మానుకోట బిడ్డ ‘పల్లపు స్వాతి’ని వరించిన గోల్డ్ మెడల్
మానుకోట బిడ్డ పల్లపు స్వాతికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం గోల్డ్ మెడల్ ప్రధానం చేసింది. దీనిని రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ అందించారు.
మహబూబాబాద్ జిల్లా పెద్ద వంగర మండలం వడ్డె కొత్తపల్లికి చెందిన పల్లపు స్వాతికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం గోల్డ్ మెడల్ ప్రదానం చేసింది. మధ్య తరగతి కుటుంబానికి చెందిన స్వాతి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎం.ఏ. (తెలుగు సాహిత్యం), ఎం.ఏ.(సామాజిక శాస్తం) చదివారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి ఎం.ఏ.(అనువర్తిత భాషాశాస్త్రం), తెలుగు సాహిత్యంలో ఎం.ఫిల్.(మాస్టర్ ఆఫ్ ఫిలాసఫీ) పరిశోధన చేశారు.
ఆచార్య సి.మృణాళిని పర్యవేక్షణలో "విమల రచనలు - సామాజికార్థిక విశ్లేషణ" అంశంపై పరిశోధన సిద్దాంత వ్యాసం సమర్పించారు.బుధవారం హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగిన పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 16వ స్నాతకోత్సవంలో రాష్ట్ర గవర్నర్, విశ్వవిద్యాలయ ఛాన్స్ లర్ డా. తమిళిసై సౌందర రాజన్ చేతుల మీదుగా స్వాతి గోల్డ్ మెడల్ అందుకున్నారు.
విశ్వ విద్యాలయ వైస్ ఛాన్స్ లర్ ఆచార్య తంగెడ కిషన్ రావు, రిజిస్ట్రార్ ఆచార్య భట్టు రమేష్, ఆచార్య సి. మృణాళిని, ఆచార్య కె. హనుమంతరావు, ఆచార్య రత్న శ్రీ, అధ్యాపక బృందం, తల్లిదండ్రులు పల్లపు రేణుక, సమ్మయ్య, సహచరుడు డాక్టర్ శివరాత్రి సుధాకర్, పరిశోధక విద్యార్థులు పల్లపు స్వాతిని కోడం కుమారస్వామి తదితరులు అభినందించారు.