
Marwari Go Back | ‘మార్వాడి గో బ్యాక్’ బంద్ సక్సెస్
రంగారెడ్డి జిల్లాలోని అమనగల్లు(Amanagal)లో బీజంపడిన మార్వారీ గో బ్యాక్ నినాదం ఇపుడు యావత్ తెలంగాణ అంతా పాకింది
తెలంగాణలోని పలుప్రాంతాల్లో మార్వాడి గో బ్యాక్(Marwari Go Back) డిమాండుతో శుక్రవారం నిర్వహించిన బంద్ పూర్తి సక్సెస్ అయ్యింది. బంద్ సక్సెస్ అవటంతోనే స్ధానిక వ్యాపారులు(Marwari) మార్వారీ(మార్వాడీ)లపై ఏ స్ధాయిలో మండిపోతున్నారో అర్ధమవుతోంది. రంగారెడ్డి జిల్లాలోని అమనగల్లు(Amanagal)లో బీజంపడిన మార్వారీ గో బ్యాక్ నినాదం ఇపుడు యావత్ తెలంగాణ అంతా పాకింది. గుజరాత్(Gujarat), రాజస్ధాన్(Rajasthan) నుండి వచ్చి తెలంగాణలో వ్యాపారాలు చేసుకుంటున్న మార్వారీలు స్ధానికంగా తమ వ్యాపారాలను దెబ్బతీస్తు పొట్టకొడుతున్నారంటు స్ధానిక వ్యాపారాలు మండిపోతున్నారు. కొద్దిరోజుల క్రితం సికింద్రాబా(Secunderabad)దు మోండామార్కెట్లో ఒక ఎస్సీ యువకుడికి కొందరు మార్వాడి యువకులకు మధ్య జరిగిన చిన్న వివాదం చిలికి చిలికి గాలివానలాగ తయారై చివరకు మార్వాడీ గో బ్యాక్ అని డిమాండ్ చేసేంత దాకా చేరుకుంది.
మూడురోజుల క్రితమే అమనగల్లులో మార్వాడీ గోబ్యాక్ డిమాండుతో బంద్ కు స్ధానిక వ్యాపారులు పిలుపిచ్చారు. అయితే కొందరు జోక్యంచేసుకున్న కారణంగా అప్పటి బంద్ వాయిదాపడింది. అప్పుడు వాయిదాపడిన బందే శుక్రవారం తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో సక్సెస్ అయ్యింది. అప్పుడు బంద్ జరిగుంటే కేవలం అమనగల్లుకు మాత్రమే పరిమితమయ్యుండేది. అప్పుడు వాయిదాపడిన తర్వాత జరిగిన పరిణామాలతో తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో వ్యాపారులు స్వచ్చందంగా బంద్ లో పాల్గొనేదాకా వ్యవహారం చేరుకుంది.
వ్యాపారుల మధ్య ఉండాల్సిన వివాదం చివరకు రాజకీయరగడగా మారిపోయింది. మార్వారీలకు కాంగ్రెస్, బీజేపీలు సంపూర్ణమద్దతుగా నిలవగా బీఆర్ఎస్ ఎలాంటి స్టాండ్ తీసుకోలేదు. వివాదాన్ని రాజకీయంగా ఉపయోగించుకుంటున్నాయని కాంగ్రెస్, బీజేపీలను ఆరోపిస్తున్న బీఆర్ఎస్ నేతలు తమ స్టాండ్ ఏమిటో చెప్పమంటే మాత్రం నోరిప్పటంలేదు. అమనగల్లు బంద్ పిలుపు నేపధ్యంలో మార్వాడీ, అగర్వాల్ సమాజంలోని వ్యాపార సంఘం అధ్యక్షుడు అనిరుధ్ గుప్తా, ఉపాధ్యక్ష్డు రూపేష్ కుమార్ అగర్వాల్ తదితరులు డీజీపీని కలిశారు. మార్వాడీ గోబ్యాక్ పేరుతో తమ వ్యాపారాలతో పాటు వ్యక్తిగతంగా తమపైన, తమకుటుంబాలపైన దాడులు జరిగే అవకాశాలున్నాయన్న ఆందోళన వ్యక్తంచేశారు. తమకు పోలీసులు పూర్తి రక్షణ కల్పించాలని కోరారు. దాంతో స్ధానిక వ్యాపారులందరికీ వీరిపై మంట బాగా పెరిగిపోయింది. దీని ఫలితమే రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో స్వచ్చంధ బంద్ పాటింపు.
నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడలో వ్యాపారులు బంద్ పాటించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని మోత్కూరు, త్మకూర్, చౌటుప్పల్, కరీంనగర్ తో పాటు జిల్లాలోని జమ్మికుంట, సిద్ధిపేట, దుబ్బాక, రంగారెడ్డి జిల్లాలోని అమన్ గల్లు, నిజామాబాద్ లో కూడా చాలా చోట్ల మార్వాడీలకు వ్యతిరేకంగా స్ధానిక వ్యాపారులు బంద్ పాటించారు. ఇపుడు జరిగిన బంద్ ను చూస్తుంటే ఈ వివాదం ఇక్కడితో ఆగేట్లు లేదు. ముందు ముందు ఇంకెన్ని మలుపులు తీసుకుంటుందో చూడాల్సిందే.