
హైదరాబాద్ మెట్రోను మింగేస్తున్న ‘మహాలక్ష్మి’
హైదరాబాద్ మెట్రో(Hyderabad Metro) అనే ప్రజారవణా వ్యవస్ధను ‘మహాలక్ష్మి’ అనే ఉచిత బస్సుపధకం(Free Bus Scheme) దారుణంగా దెబ్బకొట్టేస్తోంది
ప్రభుత్వరంగంలోని ఒక వ్యవస్ధను అదే ప్రభుత్వంలోని మరో పథకం దెబ్బకొట్టడమే ఆశ్చర్యం. వ్యవస్ధ అయినా, పథకం అయినా ప్రతిరోజు ప్రజల వాడుకకు సంబంధించిందే. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే హైదరాబాద్ మెట్రో(Hyderabad Metro) అనే ప్రజారవణా వ్యవస్ధను ‘మహాలక్ష్మి’ అనే ఉచిత బస్సుపధకం(Free Bus Scheme) దారుణంగా దెబ్బకొట్టేస్తోంది. మెట్రో ఏమో నష్టాల్లో నడుస్తుంటే మహాలక్ష్మి వల్ల ప్రభుత్వానికి ఆర్ధికభారం పెరిగిపోతోంది. ఫలితంగా మెట్రోఛార్జీలు పెంచాలనే యోచనలో యాజమాన్యం ఉంది. ఛార్జీల పెంపుకు ప్రభుత్వానికి మెట్రో యాజమాన్యం ప్రతిపాదనలు కూడా పంపింది. నష్టాల్లో నుండి బయటపడటానికి లేదా నష్టాలను తగ్గించుకునేందుకు ప్రభుత్వం ఛార్జీలను పెంపుకు తొందరలోనే గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతోందని సమాచారం.
విషయం ఏమిటంటే హైదరాబాద్ మహానగరంలో పెరిగిపోతున్న ట్రాఫిక్ సమస్యకు పరిష్కారంగా ప్రభుత్వం మెట్రో రైలును తీసుకొచ్చింది. మెట్రోలో ప్రతిరోజు సుమారు 5 లక్షలమంది ప్రయాణిస్తున్నారు. మెట్రో ప్రయాణంలో యాజమాన్యం విద్యార్ధులకు తప్ప ఇంకెవరికీ ఎలాంటి రాయితీలు ఇవ్వటంలేదు. అయితే నిర్వహణ వ్యయం విపరీతంగా పెరిగిపోతున్న కారణంగా భారం పెరిగిపోతోంది. ఇప్పటికి సుమారు రు. 6500 కోట్ల నష్టాల్లో ఉన్నట్లు మెట్రో యాజమాన్యం ప్రభుత్వానికి ఇచ్చిన రిపోర్టులో చెప్పింది. నష్టాలను తగ్గించుకునేందుకు ఛార్జీలను పెంచకతప్పదని కూడా ప్రతిపాదించింది.
2017లో మెట్రో సేవలు మొదలైనప్పటినుండి ఇప్పటివరకు ఛార్జీలను పెంచలేదు. ఎల్బీనగర్-మియాపూర్, నాగోల్-రాయదుర్గం కారిడార్ లో ప్రయాణీకుల రద్దీ విపరీతంగా ఉంటోంది. మెట్రో కారిడార్లో ఎక్కడినుండి ఎక్కడికైనా మహాయితే ఛార్జి 50 రూపాయలు మాత్రమే. రోడ్డు మార్గంలో వెళితే గంటన్నర సేపు అయ్యే ప్రయాణానికి మెట్రోలో అయితే 30 నిముషాలు సరిపోతుంది. లక్డీకాపూల్ నుండి మియాపూర్ కు బస్సులో వెళితే సుమారు గంటన్నరకు పైగా పడుతుంది. అదే మెట్రో ప్రయాణమైతే 30 నిముషాల్లోపే. మెట్రోలో ప్రయాణం తొందరగానే అయిపోతున్నా ఎందుకనో జేబీఎస్-ఎంజీబీఎస్ రూటులో రోజురోజుకు ప్రయాణీకుల సంఖ్య తగ్గిపోతోంది.
