హైడ్రా టెన్షన్... హైకోర్టుకి మర్రి
రాష్ట్రంలో హైడ్రా ప్రకంపనలు కొనసాగుతున్నాయి. అక్రమ నిర్మాణాలు చేసిన బడా బాబుల్లో ఎప్పుడు ఎవరి కొంప కూలబోతోందో తెలియని ఆందోళనను నెలకొన్నాయి.
రాష్ట్రంలో హైడ్రా ప్రకంపనలు కొనసాగుతున్నాయి. అక్రమ నిర్మాణాలు చేసిన బడా బాబుల్లో ఎప్పుడు ఎవరి కొంప కూలబోతోందో తెలియని ఆందోళనను నెలకొన్నాయి. ఈ క్రమంలో FTL (ఫుల్ ట్యాంక్ లెవెల్) పరిధిలో ఉందని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలకు అధికారులు నోటీసులు ఇచ్చారు. దుండిగల్ లోని ఎంఎల్ఆర్ఐటీ, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజినీరింగ్ కళాశాలలకు రెవెన్యూ అధికారులు నోటీసులు అందజేశారు. చిన్న దామెర చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిలో ఈ నిర్మాణాలు చేపట్టారని అందులో పేర్కొన్నారు.
దీంతో హుటాహుటిన హై కోర్టును ఆశ్రయించారు ఎంఎల్ఆర్ఐటీ సంస్థల చైర్మన్ మర్రి లక్ష్మణ్ రెడ్డి. కూల్చివేతలను ఆపాలంటూ పిటిషన్ లో పేర్కొన్నారు. ఆక్రమణలను ఏడు రోజుల్లోనే తొలగించాలని నోటీసులు ఇచ్చారని, హైడ్రా ఎటువంటి చట్టబద్దత లేని సంస్థ అని, కార్యనిర్వాహక ఉత్తర్వు ద్వారా సృష్టించబడిన సంస్థ మాత్రమేనని పిటిషన్ లో పేర్కొన్నారు. ఉదయం 6 గంటలకు నిర్మాణాలు కూల్చడం ఏంటని ప్రశ్నించారు. హైడ్రా చర్యలు సుప్రీం కోర్టు నిర్దేశించిన చట్టానికి విరుద్ధం అని పిటిషనర్ తరపు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. దీనిపై ఎలాంటి తీర్పు వెల్లడవుతుందో అనే ఉత్కంఠ యాజమాన్యంలో నెలకొంది.
విద్యాసంస్థలకి ఓ వెసులుబాటు...
ఇక విద్యాసంస్థల విషయంలో ప్రభుత్వం ఒకడుగు వెనక్కి వేసినట్టు స్పష్టం అవుతోంది. ఫిర్యాదులు రావడంతోనే ఇమీడియట్ గా యాక్షన్ తీసుకుంటున్న హైడ్రా... విద్యాసంస్థల విషయంలో కొంత సమయం ఇస్తోంది. ఈరోజు ఇదే అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో జరిపిన చిట్ చాట్ లో ప్రస్తావించారు. ఒవైసీ కాలేజీల ప్రస్తావన వచ్చినప్పుడు సీఎం మాట్లాడుతూ... కాలేజీ విషయంలో విద్యాసంవత్సరం నష్టపోతుందని సమయం ఇచ్చామన్నారు. విద్యార్థుల భవిష్యత్ ముఖ్యం కాబట్టి ఆలోచిస్తున్నామని సీఎం తెలిపారు.
ఇక మంగళవారం హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా ఇదే విషయాన్ని వ్యక్తపరిచారు. "అక్రమ కట్టడాలు తొలగించేందుకు సమయం ఇస్తున్నాం. విద్యా సంస్థలు కాబట్టి అకడమిక్ ఇయర్ మధ్యలో చర్యలు తీసుకుంటే విద్యార్థులకు నష్టం. విద్యార్థులు రోడ్డున పడకూడదని మాత్రమే ఆలోచిస్తున్నాం. వాళ్లకు వాళ్లుగా తొలగించకపోతే హైడ్రానే చర్యలు తీసుకుంటుంది. ఒవైసీ అయినా, మల్లారెడ్డి అయినా అందరికీ ఒకటే రూల్" అని రంగనాథ్ వెల్లడించారు.