ప్రమాదాన్ని ఏమాత్రం పట్టించుకోని సిగాచి మేనేజ్మెంట్
x
Sigachi Chemical Factory

ప్రమాదాన్ని ఏమాత్రం పట్టించుకోని సిగాచి మేనేజ్మెంట్

ఇంతటి ఘోరవిపత్తు జరిగినా ఫ్యాక్టరి మేనేజింగ్ డైరెక్టర్/సీఈవో అమిత్ రాజ్ సిన్హా ఇప్పటివరకు అడ్రస్ లేడు.


కొన్నిమేనేజ్మెంట్లు ఇలాగే ఉంటాయి. లాభాలకోసం ఉద్యోగులను పట్టిపీడించి పనిచేయించుకోవటమే తెలిసిన యాజమాన్యాలు ఉద్యోగులు, కార్మికుల సంక్షేమాన్ని గాలికి వదిలేస్తాయి. ఇలాంటి కోవలోకే పాశమైలారంలో ఉన్న సిగాచి కెమికల్ ఫ్యాక్టరి(Sigachi factory) మేనేజ్మెంట్ చేరుతుంది అనటంలో సందేహంలేదు. ఫ్యాక్టరిలో భారీ అగ్నిప్రమాదం జరిగి ఇప్పటికి 48 గంటలుదాటింది. ప్రమాదంలో 48 మంది చనిపోగా మరో 35 మంది తీవ్రగాయాలతో ఆసుపత్రుల్లో ప్రాణాలకోసం పోరాడుతున్నారు. ప్రమాదం కారణంగా సుమారు 45 మంది ఆచూకీ తెలియలేదు. పేలుడుధాటికి కుప్పకూలిపోయిన మూడంతస్తుల భవన శిధిలాలను పూర్తిగా తొలగిస్తే కాని వాటికింద ఎవరైనా ఉన్నారా లేరా అన్నవిషయంలో క్లారిటిరాదు. శిధిలాలకింద ఉన్నవారు చనిపోయుంటారనే అందరు అనుమానిస్తున్నారు.

ఇంతటి ఘోరవిపత్తు జరిగినా ఫ్యాక్టరి మేనేజింగ్ డైరెక్టర్/సీఈవో అమిత్ రాజ్ సిన్హా ఇప్పటివరకు అడ్రస్ లేడు. ఎక్కడ ఎలాంటి ప్రమాదం జరిగినా వెంటనే యాజమాన్యం బాధ్యత తీసుకుంటుంది. యజమాని అంటే ఛైర్మన్ లేదా ఎండీ లాంటి బాధ్యతాయుతమైన స్ధానాల్లో ఉన్న వాళ్ళు ఫ్యాక్టరికి చేరుకుని సహాయపనులు పర్యవేక్షించటమే కాకుండా ప్రభుత్వంతో చర్చలు జరిపి బాధితులకు ఊరటగా ఏదో ఒక ప్రకటనచేయటం అందరికీ తెలిసిందే. మృతుల కుటుంబాలకు నష్టపరిహారం, మృతులకుటుంబాల్లో ఎవరో ఒకరికి ఉద్యోగం లాంటి ప్రకటనలు చేస్తారు. కాని సిగాచి ఫ్యాక్టరి యజమాన్యం అసలు అడ్రస్సే లేదు. సోమవారం ఉదయం ప్రమాదం జరిగితే మంగళవారం మధ్యాహ్నం రేవంత్ ప్రమాదస్ధలాన్ని పరిశీలించారు. ఆసుపత్రుల్లో వైద్యంచేయించుకుంటున్న బాధితులను పరామర్శించటమే కాకుండా వారి కుటుంబసభ్యులతో మాట్లాడారు.

