మిత్రపక్షం మజ్లిస్ కు కాంగ్రెస్ కు షాక్ ?
x
Revanth and Asaduddin

మిత్రపక్షం మజ్లిస్ కు కాంగ్రెస్ కు షాక్ ?

రేవంత్ మాట్లాడినపుడు అధిష్ఠానం సాధ్యంకాదని చెప్పేసిందని హస్తంపార్టీ నేతలంటున్నారు


మిత్రపక్షం ఎంఐఎంకు కాంగ్రెస్ పార్టీ షాక్ ఇవ్వబోతోందా ? పార్టీవర్గాల సమాచారం ప్రకారం అవుననే సమాధనం వినిపిస్తోంది. ఇంతకీ విషయం ఏమిటంటే ఈనెలలో ఐదు ఎంఎల్సీ సీట్లు భర్తీ అవబోతున్నాయి. ఎంఎల్ఏల కోటాలో భర్తీ అవబోయే సీట్లలో సంఖ్యాబలాన్ని బట్టి కాంగ్రెస్(Congress) కు నాలుగు, బీఆర్ఎస్(BRS) కు ఒక సీటు దక్కుతుంది. కాంగ్రెస్ కు ఎలాగూ నాలుగు సీట్లు దక్కుతున్నాయి కాబట్టి అందులో తమకు ఒకటి కేటాయించాలని రేవంత్ రెడ్డి(Revanth)ని ఎంఐఎం అడిగింది. మిత్రపక్షం అడగటమే ఆలస్యం రేవంత్ కూడా సానుకూలంగా స్పందించాడు. అయితే ఒకమాట అధిష్టానంతో చెప్పి ఓకే చేయిస్తానని చెప్పాడట. ఇదే విషయాన్ని రేవంత్ మాట్లాడినపుడు అధిష్ఠానం సాధ్యంకాదని చెప్పేసిందని హస్తంపార్టీ నేతలంటున్నారు. కారణం ఏమిటంటే ఎంఐఎం(AIMIM) వైఖరిపై చాలాకాలంగా అధిష్ఠానం మండిపోతోంది.

ఎంఐఎం మీద అధిష్ఠానానికి ఎందుకు మంట అంటే జాతీయస్ధాయిలో కాంగ్రెస్ ను దెబ్బకొట్టేందుకు ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ చర్యలు తీసుకుంటున్నారని. ఎలాగంటే ఈమధ్య వివిధరాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధులకు వ్యతిరేకంగా అసదుద్దీన్ ఓవైసీ ఎంఐఎం తరపున అభ్యర్ధులను పోటీలోకి దింపారు. బీహార్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, హర్యానా, గుజరాత్ రాష్ట్రాల అసెంబ్లీఎన్నికల్లో పైరాష్ట్రాల ఎన్నికల్లో ఎంఐఎం ప్రభావం ఏమంతగొప్పగా కనబడలేదు. అయితే గెలుపోటముల్లో కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం కాంగ్రెస్ అభ్యర్ధులపై ప్రభావం చూపించింది. బీహార్, గుజరాత్ ఎన్నికల్లో కొన్నిచోట్ల కాంగ్రెస్ అభ్యర్ధుల ఓటమికి ఎంఐఎం అభ్యర్ధులు కారణమయ్యారనే విశ్లేషణలు వినబడ్డాయి. ఇండియాకూటమిలో మిత్రపక్షంగా ఉండమని కూటమినేతలు అడిగినా ఓవైసీ అంగీకరించలేదు. దాంతో అప్పటినుండి కాంగ్రెస్ అధిష్ఠానానికి ఎంఐఎం అధ్యక్షుడి మీద బాగా మండుతోంది.

ఇదేవిషయాన్ని అధిష్ఠానంలోని కీలకనేతలు రేవంత్ తో చెప్పారని పార్టీవర్గాల సమాచారం. జాతీయస్ధాయిలో పార్టీని దెబ్బకొడుతున్న ఎంఐఎంకు కాంగ్రెస్ పార్టీ ఒక ఎంఎల్సీ సీటు ఎందుకు ఇవ్వాలన్న అధిష్ఠానం లాజిక్కుకు రేవంత్ ముందు సరైన సమాధానం చెప్పలేకపోయారని తెలిసిందే. అయితే తెలంగాణలో ముఖ్యంగా ఓల్డ్ సిటీలో ఎంఐఎం మద్దతులేకుండా రాజకీయంచేయటం కష్టమని రేవంత్ బదులిచ్చారు. తొందరలోనే జరగబోతున్న స్ధానికసంస్ధల ఎన్నికలు, ఆ తర్వాత జరగబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)(GHMC) ఎన్నికల్లో మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలంటే ఎంఐఎం మద్దతు ఎంతవసరమన్న విషయాన్ని అధిష్ఠానానికి రేవంత్ స్పష్టంగా చెప్పారని పార్టీవర్గాల్లో టాక్ వినబడుతోంది.

