Malla Reddy
x

పార్టీ మారడంపై మల్లారెడ్డి మాట వేరు, రూటు వేరు...

తెలంగాణ మాజీ మంత్రి మల్లారెడ్డి వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌ గా మారింది. ఒకవైపు వరుసపెట్టి కాంగ్రెస్ నేతల్ని కలుస్తారు.


తెలంగాణ మాజీ మంత్రి మల్లారెడ్డి వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌ గా మారింది. ఒకవైపు వరుసపెట్టి కాంగ్రెస్ నేతల్ని కలుస్తారు. పార్టీ మారుతున్నారా అని అడిగితే మాత్రం నేను చనిపోయేవరకు బీఆర్ఎస్ లోనే కొనసాగుతా అంటారు. దీంతో అందరిలోనూ ఆయన పయనమెటు అనే కన్ఫ్యూజన్ మొదలైంది.

ఈ క్రమంలోనే మల్లారెడ్డి కర్ణాటక ఉప ముఖ్యమంత్రిని కలిసిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కొడుకుతో కలిసి బెంగళూరు వెళ్లి ఆయనని కలవడం చర్చనీయాంశం అయ్యింది. దీంతో ఆయన కాంగ్రెస్ లో చేరడం ఖాయం అనే ప్రచారం జోరందుకుంది.

ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి మల్లారెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు భూ అక్రమాలకు పాల్పడుతున్నారని రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. రేవంత్ తనపై చేసిన ఆరోపణలు రుజువు చేయాలంటూ మల్లారెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. తొడకొట్టి మరీ సవాల్ విసిరారు. ఈ వివాదం అప్పట్లో పెద్ద ఎత్తున ఆందోళనలకు దారి తీసింది. దీనిపై మల్లారెడ్డి, రేవంత్ రెడ్డిల మధ్య అగ్గి రాజేస్తూనే ఉంది.

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మల్లారెడ్డి పై ఉన్న భూకబ్జా ఆరోపణలపై ఫోకస్ పెట్టారు. ఇటీవల మల్లారెడ్డి, ఆయన అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి కళాశాల భవనాల్లోని అక్రమ కట్టడాలను ప్రభుత్వం కూల్చివేసింది. దీంతో మల్లారెడ్డికి, ఆయన కుటుంబ సభ్యులకి కష్టాలు మొదలయ్యాయి అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

కూల్చివేతల నేపథ్యంలో మల్లారెడ్డి అల్లుడితో కలిసి సీఎం ముఖ్య సలహాదారు నరేందర్ రెడ్డి తో భేటీ అయ్యారు. దీంతో ఆస్తులను కాపాడుకునేందుకు కాంగ్రెస్ లో చేరడానికి సిద్ధమయ్యారని అంతా భావించారు. కానీ ఆయన గులాబీ పార్టీలోనే కొనసాగుతానని చెప్పారు. కానీ ముందుగా అనుకున్నట్టు కొడుకుని మల్కాజిగిరి పార్లమెంటు నుంచి పోటీ చేయించాలనే నిర్ణయాన్ని విరమించుకున్నారు. మల్లారెడ్డి, కొడుకు భద్రారెడ్డి పోటీ కి విముఖత వ్యక్తం చేయడంతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరో అభ్యర్థిని ప్రకటించారు.



ఇదిలా ఉండగా, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి శివ కుమార్ తో భేటీ అవడం చర్చలకు దారి తీసింది. పార్టీలోకి ఆయన ఎంట్రీని రాష్ట్ర నాయకత్వం వ్యతిరేస్తుండటంతో రూటు మార్చి ప్రయత్నాలు పెట్టారని అంతా భావిస్తున్నారు. కాంగ్రెస్ పెద్దల నుండి పావులు కదుపుతున్నారనే టాక్ మొదలైంది. అయితే దీనిపై మల్లారెడ్డి స్పందిస్తూ తాను కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లడం లేదని బీఆర్ఎస్‌లోనే కొనసాగనున్నట్లు స్పష్టం చేశారు.

అలాగే వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని.. ఈ ఐదేళ్లు మాత్రమే రాజకీయాల్లో ఉండి తర్వాత తప్పుకుంటానని వెల్లడించారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ ను ఓ ప్రైవేటు కార్యక్రమంలో కలిశానని, ఈ భేటీకి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదన్నారు. డీకే శివకుమార్ తనకు స్నేహితుడని.. వ్యాపార పనుల నిమిత్తం ఆయనను కలిసినట్లు క్లారిటీ ఇచ్చారు. ఇదిలా ఉంటే మరోవైపు కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంకగాంధీ అపాయింట్‌మెంట్ కోరినట్లుగా వార్తలు వస్తున్నాయి.


Read More
Next Story