ఇద్దరు గిరిజనులను చంపిన మావోయిస్టులు
ఊరిలోని జనాల మధ్యలో ఇన్ ఫార్మర్ ముద్రపడిన వాళ్ళని విచారించామని చెప్పి ప్రజాకోర్టు శిక్షించిందని చెప్పి అందరిముందు చంపేస్తారు.
మావోయిస్టులు ఎవరినైనా చంపేయాలంటే ముందు వాళ్ళపై ఇన్ఫార్మర్లు అనే ముద్ర వేస్తారు. తర్వాత ఊరిలోని జనాల మధ్యలో ముద్రపడిన వాళ్ళని విచారించామని చెప్పి ప్రజాకోర్టు శిక్షించిందని చెప్పి అందరిముందు చంపేస్తారు. ఇపుడిదంతా ఎందుకంటే రెండురోజుల క్రితం ఉమ్మడి ఖమ్మంజిల్లా(Khammam District)లోని వాజేడు మండలంలో ఇద్దరు గిరిజనులను మావోయిస్టులు(Maoists) ఇన్ఫార్మర్లనే ముద్రవేసి చంపేశారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాకపోతే పైన చెప్పినట్లు అందరిముందు విచారించి శిక్షల పేరుతో చంపలేదు. ఎలాంటి విచారణ జరపకుండానే, వివరణ ఇచ్చుకునే అవకాశం కూడా ఇవ్వకుండానే ఇద్దరు గిరిజనులు అర్జున్, రమేష్ ని గొడ్డళ్ళతో నరికి చంపేశారు.
ఇంతకీ అసలు ఏమిజరిగిందంటే అడవుల్లోని తమ ఆచూకీని అర్జున్ పోలీసులకు చెబుతున్నట్లు మావోయిస్టులు అనుమానించారు. అనుమానంతో ఎలాంటి విచారణ చేసుకున్నారో తెలీదు కాని అర్జున పోలీసులు ఇన్ఫార్మర్ అని నిర్ధారణకు వచ్చేశారు. అర్ధరాత్రి తరువాత కొందరు బాలలక్ష్మీపురం గ్రామంలో ఉంటున్న అర్జున ఇంటికి చేరుకున్నారు. తలపుతట్టి ఉయిక అర్జున్ ను బయటకు తీసుకొచ్చారు. కొద్దిసేపు ఏదో మాట్లాడిన మావోయిస్టులు సడెన్ గా గొడ్డలితో అర్జున్ మీద దాడిచేశారు. తల, మెడ మీద గొడ్డలితో బలంగా నరకటంతో అక్కడికక్కడే అర్జున్ చనిపోయాడు. అదేసమయంలో మావోయిస్టుల్లోని మరికొందరు అదే ఊరిలోని ఉయిక రమేష్ ఇంటికి వెళ్ళారు. ఇంటిముందు మంచంపై పడుకుని నిద్రపోతున్న రమేష్ కనిపించాడు. వెంటనే గొడ్డలితో దాడిచేసి నిద్రపోతున్న వాడిని నిద్రలోనే నరికేశారు.
అయితే శబ్దం వినిపించటంతో ఇంటిబయటకు వచ్చి జరిగిందాన్ని ఇంట్లోవాళ్ళు గమనించారు. జరిగింది అర్ధంచేసుకున్నారు. మంచంమీదే కొనఊపిరితో ఉన్న రమేష్ ను గమనించిన కుటుంబసభ్యులు చుట్టుపక్కల వాళ్ళని పిలుచుకొచ్చి ఏటూరినాగారం(Yeturi Nagaram)లోని ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్ళారు. అయితే ఆసుపత్రిలో చికిత్సపొందుతునే రమేష్ చనిపోయాడు. రమేష్ పేరూరు పంచాయితీ సెక్రటరీగా పనిచేస్తున్నాడు. చనిపోయిన వాళ్ళిద్దరు వరసకు అన్నదమ్ములు అవుతారు. దాంతో వాళ్ళ కుటుంబాలు శోకముద్రలో ముణిగిపోగా గ్రామంలోని మిగిలిన వాళ్ళు ఎప్పుడేమి జరుగుతుందో అర్ధంకాక ఆందోళనపడుతున్నారు. తమ సమాచారాన్ని పోలీసులకు అందచేస్తున్న అర్జున్ తో పాటు రమేష్ కూడా జత కలవటంతోనే ఇద్దరినీ శిక్షించినట్లు వాజేడు, వెంకటాపురం ఏరియా కమిటి సెక్రెటరీ శాంత పేరుతో ఘటనాస్ధలంలో దొరికిన రెండు లేఖలను పోలీసులు స్వాదీనం చేసుకున్నారు.
ఇన్ఫార్మర్(Informers) నెపంతో రమేష్, అర్జున్ ను మవోయిస్టులు చంపటాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తు గిరిజనులు, గిరిజన సంఘాలు, ఆదివాసీ సంఘాలు పెద్దఎత్తున ఆందోళన నిర్వహించాయి. సంబంధంలేకపోయినా ఇన్పార్మర్ల పేరుతో గిరిజనులను మావోయిస్టులు చంపుతున్నట్లు గిరిజన సంఘాలు మండిపోతున్నాయి. చనిపోయిన ఇద్దరి కుటుంబాలను ప్రభుత్వమే ఆదుకోవాని గిరిజన సంఘాలు, ఆదివాసీ సంఘాలు ప్రభుత్వాన్ని డిమండ్ చేస్తున్నాయి. ప్రభుత్వంతో మాట్లాడి మృతుల కుటుంబాలకు అన్నీరకాల సాయాన్ని అందించే బాధ్యత తమదే అని పోలీసులు చెప్పటంతో ఆందోళనను విరమించుకున్నారు. ఇన్ఫార్మర్ల నెపంతో గిరిజనులను మావోయిస్టులు చంపటం ఇదేమీ కొత్తకాదు. గతంలో కూడా చాలాసార్లు ఎంతోమంది గిరిజనులను మావోయిస్టులు చంపేశారు.