
ముదురుతున్న ‘మార్వాడీ’ వివాదం..
రాజకీయ రంగు పులుముకుంటూ మరింత రగులుకుంటున్న ఆందోళనలు.
‘మార్వాడీస్ గో బ్యాక్’ తెలంగాణ అంతటా కొన్ని రోజులుగా తెగ వినిపిస్తున్న నినాదాలివి. ఒక్కసారిగా మార్వాడీలపై తీవ్ర వ్యతిరేకత వస్తుంది. వారందరినీ కూడా తమ తమ రాష్ట్రాలకు వెళ్లిపోవాలని, వారిని పంపించేయాలన్న డిమాండ్లు అధికం అవుతున్నాయి. దీనికి రాజకీయ రంగు కూడా పులుముకోవడం, పార్టీలన్నీ ఒక సైడ్ తీసుకుని స్టేట్‌మెంట్లు ఇస్తుండటంతో ఈ వివాదం మరింత ముదరడం మొదలైంది. ఈ క్రమంలో మార్వాడీలకు మద్దతుగా నిలుస్తున్న వర్గం, వ్యతిరేకంగా ఉన్న వర్గం మధ్య ఆరోపణలు తారాస్థాయికి చేరుతున్నాయి. దీనిని మార్వాడీలకు, వారు చేస్తున్న దోపిడీకి వ్యతిరేకంగా చేస్తున్న ఉద్యమంగా పేర్కొంటున్నారు. ఇందులో బాగంగానే సోమవారం మార్వాడీలకు వ్యతిరేకంగా ఆమనగల్లు మొత్తం బంద్ ప్రకటించారు. అన్ని దుకాణాలను మూసివేశారు. స్థానిక వ్యాపారస్తులు కూడా మార్వాడీల వస్తుల కొనుగోళ్లను ఆపేయాలని, అలా చేయడం వారికి పరోక్షంగా సహకరించడమే అవుతుందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వివాదానికి బీజం ఎక్కడ పడిందంటే..
ఆగస్టు 18న సికింద్రాబాద్ మోండా మార్కెట్‌లో జరిగిన చిన్న ఘటనతో ఈ వివాదానికి బీజం పడింది. మార్కెట్లో పార్కింగ్ విషయంలో మార్వాడీలకు ఒక దళిత యువకుడికి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలోనే తీవ్ర ఆగ్రహానికి గురైన మార్వాడీలు.. ఆ దళిత యువకుడిపై దాడి చేశారన్న ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించే పోలీసుల వద్ద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదయింది. కేసు నమోదు కావడంతో ఈ అంశం తీవ్ర దుమారం రేపింది. ఇదే సమయంలో మార్వాడీల దోపిడీని విమర్శిస్తూ గాయకుడు, రచయిత గోరేటి రమేశ్ ఓ పాట పాడారు. అది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసింది. ఆ పేటతో ప్రేరణ పొందిన స్థానికులు ‘మార్వాడీ గో బ్యాక్’ అంటూ ఉద్యమం ప్రారంభించారు.
వివాదానికి రాజకీయ రంగు
ఈ వివాదంపై పలు పార్టీల నేతలు తమ అభిప్రాయాలు, వైఖరిని ప్రకటించడంతో ఇది కాస్తా రాజకీయ రంగు పులుముకుంది. ఈ అంశంలో బీజేపీ నేత బండి సంజయ్.. మార్వాడీలకు పూర్తి మద్దతు ప్రకటించారు. రాజాసింగ్ కూడా ఈ అంశంలో మార్వాడీలకే మద్దతుగా నిలిచారు. ఈ వివాదంపై స్పందించిన బండి, రాజా సింగ్.. ఈ వివాదం హిందూ సమాజాన్ని చీల్చడానికి చేస్తున్న కుట్రగా అభివర్ణించారు. ‘‘మార్వాడీలు తెలంగాణను దోచుకోలేదు. వారు వ్యాపారాలు చేసి సంపద సృష్టించారు. నిజమైన ముప్పు రోహింగ్యాలు, అక్రమ వలసదారులు వల్లే వస్తుంది’’ అని అన్నారు. అంతేకాకుండా ఈ ఉద్యమం వెనక కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం ఉన్నాయని వాళ్లు ఆరోపించారు. కాగా ఎస్సీ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ పిడమర్తి రవి మాత్రం మార్వాడీలకు వ్యతిరేకంగా నిలిచారు. ‘‘మార్వాడీలు జీఎస్టీ కట్టట్లేదు. ఇక్కడ సంపాదించి గుజరాత్, రాజస్థాన్‌కు తరలిస్తున్నారు’’ అని ఆయన వివరించారు.
రాజకీయ సమీకరణాలు మారతాయా..!
రోజురోజుకు ముదురుతున్న ‘మార్వాడీ గో బ్యాక్’ ఉద్యమం తెలంగాణ రాజకీయ సమీకరణాలు మార్చే అవకాశం కూడా ఉందన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. మార్వాడీలను వ్యతిరేకిస్తున్న స్థానికులు, ప్రజల్లో.. మార్వాడీలకు మద్దతు పలుకుతున్న పార్టీల కార్యకర్తలు కూడా ఉంటారని, ఈ విషయంలో పార్టీకి, కార్యకర్తలకు మధ్య సిద్ధాంతపరమైన విభేదాలు రేకెత్తి.. సదరు పార్టీలకు మైనస్ కావొచ్చని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.