
మావోయిస్టు అగ్రనేత సుజాతక్క లొంగుబాటు
కోటి రివార్డు ఉన్న ఆమెపై 106 కేసులున్నాయి
మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు సుజాతక్క శనివారం పోలీసుల ఎదుట లొంగిపోయారు. సుజాతక్క అసలు పేరు పోతుల కల్పన. ఆమె స్వస్థలం గద్వాల జిల్లా గట్టు మండలం పెంచికల్ పహడ్ గ్రామం . సుజాతక్క మావోయిస్టు అగ్రనేత మల్లోజుల కోటేశ్వర్ రావు అలియాస్ కిషన్ జీ ని 1984లో వివాహం చేసుకున్నారు. 43 ఏళ్లు అండర్ గ్రౌండ్ లో ఉన్నారు. 2011లో పశ్చిమ బెంగాల్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో కిషన్ జీ చనిపోయారు. మావోయిస్టు కేంద్ర కమిటీలో ఆమె ఏకైక మహిళా నాయకురాలు. సుజాతక్క చత్తీస్ గడ్ సౌత్ సబ్ జోనల్ ఇన్ చార్జిగా ఉన్నారు. ఆమెపై కోటి రూపాయల రివార్డు ఉంది. సుజాతక్కపై 106 కేసులు ఉన్నాయి. ఆమెపై చత్తీస్ గడ్ లో 72, మహరాష్ట్రలో 26 కేసులున్నాయి. అనేకమంది పోలీసు ఉన్నతాధికారులను సుజాతక్క చంపినట్టు పోలీసులు చెబుతున్నారు. అనారోగ్య కారణాలతో సుజాతక్క లొంగిపోయినట్టు తెలంగాణ డిజిపి జితేందర్ తెలిపారు. సుజాతక్క లొంగిపోవడంతో మావోయిస్టు పార్టీ ఆత్మరక్షణలో పడిపోయింది. కేంద్రం ఆపరేషన్ కగార్ ప్రకటించిన తర్వాత తెలంగాణలో మావోయిస్టు అగ్రనేతలు ఒక్కొక్కరూ లొంగిపోతున్నారు. పలువురు ఎన్ కౌంటర్ లో మరణిస్తున్నారు. మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కల్సిపోవాలని కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు పదే పదే చెబుతున్నాయి. ములుగు జిల్లాలో కర్రెగుట్టల్లో మావోయిస్టు అగ్రనేతలు తలదాచు కున్నారని సమాచారమందడంతో పోలీసులు జల్లెడ పడుతున్నారు.