ఫ్యాక్టరీకి రేవంత్(Revanth) వచ్చినా యాజమాన్యం తరపున ఎవరూ కనబడలేదు. మొక్కుబడిగా ఫ్యాక్టరి ఉద్యోగి మాత్రమే ఉన్నాడు. ఈవిషయాన్ని గమనించిన రేవంత్ తీవ్ర అంసతృప్తి వ్యక్తంచేశాడు. అయినా మేనేజ్మెంట్ లెక్కచేయలేదు. కటుంబసభ్యులను పరామర్శించిన రేవంత్ మీడియాతో మాట్లాడుతు మృతుల కుటుంబాలకు పరిహారంగా తలా కోటిరూపాయలు, తీవ్రంగా గయపడిన వారి వైద్య ఖర్చులకు రు. 50 లక్షలు, పాక్షికంగా గాయపడిన వారి వైద్యానికి రు. 10 లక్షలు యాజమాన్యం నుండి ఇప్పిస్తామని ప్రకటించారు. రేవంత్ ప్రకటనకు కూడా యాజమాన్యం ఏమాత్రం స్పందించలేదు. తీరిగ్గా బుధవారం ఉదయం స్పందించిన యాజమాన్యం మృతులకుటుంబాలకు పరిహారంగా తలా కోటిరూపాయలు ఇస్తామని ప్రకటించి చేతులు దులిపేసుకుంది.

కేసులు నమోదైన తర్వాతే స్పందన

ప్రమాదానికి బాధ్యులను చేస్తు ఫ్యాక్టరి యాజమాన్యంపై మంగళవారం రాత్రి మూడుకేసులు నమోదయ్యాయి. బాధిత కుటుంబాల్లో యువకుడు యశ్వంత్ ఫిర్యాదు ఆధారంగా బీడీఎల్ భానూరు పోలీసులు కేసులు నమోదుచేశారు. భారత్ న్యాయ్ సంహిత్(బీఎన్ఎస్) 105, 110, 117 సెక్షన్ల కింద యాజమాన్యంపై కేసులు నమోదయ్యాయి. అలాగే రాష్ట్ర మానవహక్కుల సంఘంతో పాటు జాతీయ మానవహక్కుల సంఘాం సూమోటోగా కేసులు నమోదుచేసి ఫ్యాక్టరీ యాజమాన్యానికి నోటీసులు జారీచేసింది. ప్రమాదం జరిగి 24గంటలు దాటినా యాజమాన్యం స్పందించలేదని రేవంత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసినా యాజమాన్యం ఏమాత్రం లెక్కచేయలేదు. అలాంటిది బుధవారం హడావుడిగా ప్రకటన చేయటానికి కారణం మంగళవారం రాత్రి తమపై మూడుకేసులు నమోదవ్వటమే అని అర్ధమవుతోంది.

తమ ఫ్యాక్టరిలో జరిగిన పేలుడులో 40 మంది చనిపోయినట్లు యాజమాన్యం తరపున విడుదలైన ప్రకటనలో కంపెనీ సెక్రటరీ వివేక్ కుమార్ చెప్పారు. 40 మంది చనిపోగా మరో 33 మంది తీవ్రంగా గాయపడినట్లు తెలిపారు. మృతుల కుటుంబాలకు కోటిరూపాయల చొప్పున పరిహారం ఇస్తామని ప్రకటించారు. గాయపడిన వారికి పూర్తి వైద్య ఖర్చులు భరించటమే కాకుండా కుటుంబాలకు అన్నివిధాలుగా అండగా ఉంటామని ప్రకటనలో వివేక్ భరోసా ఇచ్చారు. పేలుడుకు రియాక్టర్ కారణం కాదని కూడా వివేక్ స్పష్టంచేశారు. ప్రమాదం కారణంగా మూడునెలలు ప్లాంటులో అన్నీ కార్యకలాపాలను నిలిపేస్తున్నట్లు వివేక్ ప్రకటించారు.

