
బండికి మోదీని ఒప్పించే దమ్ముందా?: మహేష్ కుమార్
కేంద్రమంత్రి బండి సంజయ్‌కి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఓపెన్ ఛాలెంజ్ చేశారు.
కేంద్రమంత్రి బండి సంజయ్‌కి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఓపెన్ ఛాలెంజ్ చేశారు. బీసీలకు తామే న్యాయం చేయగలమని చెప్పుకుంటున్న బీజేపీ నాయకులకు మాటమీద నిలబడే చిత్తశుద్ధి ఉందా? అని ప్రశ్నించారు. బీసీలకు అన్యాయం జరిగితే ఊరుకోమని అంటున్న బీజేపీ నేతలకు ఇన్నాళ్లూ బీసీలు ఎందుకు గుర్తుకు రాలేదని నిలదీశారు. తమ ప్రభుత్వం కుల గణన చేపట్టి.. బీసీల లెక్కలు బయటపెట్టే వారకు బీజేపీకి వారి ఊసే పట్టలేదని, ఇప్పుడు వచ్చి బీసీల కోసం పోరాడుతున్నట్లు కలరింగ్ ఇస్తున్నారని విమర్శించారు. బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, కానీ దీనిని కేంద్రం అంగీకరిస్తుందా? అనేది అసలు ప్రశ్న అని పేర్కొన్నారు.
బండికి మహేష్ కుమార్ ఛాలెంజ్
‘‘బీసీ రిజర్వేషన్లపై అసెంబ్లీలో మేము బిల్లు తీసుకొస్తాం. దానికి ఆమోదం తెలిపే చిత్తశుద్ధి.. ఆ బిల్లును 9వ పార్లమెంటు షెడ్యూల్‌లో పెట్టించే దమ్ము బండికి ఉందా? బీసీ రిజర్వేషన్ బిల్లుపై ప్రధాని మోదీని ఒప్పించే దమ్ముందా.. బండిసంజయ్? దేశవ్యాప్త కులగణన చేయాలని మోదీని అడిగే ధైర్యం చేయగలరా? దేశంలోనైనా, రాష్ట్రంలో అయినా భవిష్యత్తు బీసీలదే. బీజేపీ, బీఆర్ఎస్‌లు బీసీ నేతను ప్రధానిని చేయగలవా? బీసీ నేతను ప్రధానిని చేసే సత్తా కాంగ్రెస్‌కు మాత్రమే ఉంది’’ అని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. అయితే బిల్లు పెడితే ప్రధానిని ఒప్పించుకుంటామని గతంలో కిషన్ రెడ్డి అన్నారు. అయినా మరోసారి ఇదే అంశంపై బండి సంజయ్‌కి ఛాలెంజ్ చేయడం చర్చనీయాంశంగా మారింది.
కేంద్రాన్ని మేము ఒప్పిస్తాం: కిషన్
ఇటీవల వరంగల్‌లో పర్యటించిన సందర్భంగా కులగణన, ఎస్సీ వర్గీకరణ అంశాలపై కిషన్ రెడ్డి స్పందించారు. కుల గణన చేశామంటూ గప్పాలు చెప్పుకుంటున్న కాంగ్రెస్.. సర్వేను పూర్తి చేయలేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. పైగా ప్రతి లెక్క పక్కాగా ఉందంటూ కహానీలు చెప్తున్నారని, అంత పక్కాగా లెక్క ఉంటే మళ్ళీ రెండో విడత సర్వే చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కుల గణన సర్వేను ఒక్క బీసీ సంఘం కూడా సమర్థించడం లేదని, ఈ లెక్కల ప్రకారం తమకు తీవ్ర నష్టం జరుగుతుందనే ఘంటాపథంగా చెప్తున్నాయని గుర్తు చేశారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లను బీజేపీ పూర్తిగా సమర్థిస్తుందని చెప్పారు. అదే విధంగా రాష్ట్రంలో కుల గణన సర్వే పూర్తి చేసి, బీసీ సంఘాలు దానిని సమర్థిస్తే కేంద్రాన్ని ఒప్పించి ఆమోదం చేపిస్తామని హామీ ఇచ్చారు.