
ఫిరాయింపు ఎంఎల్ఏలపై కేటీఆర్ మాస్టర్ ప్లాన్
కేటీఆర్(KTR) వేసిన మాస్టర్ ప్లాన్ ఏమిటంటే ఫిరాయింపు ఎంఎల్ఏల నియోజకవర్గాల్లో బహిరంగసభలు నిర్వహించటం
పదిమంది ఫిరాయింపు ఎంఎల్ఏలను ఫిక్స్ చేయటానికి బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒక మాస్టర్ ప్లాన్ వేశారు. ఈప్లాన్ గనుక కరెక్టుగా వర్కవుట్ అయితే పదిమంది ఫిరాయింపు ఎంఎల్ఏలు గట్టిగా ఇరుక్కున్నట్లే అవుతుంది. ఇంతకీ కేటీఆర్(KTR) వేసిన మాస్టర్ ప్లాన్ ఏమిటంటే ఫిరాయింపు ఎంఎల్ఏల నియోజకవర్గాల్లో బహిరంగసభలు నిర్వహించటం. బహిరంగసభలను నిర్వహిస్తే ఫిరాయింపులు(BRS defection MLAs) ఎలాగ ఫిక్స్ అవుతారు ? అనే సందేహంరావచ్చు. ఇపుడు ఫిరాయింపుల మెడపై అనర్హత కత్తివేలాడుతోంది. అనర్హత వేటునుండి తప్పించుకోవాలన్నది వీళ్ళ ప్రయత్నం.
ఇందులో భగంగానే తాము బీఆర్ఎస్ లోనే ఉన్నామని పదేపదే ప్రకటిస్తున్నారు. బీఆర్ఎస్ తరపున గెలిచిన పదిమంది ఎంఎల్ఏలు తాము పార్టీలోనే కంటిన్యు అవుతున్నట్లు చెబుతున్నారు. తాము కాంగ్రెస్ లోకి ఫిరాయించామని జరుగుతున్న ప్రచారం అంతా అబద్ధాలే అని అంటున్నారు. తాము బీఆర్ఎస్ లోనే ఉన్నామని స్పీకర్ కు 8మంది ఎంఎల్ఏలు లేఖలు ఇచ్చారు. తాము కారుపార్టీలోనే కంటిన్యు అవుతున్నాము అనేందుకు సాక్ష్యాలను కూడా చూపించినట్లు సమాచారం. సరే, వీళ్ళు చూపించిన సాక్ష్యాలు చెల్లుతాయా ? వీటిపై బీఆర్ఎస్ ఎలా స్పందిస్తుందన్నది వేరేవిషయం. ఈనేపధ్యంలోనే కేటీఆర్ ఒక ప్లాన్ వేశారు. అదేమిటంటే ఫిరాయింపు నియోజకవర్గాల్లో బహిరంగసభలు నిర్వహించటం.
మొదటి సభగా శనివారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో గద్వాలలో బహిరంగసభ జరుగుతోంది. ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంఎల్ఏల్లో గద్వాల ఎంఎల్ఏ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కూడా ఉన్నారు. అందుకనే గద్వాలలో ఈరోజు బహిరంగసభ నిర్వహిస్తోంది. వర్షంగనుక అడ్డుపడకుండా ఉంటే సభజరుగుతుంది. కేటీఆర్ ప్లాన్ ప్రకారం బహిరంగసభకు బండ్లే అధ్యక్షత వహించాలి. లోకల్ ఎంఎల్ఏనే కదా సభలకు అధ్యక్షత వహించాల్సింది. కాబట్టే బహిరంగసభకు బండ్ల అధ్యక్షత వహిస్తారా లేదా అన్నది తేలిపోతుంది. తాను పార్టీ మారలేదని, బీఆర్ఎస్ లోనే ఉన్నట్లు బండ్ల కూడా మీడియాకు చెబుతున్నారు. బండ్ల చెబుతున్నదే నిజమైతే ఈరోజు సభలో పాల్గొనాలి, అధ్యక్షత వహించాలి. మరి బండ్ల బహిరంగసభకు హాజరవుతారా ? అధ్యక్షత వహిస్తారా ?
సభకు హాజరైతే ఏమవుతుంది ?
బీఆర్ఎస్ వర్గాల ప్రకారం బండ్ల బహిరంగసభకు హాజరయ్యే అవకాశాలు చాలా తక్కువ. ఎందుకంటే ఇంతకాలం పార్టీకి దూరంగా ఉంటు అనర్హతను తప్పించుకునేందుకు మాత్రమే తాను బీఆర్ఎస్ లోనే ఉన్నట్లు చెబుతున్న బండ్ల ఎట్టి పరిస్ధితుల్లోను సభకు రారు. ఒకవేళ బండ్ల సభకు హాజరైతే నేతలు, క్యాడర్ ఊరికే ఉండరు. బండ్లపైన భౌతిక దాడులు జరిగినా ఆశ్చర్యపోవక్కర్లేదనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఈవిషయాలను బండ్ల కూడా గ్రహించగలరు. కాబట్టే సభకు ఏదో కారణంతో గైర్హాజరవుతారు లేదా గట్టి పోలీసుబందోబస్తు తీసుకుని సభకు హాజరవుతారని అనుకుంటున్నారు. అప్పుడు ఏమి జరిగినా పోలీసులు రక్షణగా ఉంటారు.
ఇదేపద్దతిలో మిగిలిన తొమ్మిది నియోజకవర్గాలు ఖైరతాబాద్, జగిత్యాల, బాన్సువాడ, చేవెళ్ళ, భద్రాచలం, రాజేంద్రనగర్, పటాన్ చెరు, స్టేషన్ ఘన్ పూర్, శేరిలింగంపల్లిలో కూడా బహిరంగసభలు నిర్వహించి పిరాయించిన ఎంఎల్ఏలు దానం నాగేందర్, సంజయ్ కుమార్, పోచారం శ్రీనివాసరెడ్డి, కాలే యాదయ్య, తెల్లం వెంకటరావు, ప్రకాష్ గౌడ్, కడియం శ్రీహరి, గూడెం మహిపాల్ రెడ్డి, అరెకపూడి గాంధీలను గట్టిగా ఫిక్స్ చేయలన్నది కేటీఆర్ ప్లాన్. చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.