
ట్రాఫిక్ లో చిక్కుక్కున్న 400 ఏళ్ల నగరం
నేతల పర్యటనలతో నలిగిపోయిన సగటు జీవి
నాలుగువందల ఏళ్ల హైద్రాబాద్ కు కష్ట మొచ్చింది. శనివారం హైద్రాబాద్ ట్రాఫిక్ కబంధ హస్తాల్లో చిక్కుక్కుంది. దీనికి ప్రధాన కారణం కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లి ఖార్జున ఖర్గే హైద్రాబాద్ లో పర్యటించడమే. ఆయన నిన్న సాయంత్రమే శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ల్యాండ్ అయ్యారు. రాత్రంతా తాజ్ క్రిష్ణాలో మకాం వేసి ఆయన ఈరోజు ఉదయం నుంచి హైద్రాబాద్ లో బిజీ బిజీగా గడిపారు. పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అసలే అధికారపార్టీ. ఆలిండియా ప్రెసిడెంట్ హోదాలో పర్యటిస్తున్న నేత కావడంతో కార్యకర్తల హడావిడి అంతా ఇంతా కాదు. ఇల్లు పీకి పందిరి వేసినంత పని చేశారు. లా అండ్ ఆర్డర్ పోలీసులతో బాటు ట్రాఫిక్ పోలీసులు వాహనరాకపోకలను కట్టడి చేశారు. ముఖ్యమంత్రి కాన్వాయ్ వెళ్లినప్పుడు లేని హడావిడి ఆలిండియా ప్రెసిడెంట్ కాన్వాయ్ లో కనిపించింది. ఆయన రోడ్డుపై వెళ్తున్నప్పుడు ట్రాఫిక్ స్థంభించింది.
మరో వైపు కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ హైద్రాబాద్ లో పర్యటిస్తున్న సందర్బంగా ట్రాఫిక్ స్థంభించింది. సెంట్రల్ లో రూలింగ్ పార్టీ కావడంతో పోలీసులు ఎక్కడి వాహనాలను అక్కడే ఆపేశారు. దీనికి తోడు బిఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరుద్యోగులు ఛలో సెక్రటేరియట్ కార్యక్రమాన్ని చేపట్టడంతో ట్రాఫిక్ స్థంభించింది. మాజీ ముఖ్యమంత్రి కెసీఆర్ ఆస్పత్రిలో చేరడంతో అభిమానుల తాకిడి ఎక్కువై హైద్రాబాద్ లో ట్రాఫిక్ జాం అయ్యింది.
దీనికి తోడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం నగరంలో రెగ్యులర్ బస్సులను రద్దు చేసింది. విద్యార్థులు, ఉద్యోగులు వెళ్లే సమయం కావడంతో బస్సులు లేక సగటుజీవి నలిగిపోయాడు.