
‘బీసీ రిజర్వేషన్‌ను బీజేపీనే అడ్డుకుంటుంది’
కేంద్రంపై పోరుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చిన మహేష్ కుమార్ గౌడ్.
బీసీ రిజర్వేషన్‌ల విషయంలో కాంగ్రెస్ చిత్తశుద్ధితో ముందుకు అడుగులు వేస్తోందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. కానీ బీజేపీ మాత్రం ఎలాగైనా దీనిని అడ్డుకోవాలని చూస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ చేపడుతున్న ప్రతి పనిని బీజేపీ అడ్డుకుంటోందన్నారు. కామారెడ్డిలో ఈ నెల 15న నిర్వహించే బీసీ రిజర్వేషన్ కృతజ్ఞత సభ ఏర్పాట్లను మహేష్ కుమార్ పరిశీలించారు. ఆయనతో పాటు ఐదుగురు మంత్రులు, ప్రభుత్వ సలహాదారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీ డిక్లరేషన్ సభకు ఇందిరాగాంధీ స్టేడియం సరిపోదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రత్యామ్నాయంగా డిగ్రీ కాలేజీ మైదానాన్ని కూడా పరిశీలించినట్లు చెప్పారు.
బీజేపీ నేతలే అడ్డుకుంటున్నారు..
‘‘బీసీ రిజర్వేషన్ బిల్లు చట్టంగా మారకుండా బీజేపీ నాయకులు ఆపుతున్నారు. బీజేపీ నాయకులంతా కూడా దేవుడి పేరుతో ఓట్లు అడుక్కునే బిచ్చగాళ్లు. మేమూ పూజలు చేస్తాం, గుళ్ళకు వెళ్తాం. కానీ దేవుడి పేరు చెప్పి ఓట్లు అడుక్కోం. బీసీ రిజర్వేషన్ చచ్చిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నాం. బండి సంజయ్ నడవడి, నిర్ణయం బీసీ బిడ్డలా లేవు. నేను సెక్యూరిటీ కోసం తిరుగుతున్నా అంటున్న బండి సంజయ్‌కి ఇదే నా ఛాలెంజ్. ఇద్దరం భద్రత విలేసి ప్రజల్లో తిరుగుతాం రా.. ఎవరి సత్తా ఏంటో తెలుస్తుంది. బీసీ బిడ్డగా రిజర్వేషన్లను ఎందుకు వ్యతిరేకిస్తున్నారు’’ అని ప్రశ్నించారు మహేష్ కుమార్. బీజేపీ నేతల బాగోతం బయటపెట్టడానికే కామారెడ్డిలో సభ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అనంతరం ఆయన కవితపై కీలక వ్యాఖ్యలు చేశారు.
కల్వకుంట్ల కుటుంబమంతా దొంగలే
‘‘బీఆర్ఎస్ నాయకులు పదేళ్లు రాష్ట్రాన్ని దోచుకున్నారు. ఆనాటి సీఎం, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ కూతురు కవిత ఈ దోపిడీని బయటపెట్టారు. వాటాల్లో తేడా రావడంతోనే కవిత.. బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చేశారు. బీఆర్ఎస్ నేతలు చేసిన దోపిడీని కవిత ఒప్పుకున్నారు. ఈ విషయం ఐదేళ్ల క్రితం చెప్పి ఉంటే సన్మానం చేసే వాళ్ల. కవిత ఎపిసోడ్ అంతా కూడా కేసీఆర్ ఆడిస్తున్న నాటకమే కావొచ్చు. కల్వకుంట్ల కుటుంబం అంతా దొంగలే. మళ్లీ కేసీఆర్ పిలిస్తే కవిత వెళ్లరా? రాష్ట్ర రాజకీయాల్లో బీఆర్ఎస్ కమరుగవడం ఖాయమని రెండేళ్ల క్రితమే చెప్పాను. అదే ఇప్పుడు జరుగుతుంది’’ అని అన్నారు.