ముగియనున్న పులుల మేటింగ్ సీజన్,మరిన్ని పులి కూనలు జన్మించే అవకాశం
అమ్రాబాద్ పులుల అభయారణ్యంలో పులుల శృంగారానికి ఆటంకం కలగకుండా మూడు నెలలపాటు అడవిలో ఎవరూ వెళ్లకుండా వాటికి ఏకాంత సమయాన్ని కల్పించారు.దీంతో పులుల సంఖ్య పెరగనుంది.
అమ్రాబాద్ పులుల అభయారణ్యంలో పులుల సంఖ్య పెరిగిందని తాజా సర్వేలో వెల్లడైంది. మూడు నెలల పాటు అమ్రాబాద్ అడవిలో సందర్శనలను నిలిపివేసి పులుల మేటింగ్ కోసం అనువైన వాతావరణాన్ని కల్పించడంతో పులుల సంఖ్య పెరిగిందని అటవీశాఖ అధికారులు చెప్పారు. స్టేటస్ ఆఫ్ టైగర్స్ అండ్ ఫ్రే ఇన్ అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ -2023-24 నివేదికను అటవీశాఖ విడుదల చేసింది. ఆడపులుల సంఖ్య ఎక్కువగా ఉండటంతోపాటు పులుల మేటింగ్ సీజన్ ఫలప్రదం కావడంతో మరిన్ని పులికూనలు జన్మించే అవకాశం ఉందని అటవీశాఖ అధికారులు అంచనా వేశారు.
పులుల జీవనానికి అనుకూలమైన వాతావరణం
అమ్రాబాద్ అడవుల్లో గతంలో 22 ఉన్న పెద్దపులుల సంఖ్య తాజాగా 34కు పెరిగాయి. అడవిలో 11 మగ పులులు, 15 ఆడపులులు, 8 పులి కూనలున్నాయని గుర్తించినట్లు అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ డీఎఫ్ఓ గోపిడి రోహిత్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. అమ్రాబాద్ అడవిలో 4వ ఫేజ్ మానటరింగ్ సర్వే రిపోర్టును రోహిత్ విడుదల చేశారు.ఈ మేటింగ్ సీజన్ వల్ల మరిన్ని పులికూనలు జన్మించే అవకాశముందని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు.పులులు వేటాడేందుకు వీలుగా చుక్కల జింకలతో బ్రీడింగ్ ఎన్ క్లోజరు ఏర్పాటు చేసి, వాటిని అడవిలోకి వదిలేస్తామని డీఎఫ్ఓ చెప్పారు.పులుల జీవనానికి అనుకూలమైన వాతావరణం కల్పించడం వల్ల అడవిలో వీటి సంఖ్య పెరిగిందని చెప్పారు.
అభయారణ్యంలో పులుల సర్వే
అమ్రాబాద్ పులుల అభయారణ్యాన్ని నాగర్ కర్నూల్, నల్గొండ బ్లాకులుగా విభజించి గత ఏడాది డిసెంబరు 12వతేదీ నుంచి ఈ ఏడాది మే 2వతేదీ వరకు జరిపిన సర్వేలో 34 పెద్ద పులులతో పాటు 183 చిరుతలు, 14వేల స్పాటెడ్ జింకలు, 5,309 సాంబార్ లు, 2,347 నీల్ గాయ్ లు, 8,030 అడవి పందులు, 4,080 కొండముచ్చులు, కోతులున్నాయని తాజా సర్వేలో తేలిందని అటవీ శాఖ వెల్లడించింది. మరో 20 రోజుల్లో పులుల మేటింగ్ సీజన్ ముగియనున్న నేపథ్యంలో పులుల గణన కోసం 1,806 కెమెరా ట్రాప్‌లను అమర్చారు. ఒక్కో ట్రాప్ 30 రోజుల పాటు పులుల చిత్రాలను బంధించింది.పులుల చారలను బట్టి వాటి వీడియోలు, చిత్రాల డేటాబేస్ సాయంతో మ్యాచ్ చేసి, వీటికి ప్రత్యేక ఐడీని కేటాయించారు. కెమెరా ట్రాపింగ్‌తో పాటు, స్కాట్, పగ్‌మార్క్‌లు, స్క్రాప్ మార్కులు వంటి పరోక్ష సాక్ష్యాలను ట్రాక్ చేయడం ద్వారా పులుల సంఖ్యను గుర్తించారు. పులుల సంఖ్య పెరగడం పర్యావరణ సమతౌల్యాన్ని, జీవవైవిధ్యాన్ని సూచిస్తుందని హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ చీఫ్ ఇమ్రాన్ సిద్ధిఖీ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.
