
మన్నెగూడ రోడ్డు ప్రమాదం
మన్నెగూడ రోడ్డు… మృత్యుమార్గంగా మారింది!
హైదరాబాద్ నుంచి బీజాపూర్ వెళ్లే రోడ్డుపై జరిగిన ప్రమాదాల్లో 200 మంది మృత్యువాత పడ్డారు.
హైదరాబాద్ నుంచి బీజాపూర్‌కు వెళ్లే రహదారి ఇప్పుడు ప్రయాణ మార్గం కాదు… మృత్యుమార్గంగా మారింది. ప్రతీ మలుపు ప్రాణాంతకం, ప్రతీ గుంత ప్రమాదానికి పిలుపు. తరచూ జరిగే రోడ్డు ప్రమాదాల్లో 200 మంది దాకా ప్రాణాలు కోల్పోయినా పాలకుల్లో మాత్రం చలనం లేదు. అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు ప్రతి కిలోమీటర్లోనూ రక్తచరిత్ర రాసుకుంటూ సాగుతోంది ఈ రహదారి. రోడ్డు విస్తరణ పనులు ఆగిపోయి, మూలమలుపులు మృత్యువుకు ద్వారాలుగా మారాయి. “హైవే” అనే పేరు ఉన్నా… ప్రజల జీవితాలను హరించే మృత్యు రహదారిగా మారిందీ బీజాపూర్ రోడ్డు.
- చేవెళ్ల - మన్నెగూడ రహదారి మరోసారి రక్తసిక్తంగా మారింది.బీజాపూర్ జాతీయ రహదారి మీదుగా హైదరాబాద్ నుంచి చేవెళ్ల, మన్నెగూడ మీదుగా వికారాబాద్ జిల్లాకు వెళ్లే ఈ రహదారిపై తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ రోడ్డు ప్రమాదాల్లో 200 మందికి పైగా ప్రయాణికులు మరణించినా పాలకుల్లో చలనం లేదు.
ఘోర రోడ్డు ప్రమాదం
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 25 మంది మరణించారు. టీజీఆర్టీసీ బస్సు తాండూరు నుంచి హైదరాబాద్ వస్తుండగా కంకర లోడుతో వస్తున్న టిప్పర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో 24 మంది మరణించగా పలువురు గాయపడ్డారు.
- 2024 డిసెంబరు : రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం పొద్దుటూరు గ్రామానికి చెందిన మేకల లక్ష్మారెడ్డి (57), అతని భార్య మేకల భాగ్యలక్ష్మీ (52) చేవెళ్ల మండలం దేవరాంపల్లి గ్రామంలో బంధువుల ఇంటికి వెళ్లి వస్తుండగా మీర్జాగూడ వద్దకు రాగానే లారీ ఢీకొనడంతో భార్యాభర్తలు మరణించారు.
- 2024 డిసెంబరు : చేవెళ్ల మండలం ఆలూరు గేటు వద్ద కూరగాయలు అమ్ముకుంటున్న రైతులపైకి లారీ దూసుకెళ్లడంతో అక్కడిఅక్కడే ముగ్గురు మరణించారు.
డేంజర్ మూలమలుపుల రోడ్డు
హైదరాబాద్ అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు రోడ్డు ప్రమాదకరమైన మూల మలుపులతో కూడి ఉంది. చేవెళ్ల- మన్నెగూడ రోడ్డు ఇరుకుగా ఉండటంతో పాటు మధ్యలో డివైడర్ లేకపోవడం వల్ల తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. వికారాబాద్, పరిగి, తాండూర్, కొడంగల్, కర్ణాటక ప్రాంత ప్రజలు ఈ రోడ్డుపై నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. రోడ్డు మలుపుల వల్ల ఈ మార్గంలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నా అధికారులెవరూ పట్టించుకోవడం లేదు. మూలమలుపులతో ఈ మార్గం మృత్యువుకు రహదారిగా మారింది. పోలీసు అకాడమీ నుంచి మన్నెగూడ దాకా 66 రోడ్డు మలుపులున్నాయి. ఇందులో 19 టర్నింగులు అత్యంత ప్రమాదకరమైనవి. రాణే ఇంజన్
నాలుగు వరసల రోడ్డు నిర్మాణం ఏది?
