మహారాష్ట్ర నేతలు జంప్... కేసీఆర్ వ్యూహంలో భాగమేనా?
x

మహారాష్ట్ర నేతలు జంప్... కేసీఆర్ వ్యూహంలో భాగమేనా?

మహారాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, రైతు సంఘం నేత మానిక్ రావు కదం రాజీనామా చేశారు. ఆయనతోపాటు మరికొందరు బీఆర్ఎస్ నేతలు పవార్ సమక్షంలో ఎన్సీపీలో చేరారు.


మహారాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, రైతు సంఘం నేత మానిక్ రావు కదం రాజీనామా చేశారు. అనంతరం అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీలో చేరారు. ఎన్సీపీ ఆయనకి కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించింది. మానిక్ రావు కదం తోపాటు మరికొందరు బీఆర్ఎస్ నేతలు పవార్ సమక్షంలో ఎన్సీపీలో చేరారు.




తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తరవాత జాతీయ కార్యకలాపాలపై బీఆర్ఎస్ అధిష్టానం దృష్టి పెట్టడం లేదు. దీంతో మహారాష్ట్రలోని ఆ పార్టీ నేతలు అయోమయంలో పడ్డారు. తమ రాజకీయ భవిష్యత్తు అగమ్య గోచరంగా మారిందని, కనీసం ఆఫీసు అద్దెలు కట్టడానికి, పార్టీ కార్యక్రమాలకు కూడా నిధులు పంపడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. మహారాష్ట్ర నేతల ఫోన్లు కూడా లిఫ్ట్ చేయట్లేదని భగ్గుమన్నారు.

ఈ పరిణామాలపై మీటింగ్ నిర్వహించిన మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, కో ఆర్డినేటర్లు బీఆర్‌ఎస్‌లో చేరి రాష్ట్ర ద్రోహులుగా మిగిలిపోయామని ఆవేదన వ్యక్తం చేస్తూ కేసీఆర్ కి ఘాటు లేఖను పంపారు. బీఆర్ఎస్ పార్టీ లోక సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో పోటీ చేస్తుందో లేదో తేల్చాలని, వారం రోజుల్లో స్పష్టత ఇవ్వాలని కేసీఆర్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. పార్టీ అధినేత నిర్ణయానికి కట్టుబడి ఉంటామని లేఖలో తెలిపారు. కానీ, కేంద్ర నాయకత్వం నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతోనే పార్టీ మారాల్సి వచ్చిందని మహారాష్ట్ర నేతలు చెబుతున్నారు.

బీఆర్ఎస్ మొదటి అడుగు మహారాష్ట్రలోనే..

తెలంగాణలో తిరుగులేని శక్తిగా ఎదిగిన అప్పటి టీఆర్ఎస్ పార్టీని దేశవ్యాప్తంగా విస్తరింపజేయాలని, జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని అధినేత కేసీఆర్ భావించారు. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని భారత రాష్ట్ర సమితిగా మార్చారు. పార్టీ విస్తరణలో భాగంగా సరిహద్దు రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఆంధ్ర రాష్ట్రాలలో పాగా వేసేందుకు ప్రణాళికలు రచించారు. తెలంగాణకి బార్డర్ లో ఉన్న మహారాష్ట్ర నాందేడ్, షోలాపూర్ ప్రాంతాల్లో కొంతమంది నేతలతో కమిటీలు వేసి, పార్టీ ఆఫీసులు కూడా ఓపెన్ చేశారు.

Photo Credits: Hindustan Times

తెలంగాణలో ఉన్న రైతు బంధు, రైతు భీమా, రైతులకు ఉచిత కరెంటు పథకాలకు ఆకర్షితులైన పలువురు రైతు ఉద్యమ నాయకులు పార్టీలో చేరారు. వారిని ఢిల్లీకి తీసుకెళ్ళి వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ధర్నాలు నిర్వహించారు. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తామంటూ మహారాష్ట్ర రీజనల్ పార్టీలైన శివసేన, ఎన్సీపీల నుంచి మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర నాయకులని పార్టీలో చేర్చుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా నాలుగు బహిరంగ సభలని కూడా ఏర్పాటు చేశారు. ఆరు పార్లమెంటు స్థానాల్లో పోటీ చేసేందుకు సన్నాహాలు చేశారు.

కానీ తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల రూపంలో బీఆర్ఎస్ కి బిగ్ షాక్ తగిలింది. హ్యాట్రిక్ కొడతము, దేశ రాజకీయాల ముఖచిత్రం మార్చేస్తము అని ధీమాగా ఉన్న గులాబీ బాస్ కి కోలుకోలేని దెబ్బ తగిలింది. దీంతో ఆయన జాతీయ రాజకీయాల విషయం పక్కన పెట్టినట్టు కనిపిస్తోంది.

జాతీయ పార్టీ విషయంలో వ్యూహాత్మక మౌనం...

టీఆర్ఎస్ ని బీఆర్ఎస్ గా మార్చి కేసీఆర్ దేశ రాజకీయాలపై ఫోకస్ పెట్టినప్పటి నుంచి రాష్ట్రంలో పార్టీకి ఒడిదుడుకులు మొదలయ్యాయనే అభిప్రాయం ఉంది. ఓటమికి ఈ పరిణామం ఒక ముఖ్య కారణంగా అభిప్రాయాలు కూడా వ్యక్తం అయ్యాయి. దీంతో జాతీయ రాజకీయాలు పక్కనపెట్టి, రాష్ట్రానికే పరిమితం అవ్వాలి అనుకుంటున్నారని.. అందులో భాగంగానే జాతీయ పార్టీ విషయంలోనూ నేతలు పార్టీ వీడేలా పరిణామాలు కల్పించి, వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Read More
Next Story