సగటున మెట్రోలో రోజుకు 5 లక్షలమంది ప్రయాణిస్తున్నా ఈ సంఖ్య అయితే తగ్గిపోతోంది. బెంగుళూరు, చెన్నై, ఢిల్లీ మెట్రోలు ప్రారంభించినప్పటినుండి నష్టాలను తగ్గించుకునేందుకు ఇప్పటికి మూడుసార్లు ఛార్జీలను పెంచినట్లు మెట్రోవర్గాలు చెప్పాయి. కాబట్టి హైదరాబాద్ మెట్రో నష్టాలను తగ్గించుకునేందుకు ఛార్జీలను పెంచటం ఒకటే మార్గమని యాజమాన్యం ప్రభుత్వానికి స్పష్టంగా చెప్పింది. యాజమాన్యం ప్రతిపాదనల ప్రకారం ఇపుడున్న ఛార్జీలకు 20 శాతం అదనంగా పెంచాలని ప్రభుత్వానికి చెప్పింది. 20 శాతం ఛార్జీలపెంపు ప్రతిపాదనకు ప్రభుత్వం అంగీకరిస్తే ఇపుడున్న ఛార్జీలు సుమారు 15 రూపాయల నుండి 75 రూపాయలు పెరిగే అవకాశం ఉందని సమాచారం.
మహాలక్ష్మి ప్రభావం ఎంతుంది ?
మెట్రో రెవిన్యు తగ్గిపోవటంలో మహాలక్ష్మి ప్రభావం చాలా ఎక్కువగానే ఉందని చెప్పాలి. ఎలాగంటే కాంగ్రెస్(Congress) ప్రభుత్వం 2023 డిసెంబర్లో అధికారంలోకి రాగానే మహిళలకు ఉచితబస్సు ప్రయాణం పథకం మహాలక్ష్మిని అమల్లోకి తెచ్చింది. గడచిన 15 మాసాల్లో ఆర్టీసీ బస్సుల్లో(TGRTC) మహిళలు సుమారు 30 కోట్లమంది ప్రయాణించారు. బస్సుల్లో ప్రయాణిస్తున్న మహిళల సంఖ్య ప్రతినెలా సుమారు 3 లక్షలు పెరుగుతున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) ప్రకారం 2023, డిసెంబర్ నెలలో ప్రతిరోజు సుమారు 27 లక్షలమంది ప్రయాణించారు. 2024, జనవరిలో ప్రతిరోజు 28 లక్షలమంది ప్రయాణిస్తే, ఫిబ్రవరిలో రోజుకు 31.56 లక్షలమంది ప్రయాణించారు. 2025 ఏడాది లెక్కలు చెబుతు ప్రతినెలా ప్రతిరోజు సగటున 30 లక్షలమంది ప్రయాణిస్తున్నట్లు తెలిపారు. ఉచితబస్సు పథకం రీఎంబర్స్ మెంటులో భాగంగా ప్రభుత్వం ప్రతినెలా ఆర్టీసీకి రు. 350 కోట్లు చెల్లిస్తున్నట్లు పొన్నం చెప్పారు.
ఉచితబస్సు పథకం మహాలక్ష్మిలో రోజుకు మహిళలు సగటున 30 లక్షలమంది ప్రయాణిస్తున్నారంటే చాలా పెద్ద సంఖ్యనే చెప్పాలి. మహాలక్ష్మి పథకం లేకపోతే వీళ్ళంతా మెట్రోలనే ప్రయాణంచేసేవారు అనేందుకు లేదు. కాకపోతే కనీసం 20 శాతంమంది ప్రయాణించినా అంటే 30 లక్షల్లో 10 నుండి 20 శాతం అంటే సుమారు 3 నుండి 6 లక్షలమంది అయితే ప్రయాణించేందుకు అవకాశముందని మాత్రం చెప్పచ్చు. మహాలక్ష్మి పథకం మెట్రో రెవిన్యుపై ఎంతటి ప్రభావం చూపిందో అర్ధమైపోతోంది. మెట్రో రెవిన్యూను దారుణంగా దెబ్బకొడుతున్న మహాలక్ష్మి పథకాన్ని(Mahalakshmi Scheme) రేవంత్ రెడ్డి(Revanth) ప్రభుత్వం ఎంతకాలం కంటిన్యుచేస్తుందో చూడాలి.