హైదరాబాద్ అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు 46 కిలోమీటర్ల దూరం రోడ్డును నాలుగు వరసల రోడ్డుగా మారుస్తామని గత కేసీఆర్ ప్రభుత్వంలో నేతలు హామి ఇచ్చినా నెరవేరలేదు. ప్రస్థుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ రోడ్డు నిర్మాణం గురించి పట్టించుకోలేదు. దాని ఫలితంగా తరచూ ఈ రోడ్డుపై ప్రమాదాలు జరుగుతున్నాయి. బీజాపూర్ హైవే రోడ్డు విస్తరణ పనులు మాత్రం పూర్తి కాకపోవడంతో ఈ రోడ్డు మృత్యుమార్గంగా మారిందని స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు.
200 మంది ప్రాణాలు తీసిన బీజాపూర్ రోడ్డు
ఇరుకు రోడ్డుతోపాటు మూలమలుపుల్లో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక పోవడం, లోతైన గుంతల వల్ల తరచూ బీజాపూర్ జాతీయ రహదారిని ప్రమాదాలకు నిలయంగా మారిందని ఈ ప్రాంత ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. బీజాపూర్ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇప్పటి వరకు 200 మందికి పైగా ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. హైదరాబాద్ పోలీసు అకాడమీ నుంచి వికారాబాద్ జిల్లా మన్నెగూడ వరకు పలు ప్రమాదకర గుంతలు ఉండటంతో తరచూ ప్రమాదాలు వాటిల్లుతున్నాయి.బీజాపూర్ రోడ్డు విస్తరణకు కేంద్ర రోడ్లు, రవాణశాఖ మంత్రి నితిన్ గడ్కరీ శంకుస్థాపన చేసినా రోడ్డు నిర్మాణం పూర్తి కాలేదు. దీంతో ప్రమాదాల సంఖ్య పెరుగుతూనే ఉంది.
163 వ నంబరు జాతీయ రహదారి...
హైదరాబాద్ నుంచి బీజాపూర్ వెళ్లే 365 కిలోమీటర్ల జాతీయ రహదారి నంబరు 163. మన్నెగూడ నుంచి బీజాపూర్ వరకు డబుల్ రోడ్డు ఉంది. హైదరాబాద్ నుంచి మన్నెగూడ వరకు 46 కిలోమీటర్ల రహదారి సింగిల్ రోడ్డు. దీంతో ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయి. ఎనికెపల్లి చౌరస్తా, రాణె ఇంజన్ వాల్స్, హిమాయత్ నగర్, అజీజ్ నగర్ పాత చౌరస్తా, చిలుకూరు మృగవని వద్ద డేంజర్ మూలమలుపులున్నాయి. కనకమామిడి పాత రోడ్డు, కనకమామిడి స్టేజి,చిన్నషాపూర్ గేట్ , విద్యుత్ సబ్‌స్టేషన్ మలుపు, గ్రీన్‌ఫీల్డ్ రిసార్ట్స్, కేతిరెడ్డి గేట్ సమీపంలో, అప్పారెడ్డిగూడ-తోల్‌కట్టా మధ్య, ముడిమ్యాల స్టేజీ, అటవీ ప్రాంతం వద్ద రోడ్డు మలుపు, కందాడ, మల్కాపూర్ వద్ద రోడ్డు మలుపులు ప్రమాదాలకు నిలయంగా మారాయి.మలుపుల వద్ద మృత్యుఘోష వినిపిస్తున్నా అధికారులెవరూ పట్టించుకోవడం లేదు.
మృత్యుమార్గం...బీజాపూర్ రోడ్డు
రోజూ వేలాది వాహనాలు దూసుకెళుతున్న బీజాపూర్ రోడ్డు… ఇప్పుడు ప్రాణాలకు పాస్‌పోర్టుగా మారింది. ఎన్నో కుటుంబాల కన్నీళ్లు, అనాధలైన చిన్నారుల బాధ, దుఃఖంలో మునిగిపోయిన ఊర్లు...ఇవన్నీ ఈ రహదారి చరిత్రలో ముద్రలయ్యాయి. రోడ్డు విస్తరణ హామీలు కాగితాలకే పరిమితమై, మలుపులు మాత్రం మృత్యువుకు చిహ్నాలుగా నిలిచిపోయాయి. ఇకనైనా ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు కదిలి ఈ రహదారిని మృత్యుమార్గం నుంచి జీవమార్గంగా మార్చే దిశగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
Next Story

