ఫ్రీజర్లో మావోయిస్టు నేత కట్టా డెడ్ బాడీ
x
Maoist Central Committee Member Katta Ramachandra Reddy

ఫ్రీజర్లో మావోయిస్టు నేత కట్టా డెడ్ బాడీ

తమ తండ్రిని ఎక్కడో పట్టుకుని చిత్రహింసలకు గురిచేసి కాల్చిచంపేశారన్న కొడుకు రవిచంద్ర వాదనకు బలం పెరుగుతోంది


చత్తీస్ ఘడ్, నారాయణపూర్ జిల్లాలోని అబూజ్ మడ్ అడవుల్లో జరిగిన మావోయిస్టు నేతల ఎన్ కౌంటర్ పై సుప్రింకోర్టు సీరియస్ గా స్పందించింది. జరిగింది ఎన్ కౌంటర్(Maoist Encounter) కాదని బూటకపు ఎన్ కౌంటర్ అన్న వాదనతో సుప్రింకోర్టు(Supreme Court) పాక్షికంగా ఏకీభవించింది. అందుకనే విషయం ఏమిటో తేలేంతవరకు ఎన్ కౌంటర్లో మరణించిన మావోయిస్టు నేత కట్టా రామచంద్రారెడ్డి డెడ్ బాడీని మార్చురీలోని ఫ్రీజర్లో భద్రపరచాలని ఆదేశించింది. విషయం ఏమిటంటే ఈనెల 22వ తేదీన అబూజ్ మడ్ అడవుల్లో (Operation Kagar) ఆపరేషన్ కగార్లో భాగంగా భద్రతాదళాలు కూంబింగ్ చేశాయి. ఆసమయంలో జరిగిన ఎన్ కౌంటర్లో మావోయిస్టుపార్టీ కీలకనేతలు, కేంద్ర కమిటి సభ్యులు కట్టా రామచంద్రారెడ్డి, కడారి సత్యనారాయణరెడ్డి చనిపోయారు.

ఎన్ కౌంటర్లో కేంద్ర కమిటి సభ్యులు ఇద్దరు చనిపోయినట్లు ఛత్తీస్ ఘడ్ పోలీసులే ప్రకటించి ఫొటోలను కూడా రిలీజ్ చేశారు. ఎన్ కౌంటర్ జరిగిన తర్వాత యధావిధిగా ఇద్దరి డెడ్ బాడీలను నారాయణపూర్ ఆసుపత్రిలో పోలీసులు పోస్టుమార్టమ్ చేయించారు. తర్వాత కడారి డెడ్ బాడీని కుటుంబసభ్యులకు అప్పగిస్తే వాళ్ళు తీసుకెళ్ళి అంత్యక్రియలు కూడా చేసేశారు. కాని కట్టా రామచంద్రారెడ్డి డెడ్ బాడీని తీసుకోవటానికి కొడుకు రవిచంద్ర, కూతురు స్నేహ అంగీకరించలేదు. తమతండ్రిని పోలీసులు బూటకపు ఎన్ కౌంటర్లో చంపేశారని ఆరోపించి హైకోర్టులో పిటీషన్లు దాఖలు చేశారు. జరిగినట్లు చెబుతున్న ఎన్ కౌంటర్ బూటకమా ? నిజమైనదేనా ? అన్న విషయం తేల్చాలని కోర్టును తమ పిటీషన్లో రిక్వెస్టుచేశారు. దసరా సెలవుల కారణంగా హైకోర్టు పిటీషన్ తీసుకోలేదు.

అందుకనే కట్టా కొడుకు, కూతురు సుప్రింకోర్టులో పిటీషన్లు వేశారు. దాంతో కేసును సుప్రింకోర్టు త్రిసభ్య ధర్మాసనంలోని జడ్జీలు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్వల్ భూయాన్, జస్టిస్ కోటేశ్వర సింగ్ విచారించారు. దసరా సెలవుల తర్వాత కేసును ప్రయారిటి పద్దతిలో విచారణ చేయాలని హైకోర్టును సుప్రింకోర్టు త్రిసభ్య దర్మాసనం ఆదేశించింది. దసరా సెలవులు అక్టోబర్ 5వ తేదీతో పూర్తవుతాయి. అంటే అక్టోబర్ 6వ తేదీన కట్టా కేసును ప్రయారిటిలో హైకోర్టు విచారిస్తుంది. అప్పటివరకు కట్టా డెడ్ బాడీని మార్చురీలోని ఫ్రీజర్లో భద్రపరచాలని హైకోర్టును సుప్రింకోర్టు ఆదేశించింది. కట్టా కొడుకు, కూతురు వాదన ఏమిటంటే తమ తండ్రిని ఎక్కడో పట్టుకుని పోలీసులు చిత్రహింసలకు గురిచేసి చంపేశారని. అందుకు వాళ్ళదగ్గర ఉన్న ఆధారాలు ఏమిటో తెలీదు.

