Mahesh Kumar Goud
x

‘కవితకు బీసీలు అప్పుడెందుకు గుర్తుకు రాలేదు’

టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌కు ఈ ప్రశ్నలు ఇన్నాళ్లూ గుర్తుకు రాలేదా? వచ్చినా కావాలనే కామ్‌గా ఉన్నారా?


బీసీ రిజర్వేషన్లపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. ఇంతపెద్ద జోక్ మరొకటడి ఉండదంటూ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చురకలంటించారు. బీసీ రిజర్వేషన్ల కోసం పోరాడుతున్నామని, వారికి న్యాయం లభించేవరకు పోరాటం ఆపమంటూ కవిత వ్యాఖ్యానించడం దెయ్యాలు వేదాలు వల్లెవేస్తున్నట్లే ఉందంటూ ఎద్దేవా చేశారు. అంతేకాకుండా అసలు ఖర్గేకు కవిత ఏ హోదాలో లేఖ రాశారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నాయకురాలిగా ఆమె లేఖ రాశారా? లేదంటే జాగృతి అధ్యక్షురాలి హోదాలో రాశారో ముందు చెప్పాలని కోరారు. అధికారంలో ఉన్నంత కాలం బీసీల బాధలు పట్టని బీఆర్ఎస్.. ఇప్పుడు వారి కోసం కాంగ్రెస్ కులగణన చేయించిన తర్వాత రాద్ధాంతం చేయడం హాస్యాస్పందంగా ఉందంటూ దుయ్యబట్టారు.

అప్పుడు గుర్తురాలేదా..!

‘‘తెలంగాణ రాష్ట్రం 2014 జూన్ 2న ఏర్పాటయింది. ఆ తర్వాత తొలుత అధికారంలోకి వచ్చింది బీఆర్ఎస్. 2014-2018 మధ్య ఉన్న క్యాబినెట్‌లో ఒక్క మహిళ అయినా ఉన్నారా? ఆ తర్వాత 2018 ఎన్నికల్లో కూడా గెలిచిన బీఆర్ఎస్.. పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు బీసీల గురించి ఒక్కరోజైనా ఆలోచించారా? ఒక్కసారైనా మాట్లాడారా? పైగా స్థానిక సంస్థల్లో బీసీలకు ఉన్న రిజర్వేషన్లను 21శాతానికి తగ్గించిన ఘనత కేసీఆర్‌ది. ఉద్యమాలు చేశామని చెప్పుకుంటున్న కవిత ఎప్పుడయినా సాటి మహిళల గురించి మాట్లాడారా? అసలు వారిని పట్టించుకున్నారా? గుర్తించారా?’’ అని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు.

ఇన్నాళ్లూ ఏమైంది..?

అయితే బీసీ రిజర్వేషన్ల అంశంపై కవిత ప్రశ్నించడం, ధర్నాలు చేయించడం, రౌండ్ సమావేశాలు నిర్వహించడం ఇదే తొలిసారి కాదు. గతంలో కూడా పలుసార్లు ఈ అంశంపై ప్రభుత్వాన్ని నిలదీశారు. బీసీలకు రిజర్వేషన్ల విషయంలో తాము మడపతిప్పేది లేదని తేల్చి చెప్పారు. కానీ ఇన్ని రోజులు కవితను మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించలేదు. ఎప్పుడయితే కాంగ్రెస్ జాతీయ నేతల దగ్గరకు అంశం చేరిందో.. ఖర్గేకు కవిత లేఖ రాశారో అప్పుడే మహేష్ కుమార్ గౌడ్‌కు ఎందుకు ఈ అంశాలు గుర్తుకొచ్చాయి? అనేది ప్రస్తుతం చర్చకు దారితీస్తున్న అంశం. హైకమాండ్ నుంచి మొట్టికాయలు పడకూడదన్న ఉద్దేశంతోనే బీసీ రిజర్వేషన్ల అంశంపై మహేష్ కుమార్ ప్రశ్నించారా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి.

మహేష్ కుమార్ ఉద్దేశమేంటి?

అదే సమయంలో కొందరు విశ్లేషకులు మరికొన్ని అంశాలను లేవనెత్తుతున్నారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో కవితకు మహేష్ కుమార్ గౌడ్ వేసిన ప్రశ్నలపై, ఆయన చేసిన వ్యాఖ్యలపై పలు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అసలు బీసీ రిజర్వేషన్లను కవిత డిమాండ్ చేయడం మహేష్ ప్రాబ్లమా? లేకుంటే బీసీ రిజర్వేషన్లను పదే పదే లేవనెత్తడం ప్రాబ్లమా? అధికారంలో ఉన్న సమయంలో బీఆర్ఎస్.. పట్టించుకోలేదు కాబట్టి ఇప్పుడు వాళ్లు బీసీ రిజర్వేషన్లు డిమాండ్ చేయకూడదని ఆయన భావిస్తున్నారా? లేదంటే అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్‌కు చేతకాలేదు కాబట్టి ఇప్పుడు తమనూ అడగొద్దని హింట్ ఇస్తున్నారా? ఇలా విశ్లేషకులు అనేక ప్రశ్నలు సంధిస్తున్నారు.

Read More
Next Story