చావు అంచులదాకా వెళ్ళొచ్చాడు కాబట్టే ప్రసాద్ లొంగిపోయాడా ?
x
Maoist central committee member Pulluri Prasad Rao surrendered

చావు అంచులదాకా వెళ్ళొచ్చాడు కాబట్టే ప్రసాద్ లొంగిపోయాడా ?

తనకు రక్షణగా నిలిచిన సభ్యులు చనిపోయినా అదృష్టంకొద్ది చంద్రన్న మాత్రం తప్పించుకున్నాడు


చావుఅంచుల దాకా వెళ్ళొచ్చాడు కాబట్టే మావోయిస్టు కేంద్ర కమిటిసభ్యుడు పుల్లూరి ప్రసాదరావు మంగళవారం పోలీసులకు లొంగిపోయాడా ? చచ్చిబతికాడంటారు కదా అదేపరిస్ధితి నుండి పుల్లూరి బయటపడినట్లున్నాడు. కాబట్టి పుల్లూరికి ప్రాణాల విలువ ఇతరులకన్నా బాగా తెలుసు. ఇంతకీ విషయం ఏమిటంటే మంగళవారం ఉదయం మావోయిస్టు(Maoist leader) కీలక నేత బండప్రకాష్ తో పాటు పుల్లూరిప్రసాదరావు కూడా డీజీపీ శివధర్ రెడ్డి(DGP Sivadhar Reddy) ఎదుట లొంగిపోయాడు. బండ లొంగుబాటుకన్నా పుల్లూరి లొంగుబాటు కాస్త ఇంట్రెస్టింగ్.

ఎలాగంటే, ఈఏడాది మేనెల కర్రెగుట్టల్లో భారీ ఎన్ కౌంటర్ జరిగిన విషయం గుర్తుండే ఉంటుంది. మేనెల 7వ తేదీన తెల్లవారుజామున భద్రతాదళాలు తెలంగాణ-చత్తీస్ గడ్ సరిహద్దుల్లో ఉన్న కర్రెగుట్టల అడవుల్లో కూంబింగ్ చేస్తున్నాయి. అడవుల్లో గాలింపుచేస్తున్న భద్రతాదళాలకు మావోయిస్టుల సమాచారం తెలిసింది. వెంటనే మావోయిస్టులున్న ప్రాంతాన్ని చుట్టుముట్టడంతో కాల్పులు, ఎదురు కాల్పులు జరిగాయి. ఆ ఎన్ కౌంటర్లో 22 మంది మావోయిస్టులు చనిపోయినట్లు పోలీసులు ప్రకటించారు. చనిపోయిన వారిలో కేంద్రకమిటి సభ్యుడు పుల్లూరి ప్రసాదరావు అలియాస్ చంద్రన్న కూడా ఉన్నారని పోలీసులు తెలిపారు.

కర్రెగుట్టల అడవుల్లో మావోయిస్టులు బలోపేతం అవటంలోను అత్యంత సురక్షితమైన ప్రాంతంగా అడవులను తీర్చిదిద్దటంలోను చంద్రన్న పాత్ర చాలా కీలకం. అలాంటి చంద్రన్న ఎన్ కౌంటర్లో మరణించటంతో భద్రతాదళాలు పెద్ద విజయం సాధించినట్లు ప్రకటించుకున్నాయి. అయితే కొద్దిరోజుల్లోనే భద్రతాదళాల సంతోషం ఆవిరైపోయింది. కారణం ఏమిటంటే చంద్రన్న ఎన్ కౌంటర్లో తృటిలో తప్పించుకున్నాడని తర్వాత భద్రతాదళాలకు తెలిసింది. అప్పటినుండి చంద్రన్న కోసం భద్రతాదళాలు అడవులను జల్లెడపడుతునే ఉన్నాయి. ఈమధ్య పార్టలోనే లొంగుబాట్లు, పోరాటం పేరుతో అనేక చర్చలు జరుగుతున్నాయి.

కర్రెగుట్టల ఎన్ కౌంటర్ తర్వాత జరిగిన మరో ఎన్ కౌంటర్లో పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు తో పాటు చాలామంది చనిపోయారు. అప్పటినుండి మావోయిస్టుల్లో లొంగుబాట్లపై ఒత్తిడితో కూడిన చర్చలు జరుగుతున్నాయి. కొందరు సాయుధ పోరాటం చేయాల్సిందే అని అంటుంటే మల్లోజుల వేణుగోపాలరావు లాంటి వాళ్ళు మరికొందరు లొంగిపోవాలని వాదించారు. ఈచర్చలు జరుగుతున్నపుడే జరిగిన ఎన్ కౌంటర్లో ఇద్దరు కేంద్రకమిటిసభ్యులు రామచంద్రారెడ్డి, రామకృష్ణారెడ్డి చనిపోయారు. దాంతో లొంగిపోయి ప్రాణాలను కాపాడుకోవాలని వాదించే వారిసంఖ్య పెరిగిపోయింది. అందుకనే తర్వాత పరిణామాల్లో మల్లోజుల, ఆశన్నతో పాటు మరో 300 మంది మావోయిస్టులు లొంగిపోయారు.

ఈమధ్య కూడా కొందరు లొంగిపోయినా మంగళవారం లొంగిపోయిన బండప్రకాష్, చంద్రన్న వ్యవహారం కీలకమనే చెప్పాలి. ఆరోజు మే 6వ తేదీన జరిగిన ఎన్ కౌంటర్లో చంద్రన్న చనిపోవాల్సిన వాడే. అయితే దళసభ్యుల రక్షణలో తప్పించుకున్నాడు. తనకు రక్షణగా నిలిచిన సభ్యులు చనిపోయినా అదృష్టంకొద్ది చంద్రన్న మాత్రం తప్పించుకున్నాడు. అంటే భద్రతాదళాల ఎన్ కౌంటర్లో చావు అంచులదాకా చంద్రన్న వెళ్ళొచ్చాడు. అప్పటినుండి ప్రాణాలతో ఉండటం ఎలాగనే విషయమై తీవ్రంగానే మధనపడినట్లున్నాడు. తనకన్నా ముందు, తనకన్నా సీనియర్లు మల్లోజుల, ఆశన్నలతో పాటు చాలామంది లొంగిపోయి ప్రాణాలు కాపాడుకున్నపుడు తాను కూడా అదేదారిలో ఎందుకు నడవకూడదని ఆలోచించినట్లున్నాడు. అందుకనే ఈరోజు బండప్రకాష్ తో పాటు డీజీపీ ముందు చంద్రన్న కూడా లొంగిపోయాడు.

పార్టీలో చీలికొచ్చింది : చంద్రన్న

లొంగిపోయిన పుల్లూరి ప్రసాదరావు మీడియాతో మాట్లాడుతు మావోయిస్టుపార్టీలో చీలికొచ్చిందన్నారు. తీవ్ర అనారోగ్య కారణాలతోనే తాను లొంగిపోయినట్లు చెప్పాడు. ఇప్పటినుండి తాను జనజీవనశ్రవంతిలోనే ఉంటానని, జనాలతోనే కలిసుంటానని తెలిపాడు. మావోయిస్టుపార్టీలో వచ్చిన చీలికలు, విభేదాల వల్లే తాను లొంగిపోవాలని డిసైడ్ అయినట్లు చంద్రన్న చెప్పాడు.

Read More
Next Story