బీసీ బంద్ కు మావోయిస్టుల మద్దతు
x
Maoists supporting BC bandh

బీసీ బంద్ కు మావోయిస్టుల మద్దతు

తుపాకి రాజ్యం ద్వారానే సమాజాన్ని మార్చగలమని మావోయిస్టుపార్టీ నేతలు దశాబ్దాలుగా చెబుతున్న విషయం అందరికీ తెలిసిందే


శనివారం జరగబోయే బీసీ బంద్ కు మావోయిస్టు పార్టీకూడా మద్దతు పలికింది. స్ధానికసంస్ధల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్ అమలుచేయాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి(Revanth) ప్రభుత్వం నిర్ణయించింది. అందుకనే జీవో ఎంఎస్ 9ని జారీచేసింది. రిజర్వేషన్లకు(BC Reservations) వ్యతిరేకంగా బుట్టెంగారి మాధవరెడ్డి అనే యువకుడు కోర్టులో సవాలు చేశాడు. ఈ కేసును విచారించిన హైకోర్టు(Telangana High Court) ఈనెల 9వ తేదీన జీవో అమలుపై స్టే ఇచ్చింది. దాంతో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఆగిపోయాయి. అప్పటినుండి బీసీ సంఘాలన్నీ బాగా మండిపోతున్నాయి.

కొన్నిసంఘాలు రేవంత్ ప్రభుత్వం డ్రామాలు ఆడుతోందని ఆరోపిస్తుండగా మరికొన్ని సంఘాలు హైకోర్టు ఇచ్చిన స్టేపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తచేస్తున్నాయి. స్టేకి నిరసనగా 18వ తేదీన తెలంగాణ బంద్ కు అన్నీసంఘాలు పిలుపిచ్చాయి. ఈ పిలుపుకు రాజకీయపార్టీలన్నీ మద్దతుపలికాయి. ఈ నేపధ్యంలోనే మావోయిస్టుపార్టీ కూడా బీసీ బంద్ కు మద్దతు ప్రకటించటం ఆశ్చర్యంగా ఉంది. ఇక్కడ ఆశ్చర్యం ఎందుకంటే మావోయిస్టు పార్టీకి ఎన్నికల మీద నమ్మకంలేదు. తుపాకి రాజ్యం ద్వారానే సమాజాన్ని మార్చగలమని మావోయిస్టుపార్టీ నేతలు దశాబ్దాలుగా చెబుతున్న విషయం అందరికీ తెలిసిందే. అందుకనే ఎన్నికలు ఎప్పుడుజరిగినా బహిష్కరణకు పిలుపిస్తారు. అలాంటిది ఇపుడు మాత్రం బీసీ బంద్ జయప్రదం కావాని మావోయిస్టులు కోరుకున్నారు.

మావోయిస్టుపార్టీ అధికార ప్రతినిధి జగన్ పేరుతో ఒక లేఖ విడుదలైంది. ఆ లేఖలో స్ధానికసంస్ధల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్ల సాధనలో భాగంగా ఈనెల 18న జరగబోయే తెలంగాణ బంద్ ను జయప్రదం చేయాలని జగన్ పిలుపిచ్చారు. ఈ బందులో అన్నీ రాజకీయపార్టీలు, ప్రజాసంఘాలు, బీసీ సంఘాలు పాల్గొని బంద్ ను విజయవంతం చేయాలన్నారు. కరుడుగట్టిన మనువాద కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రజాప్రతినిధులు పార్టీరహితంగా బంద్ లో పాల్గొనాలని చెప్పారు.

ఆలేఖలో బీజేపీ,ఆర్ఎస్ఎస్ మీద మావోయిస్టుల్లో పేరుకుపోయిన కసి కనబడింది. ఎలాగంటే 11 ఏళ్ళుగా ఆర్ఎస్ఎస్-బీజేపీ దేశంలో ఫాసిస్టు నియంతృత్వాన్ని అమలుచేస్తున్నట్లు ఆరోపించారు. రాజ్యాంగాన్ని పక్కనపెట్టి మనుస్మృతిని, వర్ణ వ్యవస్ధ భావజాలాన్ని ప్రచారం చేస్తు కేంద్రప్రభుత్వం కులవ్యవస్ధను బలోపేతం చేసే విధంగా పాలన చేస్తున్నట్లు మండిపోయారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే బీజేపీ కులవ్యవస్ధను బలోపేతం చేస్తోందని ఒకవైపు ఆరోపిస్తూనే మరోవైపు బీసీ బంద్ కు మద్దతు పలకటం. తెలంగాణ ప్రభుత్వం, ప్రజా ప్రతినిధులు కలిసి కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా న్యాయపరంగా చట్టాన్ని తెచ్చేందుకు పోరాటంచేయాలన్నారు. కాబట్టే మేథావులు, ప్రజాసంఘాలు, విద్యార్ధిసంఘాలు, ప్రజాస్వామికవాదులు బంద్ ను విజయవంతం చేయాలని జగన్ పిలుపిచ్చారు.

Read More
Next Story