రేవంత్ ను కూడా లెక్కచేయని యాజమాన్యం

ప్రమాదం జరిగిన 48 గంటల తర్వాత కంపెనీ సెక్రటరి వివేక ఒక ప్రకటనలో స్పందించారు కాని మేనేజ్మెంట్ మాత్రం ఫ్యాక్టరీకి రాలేదు. అలాగే ప్రభుత్వాన్ని కూడా కలవకపోవటమే ఆశ్చర్యంగా ఉంది. తమ వైఖరిపై రేవంత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసిన విషయం తెలిసినా యాజమాన్యం మాత్రం ఏమాత్రం లెక్కచేయలేదు. ప్రభుత్వం విషయంలోనే ఇంత లెక్కలేనితనంతో వ్యవహరిస్తున్న యాజమాన్యం ఇక ఉద్యోగులు, కార్మికుల సంక్షేమానికి ఎంత విలువ ఇస్తుందో అర్ధంచేసుకోవచ్చు. విచిత్రం ఏమిటంటే పేలుడుజరిగిన సమయంలో ఫ్యాక్టరీలో ఎంతమంది కార్మికులు ఉన్నారు అనే కచ్చితమైన లెక్కకూడా యాజమాన్యం దగ్గరలేదు.

లేబర్ సంఖ్యపై కాకిలెక్కలేనా ?

డైలీ లేబర్ గా పనిచేసేందుకు ప్రతిరోజు ఫ్యాక్టరీకి చాలామంది వస్తునే ఉంటారని స్ధానికులు చెప్పారు. ఆదివారం వచ్చిన లేబర్ సోమవారం వస్తారని గ్యారెంటీలేదు, సోమవారం వచ్చిన లేబర్ మంగళవారం వస్తారని అనుకునేందుకు లేదు. ఇలాంటి పరిస్ధితుల్లో యాజమాన్యం లేబర్ తో పనిచేయించుకుంటోంది. ఫ్యాక్టరి ప్రతిరోజు మూడుషిఫ్టుల్లో పనిచేస్తునే ఉంటుంది. ఈనేపధ్యంలోనే ప్రమాదంజరిగిన సోమవారం ఉదయం మొదటిషిఫ్టులో పనిచేసేందుకు తెల్లవారి 9 గంటలకు వచ్చిన లేబర్+ముందురోజు రాత్రి మూడోషిఫ్టులో పనిచేసి ఇళ్ళకు వెళ్ళాల్సిన లేబర్ కొంతమంది ఫ్యాక్టరీలోనే ఉన్నారు. వీళ్ళతో పాటు రెగ్యులర్ ఉద్యోగులు కూడా ఉన్నారు. మొదటిషిఫ్టులో పనిచేయటానికి వచ్చిన లేబర్ ఎంట్రీలు లేవని సమాచారం. అందుకనే రాత్రి మూడోషిఫ్టు అయిపోయిన లేబర్లో ఎంతమంది ఫ్యాక్టరీలోనే ఉన్నారు, మొదటి షిఫ్టులో పనిచేయటానికి వచ్చిన లేబర్ ఎంతమంది అన్న వివరాలు ఎవరిదగ్గరా లేవు. ఈ కారణంగానే ప్రమాదంజరిగినపుడు ఫ్యాక్టరీలో 130 మంది ఉన్నారని కొందరు, కాదు, కాదు 150 మంది అని ఇంకొందరు, అంతమంది లేరు 140 మంది ఉంటారనే మరికొందరు చెబుతున్న సంఖ్యలు ప్రచారంలో ఉన్నాయి.

యాజమాన్యంపై ఆగ్రహం

ప్రమాదంలో చనిపోయాడు అని అనుమానిస్తున్న జస్టిన్(20) మేనత్త కే సుజాత ‘తెలంగాణ ఫెడరల్’ తో మాట్లాడుతు యాజమాన్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ‘ప్రమాదం జరిగి 24 గంటలైనా మేనేజ్మెంట్ తమను పట్టించుకోలేద’ని మండిపడింది. ‘కార్మికుల ప్రాణాలంటే యాజమాన్యానికి కనీస గౌరవంకూడా లేద’ని దుయ్యబట్టింది. ‘ప్రమాదంలో 45 మంది చనిపోయినా యాజమాన్యం తమతో మాట్లాడలేద’ని తీవ్ర ఆగ్రహంవ్యక్తంచేసింది. ‘ప్రమాదం జరిగినపుడు ఫ్యాక్టరిలో ఎంతమంది కార్మికులు పనిచేస్తున్నారో కూడా ఎవరు చెప్పటంలేద’ని సుజాత మండిపోయింది.

Read More
Next Story