ గతంలో మూడు సార్లు ఎమ్మెల్యేగా గద్వాల నుంచి హ్యాట్రిక్ కొట్టారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన అరుణ అనూహ్యంగా బీజేపీ తీర్థం స్వీకరించి ఆ పార్టీ అభ్యర్థిగా నిలిచారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా పనిచేస్తున్న డీకే అరుణ గతంలో వైఎస్ మంత్రివర్గంలో పనిచేశారు.

గ్రామీణ ప్రాంత ఓటర్లే అధికం
మహబూబ్ నగర్ లోక్‌సభ నియోజకవర్గంలో గ్రామీణ ప్రాంత ఓటర్లే అధికంగా ఉన్నారు. 47.88 శాతం అక్షరాస్యులున్న పాలమూరులో 80.4 శాతం ఓటర్లు గ్రామీణ ప్రాంతాల వారే. 19.6 శాతం మంది అర్బన్ ఓటర్లు ఉన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్ ఉన్న ఈ పార్లమెంట్ పరిధిలోనిదే కావడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. కొడంగల్, నారాయణపేట, మహబూబ్ నగర్, జడ్చర్ల, దేవరకద్ర, మక్తల్, షాద్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గాలతో కూడిన పాలమూరు పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి సీఎం రేవంత్ తో పాటు ఎమ్మెల్యేల బలం, బలగం ఉంది.

ఏడు అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు...
2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఏడుకు ఏడు అసెంబ్లీ స్థానాల్లోనూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలే విజయఢంకా మోగించారు. సీఎం అనుముల రేవంత్ రెడ్డి (కొడంగల్), చిట్టెం పర్ణిక రెడ్డి(నారాయణపేట), యెన్నం శ్రీనివాసరెడ్డి (మహబూబ్ నగర్),అనిరుద్ రెడ్డి జనంపల్లి (జడ్చర్ల), గవినోళ్ల మధుసూధన్ రెడ్డి (దేవరకద్ర), వాకిటి శ్రీహరి (మక్తల్), కె శంకరయ్య (షాద్ నగర్) కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలున్నారు. సీఎం రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ స్థానాన్ని ఎలాగైనా గెలుచుకోవాలనే లక్ష్యంతో రాజకీయ వ్యూహాలు రూపొందించారు.

బీఆర్ఎస్ ఎంపీల హ్యాట్రిక్ విజయం
2009వ సంవత్సరంలో గులాబీ బాస్ కేసీఆర్ మహబూబ్ నగర్ పార్లమెంట్ నుంచి పోటీ చేసి ఘన విజయం సాధించారు. అనంతరం ఇక్కడి నుంచి 2014 ఎన్నికల్లో అప్పటి బీఆర్ఎస్ పక్షాన ఏపీ జితేందర్ రెడ్డి ఎంపీగా గెలిచారు. 2019వ సంవత్సరంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన మన్నే శ్రీనివాసరెడ్డి విజయం సాధించి పార్లమెంటుకు వెళ్లారు.

అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పెరిగిన ఓట్ల శాతం
2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓట్ల శాతం గణనీయంగా పెరిగింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 20.8 శాతం ఓట్లు సాధించిన కాంగ్రెస్ పార్టీ 2019 పార్లమెంట్ ఎన్నికల్లో 19.9 శాతానికి తగ్గింది. అయితే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా పాలమూర్ స్వీప్ చేస్తూ ఏడు అసెంబ్లీ స్థానాల్లోనూ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. అన్ని పార్టీల కంటే అత్యధికంగా 46.4 శాతం ఓట్లు సాధించిన కాంగ్రెస్ ఈ పార్లమెంట్ ఎన్నికల్లోనూ విజయం సాధించేందుకు సీఎం రేవంత్ రెడ్డితోపాటు ఎమ్మెల్యేలు శ్రమిస్తున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 50.1 శాతం ఓట్లు పొందిన బీఆర్ఎస్ అనూహ్యంగా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 38.7 శాతానికి తగ్గింది. దీంతో ఏడు స్థానాల్లోనూ ఓటమి పాలైంది.

ఎస్సీ,ఎస్టీ, ముస్లిం ఓటర్లే కీలకం
మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎస్సీ,ఎస్టీ, ముస్లిం ఓటర్లే కీలకంగా ఉన్నారు. పాలమూరులో 15.3 శాతం ఎస్సీలు, 8.6 శాతం ఎస్టీలు, 9.4 శాతం ముస్లింలు, 0.53శాతం క్రిస్టియన్ ఓటర్లు ఉన్నారు. దీంతో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్,బీఆర్ఎస్, బీజేపీ పార్టీల అభ్యర్థులు ఎస్సీ, ఎస్టీ, ముస్లింల ఓట్ల కోసం ప్రచారం చేస్తున్నారు. బలహీన వర్గాల ఓటర్లు ఎటువైపు మొగ్గుచూపితే ఆ పార్టీనే విజయం వరించనుంది.
కాంగ్రెస్ కంచుకోట పాలమూరు పోరులో ఎవరు విజయం సాధిస్తారనేది జూన్ 4వతేదీ ఓట్ల లెక్కింపు పర్వం వరకు వేచిచూడాల్సిందే.




Read More
Next Story