
కాంగ్రెస్ గుర్తుపై మజ్లిస్ అభ్యర్థి పోటీ
బిజెపి సారథి రాంచందర్ రావు సరికొత్త ఆరోపణ
జూబ్లిహిల్స్ ఎన్నికలలో కాంగ్రెస్ హస్తం గుర్తుపై మజ్లిస్ అభ్యర్థి పోటీ చేస్తున్నారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు అన్నారు.కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గతంలో మజ్లిస్ పార్టీ నుంచి పోటీ చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ పేరు ప్రకటించిన తర్వాత ,అభ్యర్థి నేరుగా మజ్లిస్ అధినేత దగ్గరికి వెళ్లి కలిసినట్లు రాంచందర్ రావు అన్నారు.జూబ్లిహిల్స్ ప్రజలు ఈ విషయాన్ని గుర్తెరుగాలన్నారు.బిజెపి రాష్ట్ర కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
రాంచందర్ రావు చేసిన ఆరోపణలు తెలంగాణ రాజకీయాల్లో సంచలనమయ్యాయి. గత ఎన్నికలలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన తర్వాత పొలిటికిల్ ఈక్వేషన్స్ పూర్తిగా మారిపోయాయి. అప్పటివరకు బిఆర్ఎస్ తో చెట్టపట్టాల్ వేసుకుని మిత్ర పక్షంగా ఉన్న మజ్లిస్, కాంగ్రెస్ పార్టీకి మిత్రపక్షంగా మారిపోయింది. పాతబస్తీలో అభివృద్ది జరగాలంటే కాంగ్రెస్ తో స్నేహహస్తం చాచినట్లు మజ్లిస్ అధినేత వివరణ ఇచ్చుకున్నారు.మతతత్వ పార్టీగా ముద్రపడ్డ బిజెపితో బిఆర్ఎస్ కలిసి పని చేస్తుందని ఆరోపించారు.
కాంగ్రెస్ మజ్లిస్ దోస్తానా ఈ నాటి కాదు
సుల్తాన్ సల్లావుద్దీన్ ఓవైసీ పార్టీ అధినేతగా ఉన్న సమయం నుంచి కాంగ్రెస్ తో మజ్లిస్ కు మంచి సంబంధాలు కొనసాగాయి. కిరణ్ కుమారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అంటే 2012లో భాగ్యలక్ష్మి వివాదం చెలరేగింది. దాంతో చాంద్రాయణ గుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ అరెస్టయ్యారు. అప్పటివరకు ఈ రెండు పార్టీల మధ్య వున్న సంబంధాలు బెడిసికొట్టాయి.
తర్వాత మాసాబ్ ట్యాంక్ లోని మూడెకరాల మహవీర్ హాస్పిటల్ స్థలంపై మజ్లిస్ కన్నుపడింది. దక్కన్ మెడికల్ కాలేజికి కేటాయించాలని మజ్లిస్ అభ్యర్థనను కిరణ్ కుమార్ రెడ్డి త్రోసిపుచ్చారు. దీంతో మజ్లిస్ కాంగ్రెస్ తో తెగదెంపులు చేసుకుంది.తర్వాత అధికారంలో వచ్చిన బిఆర్ఎస్ కు మజ్లిస్ దగ్గరయ్యింది. బిఆర్ఎస్ కు మజ్లిస్ మిత్ర పక్షంగా కొనసాగింది.ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీతో మజ్లిస్ సఖ్యతగా వుంటుందనే ప్రచారం ఉంది.కాంగ్రెస్, మజ్లిస్ పార్టీలకు బద్ద శత్రువైన బిజెపి జూబ్లిహిల్స్ ఎన్నికలలో చేసిన సరికొత్త కామెంట్స్ చర్చనీయాంశమయ్యాయి.