భద్రాచలం అంటే రాములోరి కళ్యాణం, పర్ణశాలే కాదు, ఇవి కూడా..
x

భద్రాచలం అంటే రాములోరి కళ్యాణం, పర్ణశాలే కాదు, ఇవి కూడా..

భద్రాచలం అనగానే విశిష్టంగా గుర్తోచేవి రాములోరి కళ్యాణం, పర్ణశాల, గుడి నిర్మించిన రామదాసు. కానీ వీటితోపాటు ఆలయానికి సంబంధించిన ఎన్నో విశేషాలు ఉన్నాయి.


భద్రాచలం అనగానే విశిష్టంగా గుర్తోచేవి రాములోరి కళ్యాణం, పర్ణశాల, గుడి నిర్మించిన రామదాసు. కానీ వీటితోపాటు ఆలయానికి సంబంధించిన ఎన్నో విశేషాలు ఉన్నాయి. ఇవి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం.

దేశంలోని శ్రీరాముని దేవాలయాలలో అన్నిచోట్లా శ్రీరాముని విగ్రహం రెండు చేతులతో మానవుడి రూపాన్ని పోలి ఉంటుంది. కానీ భద్రాచలంలోని రామాలయంలో సీతారామచంద్ర స్వామి విగ్రహం నాలుగు చేతులతో... శ్రీరాముని అవతారంలో ఉన్నట్టు కుడి చేతిలో బాణం, ఎడమ చేతిలో విల్లును ధరించి ఉంటాయి. అలాగే విష్ణువు మాదిరిగా ఇంకొక కుడి చేతిలో శంఖు, ఇంకొక ఎడమచేతిలో చక్రం ఉంటాయి.

ఇతర రామాలయాలలో సీతాదేవి రాముని పక్కనే నిల్చుని ఉంటుంది. కానీ ఈ గుడిలో మాత్రం అమ్మవారు స్వామి ఎడమ తొడపై కూర్చుని ఉంటుంది. అందుకే మిగిలిన దేవాలయాల్లో ఇద్దరికీ రెండు పీఠాలు ఉన్నట్టు ఇక్కడ ఉండదు. ఈ ఆలయంలో సీతారాములకు కలిపి ఒకే పీఠం ఉంటుంది.

అన్ని దేవాలయాలలో రామునికి కుడివైపున లక్ష్మణుడు ఉంటాడు. కానీ ఇక్కడ మాత్రం ఎడమపైపున ఉంటాడు.



భద్రుని కోరికమేరకు వైకుంఠం నుండి విచ్చేసిన విష్ణుమూర్తి నాలుగు భుజములతో దర్శనమివ్వటంవల్ల వైకుంఠరామునిగా కూడా ఆ స్వామివారు పిలవబడుతున్నారు.

తమిళ ఆచార్యులచే నిత్యా పూజలు..

ఆలయంలో పూజలు నిర్వహించేందుకు శ్రీరామదాసు శ్రీరంగం నుండి ఆరు వంశాలకు చెందిన శ్రీవైష్ణవ ఆచార్యుల కుటుంబాలను భద్రాచలానికి తీసుకువచ్చారు. ఈ ఆరు వంశీయులు ఇప్పటికీ భద్రాచలంలో నిత్య పూజలు నిర్వహిస్తున్నారు. శ్రీరంగంలో రామానుజాచార్యులు నిర్ణయించినట్టే ఇక్కడి ఆలయంలో కూడా పూజలు జరుపుతుంటారు.

జటాయుపాక (ఎటపాక) :

జటాయుపాక భద్రాచలం నుండి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సీతను రావణుడు బలవంతంగా ఎత్తుకెళ్తున్న సమయంలో.. రావణుడితో పోరాడి, సీతను రక్షించే ప్రయత్నంలో భాగంగా తన ప్రాణాలు విడిచిన స్థలానికి జటాయుపాక అనే పేరు వచ్చింది.

దుమ్ముగూడెం :

ఈ ప్రాంతంలో జరిగిన భీకర యుద్ధంలో రాముడు 14 వేలమంది రాక్షసులను హతమార్చాడట. ఆ రాక్షసుల బూడిదపై ఈ గ్రామం ఉంది కాబట్టి ఈ గ్రామానికి దుమ్ముగూడెం అని పేరొచ్చిందని స్థానికులు చెబుతున్నారు. ఇక్కడ రాముడు ఆత్మారాముడిగా కొలువుదీరాడు.

గుండాల:

గుండాల అనగా భద్రాచలానికి 5 కి.మీ దూరంలో ఉన్న వేడినీటి బుగ్గలు. ఇక్కడ గోదావరి నది ఒడ్డున ఎక్కడ తవ్వినా వేడి నీరు ఊరుతుంది. చలికాలంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఇక్కడ స్నానం చేస్తారని భక్తుల నమ్మకం.

భద్రాచలం అనే పేరు ఇలా వచ్చింది..

పూర్వం భద్రుడు అనే భక్తుడు శ్రీరామునిపై అమిత భక్తితో ఘోర తపస్సు చేశాడు. అతని భక్తికి మెచ్చి శ్రీరాముడు ప్రత్యక్షమై ఏదైనా వరం కోరుకోమని చెబుతాడు. తన శిరస్సు మీద శ్రీరాముడు నిరంతరమూ నివసిస్తూ వుండేటట్లు వరం అడిగాడు. శ్రీరాముడు అలాగేనని చెప్పి.. భార్య, తమ్ములతో కలిసి భద్రుని శిరస్సు మీద వెలసి ఉంటానని వరం ఇచ్చాడు. భద్రుడు పర్వత రాజు కుమారుడు గనుక, ఇక్కడ ఒక చిన్న కొండ రూపం ధరించి, సీతారామ చంద్రులను తన శిరస్సున మోస్తూ ఉన్నాడు. కనుక ఈ ప్రాంతానికి భద్రునికొండ అని పేరు వచ్చింది అని స్థలపురాణం చెబుతోంది. తర్వాతి కాలంలో భద్రునికొండ భద్రాచలం స్థిరపడింది.

పర్ణశాల:

భద్రాచలానికి 35 కి.మీ. దూరంలో ఉన్న ఈ ప్రాంతంలో వనవాసానికి వచ్చిన సీతారాములు ఇక్కడ నివసించారని ప్రతీతి. ఇక్కడ సీతారాముల నివాసం చేశారనడానికి కొన్ని గుర్తులు ఉన్నాయని స్థలపురాణం చెబుతుంది.

Read More
Next Story