![తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మార్పు మున్షీపై చర్య కాదా? తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మార్పు మున్షీపై చర్య కాదా?](https://telangana.thefederal.com/h-upload/2025/02/15/512980-mahesh-kumar.webp)
తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మార్పు మున్షీపై చర్య కాదా?
మున్షిని తప్పించాలని పార్టీ నేతలు డిమాండ్ చేశారన్న ప్రచారంలో వాస్తవం లేదన్న మహేష్ కుమార్.
తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల నూతన ఇన్‌ఛార్జ్ నియామకం అనేక అనుమానాలకు తావిస్తోంది. పార్టీని నడిపించడంలో మున్షి విఫలమైయ్యారని, అందుకే ఆమెపై పార్టీ అధిష్టానం చర్యలు తీసుకుంటుందన్న ప్రచారం స్పీడందుకుంది. మున్షి తీరుపై పార్టీ తీవ్ర అసంతృప్తితో ఉందని, అందుకే ఆమెను మార్చడం కోసం కొన్ని రోజులుగా ప్రణాళికలు సిద్ధం చేస్తోందని, తాజాగా మీనాక్షి నటరాజన్‌ను కొత్త ఇన్‌ఛార్జ్‌గా నియమించిందని కొందరు అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి మున్షి తన పరిధిని దాటి వ్యవహరిస్తుందన్న ఆరోపణలు కూడా వచ్చాయి. పార్టీ వ్యవహారాలే కాకుండా ఇక్కడి కీలక అధికారులకు ఆమె నేరుగా ఫోన్లు చేయడం, పలు నిర్ణయాలు తీసుకునే ఒత్తిడి చేయడం, మంత్రుల శాఖాపరమైన విషయాల్లో కూడా జోక్యం చేసుకోవడం కూడా చేశారని, దీంతో ఆమె తీరుపై పార్టీ నేతలు పలు మార్లు ఫిర్యాదు చేశారని, ఆమె తెలంగాణ ఇన్‌ఛార్జ్‌గా తొలగించాలని డిమాండ్ చేశారని సమాచారం. దీంతోనే మున్షిని తప్పించడంపై ఏఐసీసీ దృష్టి సారించిందన్న మాట బాగా వినిపిస్తోంది.
దీపాదాస్ మున్షి మార్పు అంశం కొన్ని రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఇన్‌చార్జ్‌లను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. కాగా దీపాదాస్ మున్షి మార్పుపై వస్తున్న ప్రచారంపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఘాటుగా స్పందించారు. ఈ ప్రచారాల్లో ఎటవంటి వాస్తవం లేదని, ఆమె చాలా క్రమశిక్షణ, నిబద్దత ఉన్న నేత అని చెప్పుకొచ్చారు.
‘‘తెలంగాణ రాష్ట్ర ఏఐసీసీ ఇంచార్జ్‌గా పని చేసిన దీపాదాస్ మున్షి నిబద్ధత, నిజాయితీ, క్రమశిక్షణ గల నాయకురాలు. ఆమె పార్టీని బలోపేతం చేయడంలో ఎంతో కృషి చేశారు. దీపాదాస్ మున్షి.. పార్టీ కార్యక్రమాలను నిర్లక్ష్యం చేశారని ప్రచారం చేస్తున్నారు. అందులో ఎటువంటి వాస్తవం లేదు’’ అని అన్నారు.
‘‘దీపాదాస్ మున్షి.. కేరళ ఏఐసీసీ ఇంచార్జ్ గా ఉంటూ తెలంగాణ లో ఏడాది కాలం పాటు అదనపు బాధ్యతలు నిర్వహించారు. ఏఐసీసీ కొన్ని రాష్ట్రాల ఇంచార్జ్‌లను, సంస్థాగత మార్పులను చేస్తూ అందులో భాగంగా తెలంగాణకు పూర్తి బాధ్యతలతో మీనాక్షి నటరాజన్‌ను నియమించారు. కాంగ్రెస్ పార్టీకి కేరళలో పూర్తి బాధ్యతలతో పనిచేయాల్సి ఉన్నందున ఇక్కడ కొత్త నియామకం జరిగిందే తప్ప ఎలాంటి చర్యలు కావు. దీపాదాస్ మున్షి.. ప్రియరంజన్ దాస్ మున్షి సతిమణిగా, పెద్ద రాజకీయ కుటుంబ నేపథ్యం, నీతి, నిజాయితీగా పని చేసిన చరిత్ర ఉంది. పార్టీని క్రమశిక్షణగా, సంస్థాగతంగా బలోపేతం చేసారు. ఆమెపై వచ్చిన వార్తలను తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాంటి నిరాధార ప్రచారాలు చేస్తే చట్టపరమైన చర్యలు చేపడుతాం’’ అని హెచ్చరించారు.