హైదరాబాద్.. దేశానికే రోల్‌ మోడల్: రేవంత్ రెడ్డి
x

హైదరాబాద్.. దేశానికే రోల్‌ మోడల్: రేవంత్ రెడ్డి

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతే అభివృద్ధి మొదలైందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌ను తమ ప్రభుత్వం దేశానికే రోల్ మోడల్‌గా తీర్చిదిద్దడమే తమ ధ్యేయమని చెప్పుకొచ్చారు.


రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతే అభివృద్ధి మొదలైందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌ను తమ ప్రభుత్వం దేశానికే రోల్ మోడల్‌గా తీర్చిదిద్దడమే తమ ధ్యేయమని చెప్పుకొచ్చారు. గచ్చిబౌలిలోని ఇండియన్ బిజినెస్ స్కూల్‌ వేదికగా జరుగుతున్న లీడర్ షిప్ సమ్మిట్‌లో రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ అభివృద్ధి కోసం తమ ప్రభుత్వం అహర్నిశలు శ్రమిస్తుందని అన్నారు. ఐఎస్‌బీ ఈ ఏడాది ఎంచుకున్న లీడర్ షిప్ ఇన్ న్యూ ఇండియా థీమ్‌పై తన ఆలోచనలను ప్రజలతో పంచుకుంటానని అన్నారు. ఈ సమ్మిట్‌లో పాల్గొనడం తనకెంతో సంతోషంగా ఉందని, ఐఎస్‌బీలో చదువుకుంటున్న వారు తెలివైనోళ్లు, అసాధారణ ప్రతిభ ఉన్న విద్యార్థులు అని కొనియాడారు.

రాజకీయాల నుంచి తాను నాయకత్వం గురించి ఎన్నో పాఠాలు నేర్చుకుంటానని, కాంగ్రెస్‌కు అద్భుతమైన వారసత్వం ఉందని చెప్పుకొచ్చారు. గాంధీ, నెహ్రూ, సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, పీవీ నరసింహరావు, మన్మోహన్ సింగ్ వంటి నాయకులు కాంగ్రెస్‌లో ఎందరో ఉన్నారని, ఎంతటి గొప్పనాయకుడైనా మనోధైర్యం చాలా ముఖ్యమని, అది లేకుంటే నాయకుడిగా ఎదగలేరని అన్నారు. తెలివి తేటలు, కష్టపడి పనిచేయడం, నైపుణ్యంతో పాటు కొన్నిసార్లు అదృష్టం కూడా కలిసి రావాని చెప్పుకొచ్చారు.

రిస్క్ తీసుకుంటేనే అనుకున్నది సాధించగలం

‘‘గొప్ప పనులు చేయడానికి, గొప్ప విజయాలు సాధించడానికి రిస్క్ తీసుకోవాలి. రిస్క్ లేకుండా కొన్ని సార్లు కొన్ని సాధించలేం. గొప్ప నాయకులు త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మన పోరాటంలో చాలా కోల్పోవచ్చు. మన కాంగ్రెస్ నాయకులు దేశంలో చాలా గొప్ప నాయకులుగా నిలిచిన వారే. మీరు మంచి నాయకుడిగా ఎదగాలంటే అందుకు ధైర్యం, త్యాగం అనే రెండు విలువల గురించి నేర్చుకోవాలన్నారు. ధైర్యం ఉండి త్యాగం చేయడానికి సిద్ధంగా ఉంటే విజయం సాధించగలుగుతాం. ప్రజలకు అనుబంధం ఏర్పరుచుకుంటే ఏమైనా సాధించగలం. ఐఎస్‌బీ విద్యార్థులుగా మీరు హైదరాబాద్, తెలంగాణతో పాటు న్యూ ఇండియాకు కూడా బ్రాండ్ అంబాసిడర్‌లు.తెలంగాణను ఒక ట్రిలియన్ డాలర్ల జీడీపీ ఆర్థిక వ్యవస్థగా మార్చాలన్నదే కాంగ్రస్ లక్ష్యం’’ అని వివరించారు.

లక్ష సాధనకు మీ సాయం కావాలి

‘‘ట్రిలియన్ డాలర్ల జీడీపీ సాధించాలంటే హైదరాబాద్‌ను 600 బిలియన్ డాలర్ల నగరంగా మార్చాలి. తెలంగాణను ప్రపంచ నలుమూలలు తీసుకెళ్లడానికి మాకు మీ సాయం కావాలి. మీరు ఎక్కడికి వెళ్లినా వ్యాపారవేత్తలు, ప్రజలు అందరితో కూడా తెలంగాణ, హైదరాబాద్ గురించి మాట్లాడండి. దేశంలోని ఇతర నగరాలతో హైదరాబాద్ పోటీ పడాలని కోరుకుంటున్నాం. ప్రపంచంలోనే భారత్ దేశం, హైదరబాద్ అత్యుత్తమంగా మారాలన్నదే లక్ష్యం. అది అసాధ్యం ఎప్పటికీ కాదు. మా ప్రభుత్వంతో మీరు రెండు మూడేళ్లు కలిసి పనిచేయాలని కోరుకుంటున్నాను. మీకు పెద్దపెద్ద జీతాలు ఇవ్వలేకపోయినా మంచి అవకాశఆలు, పెద్ద సవాళ్లను అందిస్తా. రాష్ట్రంలో సిల్క్ యూనివర్సిటీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నాం. గచ్చిబౌలిలో స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తాం. సౌత్ కొరియా లాంటి చిన్న దేశంలో కూడా ఒలింపిక్స్‌లో ఎన్నో మెడల్స్ సాధించింది. కానీ మనదేశంలో ఒక్క బంగారు పథకం కూడా సాధించలేకపోయింది. ఒలింపిక్స్‌లో పథకాలు సాధించడమే నా లక్ష్యం’’ అని వివరించారు.

Read More
Next Story