ఏదేమైనా ఎంఎల్ఏ కోటాలో ఎంఎల్సీ సీటు ఎంఐఎంకు ఇవ్వటం సాధ్యంకాదని భవిష్యత్తులో జరగబోయే స్ధానికసంస్ధల ఎంఎల్సీ ఎన్నికల్లో ఎంఐఎంకు మద్దతు ఇచ్చే విషయాన్ని ఆలోచిద్దామని అధిష్ఠానం రేవంత్ కు స్పష్టంగా తేల్చిచెప్పింది. దాంతో చేసేదిలేక రేవంత్ తలూపారని పార్టీనేతలు చెప్పారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటుంది. అదేమిటంటే ఎంఐఎం విషయంపై అధిష్ఠానం-రేవంత్ మధ్య చర్చలు జరగటం వరకు ఓకేనే. మరి ఎంఐఎం ఏ విధంగా రియాక్టవుతుందన్నది కీలకం. అధిష్ఠానం చెప్పిందాంతో ఎంఐఎం అంగీకరించకపోతే రేవంత్ కు తలనొప్పులు తప్పేలాలేదు.

ఎందుకంటే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అత్యధిక డివిజన్లు గెలుచుకోవటం ద్వారా మేయర్ సీటును కైవసంచేసుకోవటం కాంగ్రెస్ కు చాలాచాలా ముఖ్యం. జీహెచ్ఎంసీ పరిధిలోని 150 డివిజన్లలో మెజారిటి డివిజన్లు గెలవాలంటే అందుకు ఎంఐఎం సహకారం చాలాఅవసరం. డైరెక్టుగా మజ్లిస్ పార్టీతో పొత్తులేకుంటే అసదుద్దీన్ సహకరించరని తెలిసిందే. పొత్తులేకపోతే ఎంఐఎం అన్నీ డివిజన్లలో పోటీచేయటం ఖాయం. (కాంగ్రెస్)కాంగ్రెస్-ఎంఐఎం-బీఆర్ఎస్-బీజేపీ అభ్యర్ధులు కాకుండా ఇండిపెండెంట్లు కూడా పోటీచేస్తారు. ఇంతమంది అభ్యర్ధులు పోటీచేసేటపుడు కాంగ్రెస్ గెలుపు గాలిలో దీపమనే చెప్పాలి. అదే ఎంఐఎం తో పొత్తుంటే కనీసం ఓల్డ్ సిటీలోని సుమారు 50 డివిజన్లలో అయినా షేరింగు లేదా పొత్తులో ఎక్కువ సీట్లు గెలుచుకోవచ్చు. మిగిలిన 100 డివిజన్లలో ముస్లిం ఓట్లు లేదా ఎంఐఎం సానుభూతి, అభిమానుల ఓట్లు కాంగ్రెస్ అభ్యర్ధులకు పడితే మెజారిటి డివిజన్లలో గెలవచ్చన్నది రేవంత్ ఆలోచన.

అందుకనే ముందుజాగ్రత్తగా అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఎంఐఎంతో రేవంత్ సఖ్యతగా ఉంటున్నది. ఎంఐఎం కూడా కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీ సమావేశాల్లోనే కాకుండా బయటకూడా గట్టి మద్దతుదారుగా నిలబడుతోంది. ఇపుడు ఎంఐఎంను కాంగ్రెస్ కాదంటే వెంటనే ఆ పార్టీ మళ్ళీ బీఆర్ఎస్ తో జతకడుతుంది. అదేజరిగితే కాంగ్రెస్ కు ఇబ్బందులు తప్పవు. ఇవన్నీ ఆలోచించుకునే ఎంఎల్ఏ కోటాలో ఒకసీటును ఎంఐఎంకు కేటాయించాలని రేవంత్ ప్రయత్నించింది. అయితే అధిష్ఠానం సానుకూలంగా స్పందించకపోవటంతో ప్రస్తుతానికైతే ఎంఐఎంకు షాక్ కొట్టినట్లే అనుకోవాలి.

Read More
Next Story