ఛత్తీస్ ఘడ్ పోలీసుల తర్వాత వాదనలువినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలను త్రిసభ్య ధర్మాసనం పట్టించుకోలేదు. ఎన్ కౌంటర్ తర్వాత ఇద్దరు మావోయిస్టునేతల డెడ్ బాడీలను ఆసుపత్రిలో పోస్టుమార్టమ్ చేయించినట్లు తుషార్ తెలిపారు. పోస్టుమార్టమ్ మొత్తాన్నీ వీడియో రికార్డింగు కూడా చేయించిన విషయాన్ని తెలిపారు. పోస్టుమార్టమ్ తర్వాత కడారి మృతదేహాన్ని ఆయన కుటుంబసభ్యులు తీసుకుని వెళ్ళి అంత్యక్రియలు కూడా చేసిన విషయాన్ని తుషార్ ధర్మాసనానికి వివరించారు. కడారి మృతదేహాన్ని కుటుంబసభ్యులు తీసుకున్నారని అయితే కట్టా డెడ్ బాడీని ఆయన కుటుంబసభ్యులు తీసుకెళ్ళటానికి నిరాకరిస్తున్నట్లు చెప్పారు. కట్టాపై ఏడు రాష్ట్రాల్లో రు. 7 కోట్ల రివార్డున్న విషయాన్ని తుషార్ ధర్మాసనానికి గుర్తుచేసినా ధర్మాసనం వాదనను పట్టించుకోలేదు.

ఎన్ కౌంటర్ పై అనుమానాలు

22వ తేదీన అబూజ్ మడ్ అడవుల్లో జరిగిన ఎన్ కౌంటర్ పై మొదటినుండి చాలాఅనుమానాలను పౌరహక్కుల సంఘాల నేతలు వ్యక్తంచేస్తున్నారు. అవేమిటంటే కేంద్రకమిటి సభ్యులు అంటే మావోయిస్టుపార్టీలో చాలా కీలకనేతలనే చెప్పాలి. అంతటి కీలకనేతలు సమవేశం అవుతున్నపుడు మిగిలిన మావోయిస్టులతో పాటు కీలక నేతలకు భద్రతగా మరికొంతమంది మావోయిస్టులు ఉంటారు. నిజంగానే ఎన్ కౌంటర్ జరిగితే ఇద్దరు కీలకనేతలు కట్టా, కడారి మాత్రమే ఎలా చనిపోతారు ? సమావేశంలో పాల్గొన్న మిగిలిన మావోయిస్టులు ఏమయ్యారు ? ఇద్దరు కీలకనేతలకు రక్షణగా ఉండే మావోయిస్టులు ఏమయ్యారు ? అనే ప్రశ్నలకు పోలీసులు సమాధానాలు చెప్పటంలేదు. పోలీసులు కూడా ఎన్ కౌంటర్లో కట్టా, కడారి చనిపోయినట్లు ప్రకటించారు కాని మిగిలిన మావోయిస్టుల విషయాన్ని ప్రస్తావించలేదు. మావోయిస్టుల రక్షణ లేకుండా, ఇతర మావోయిస్టులు ఎవరూ లేకుండా కట్టా, కడారి ఇద్దరు మాత్రమే ఎన్ కౌంటర్ జరిగినట్లు చెబుతున్న ప్రాంతంలో ఏమిచేస్తున్నట్లు ? వీళ్ళిద్దరే పోలీసులకు ఎలాగ దొరికారు ? అన్న ప్రశ్నలకు పోలీసులు సమాధానాలు చెప్పటంలేదు. అందుకనే కట్టా కొడుకు చెబుతున్నట్లు తమ తండ్రిని ఎక్కడో పట్టుకుని చిత్రహింసలకు గురిచేసి కాల్చిచంపేశారనే వాదనకు బలం పెరుగుతోంది. మరి హైకోర్టు విచారణలో ఏమి బయటపడుతుందో చూడాలి.

Read More
Next Story