పెరిగిన జింకల సంఖ్య
అమ్రాబాద్ టైగర్ రిజర్వులో ఇటీవల నిర్వహించిన సర్వేలో జింకల సంఖ్య ఎక్కువగా ఉందని తేలడంతో దానికి అనుగుణంగా పులుల సంఖ్య కూడా పెరిగిందని అటవీశాఖ అధికారులు చెప్పారు.అటవీశాఖ ఫీల్డ్ డైరెక్టర్ ఎన్ క్షితిజ నేతృత్వంలో నిర్వహించిన ఈ సర్వేలో మచ్చల జింక, సాంబార్, నీల్‌గాయ్, నాలుగు కొమ్ముల జింక, అడవి పందులతో సహా వివిధ జాతుల జంతువులను గుర్తించారు.సాంబార్ మరియు మచ్చల జింకలు ఎక్కువగా ఎక్కువగా ఉన్నాయని తేలింది. అయిదు నెలల కాలంలో అటవీశాఖ అధికారులు మొత్తం 1,806 కెమెరా ట్రాప్‌లను అమర్చారు.ఒక్కో ట్రాప్ 30 రోజుల పాటు పనిచేసి పులుల చిత్రాలను బంధించింది.ఈ చిత్రాలను గుర్తించడానికి పులుల ప్రత్యేక గీత నమూనాలను ఉపయోగించి ఇప్పటికే ఉన్న డేటాబేస్‌తో పోల్చారు.
పులుల అభయారణ్యంలో అమ్రాబాద్ అగ్రస్థానం
దేశంలో పులుల అభయారణ్యాల్లో అమ్రాబాద్ అగ్రస్థానంలో నిలచింది. నాగర్ కర్నూల్ జిల్లాలోని అమ్రాబాద్ అభయారణ్యంలో పెద్దపులులను చూసేందుకు వీలుగా అటవీశాఖ టైగర్ స్టే పేరిట ఓ ప్యాకేజీ పెట్టింది. పులులున్న ఫర్హాబాద్ కు సఫారీగా టూరిస్టులను తీసుకువెళ్లి పులులను చూపిస్తారు. అడవిలో సందర్శకులను ట్రెక్కింగుకు తీసుకువెళతారు. అమ్రాబాద్ అభయారణ్యంలో ఆడపులులు అధికంగా ఉన్నందున భవిష్యత్ లో ఈ ఏడాది మేటింగ్ సీజన్ విజయవంతం అవడం వల్ల పులి కూనల సంఖ్య పెరగవచ్చని అటవీశాఖ అధికారులు అంచనా వేశారు.
ఏటేటా పెరిగిన పులుల సంఖ్య
అమ్రాబాద్ పులుల అభయారణ్యంలో ఏటేటా పులుల సంఖ్య పెరిగిందని అటవీశాఖ అధికారుల గణాంకాలు వెల్లడించాయి. 2017వ సంవత్సరంలో కేవలం 10 పులులున్నాయని పులుల గణనలో తేలింది. 2019లో పులుల సంఖ్య 12కు పెరిగాయి. 2021వ సంవత్సరంలో 14 కు చేరిన పులులు 2022లో అనూహ్యంగా 21కి పెరిగాయి. 2023వ సంవత్సరంలో 24 ఉన్న పులుల సంఖ్య అనూహ్యంగా 34కు పెరిగాయి. అమ్రాబాద్ టైగర్ రిజర్వు ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలతో హైదరాబాద్ కు 150 కిలోమీటర్ల దూరంలో ఉంది.నల్లమల కొండలతో కూడిన ప్రాంతం 2,166.37 చదరపు కిలోమీటర్లలో కోర్ జోన్, 445.02 చదరపు కిలోమీటర్ల బఫర్ జోన్ అటవీప్రాంతం ఉంది.
అటవీ గ్రామాల తరలింపునకు ప్రతిపాదనలు
అమ్రాబాద్ పులుల అభయారణ్యంలో ఉన్న నాలుగు అటవీ గ్రామాలను పులుల కోసం తరలించాలని అటవీశాఖ అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు. ఏటీఆర్ పులుల రక్షిత ప్రాంతంలో ఉన్న కుడి చింతలవాయి, శార్లపల్లి, కొలంపెంట, శార్లపల్లి, తాటిగుండాల అటవీ గ్రామాలను ఇతర ప్రాంతాలకు తరలించి వారికి పునరావాసం కల్పించాలని అధికారులు యోచిస్తున్నారు. ఇప్పటికే కవ్వాల ప్రాంతంలోని అటవీ గ్రామాలను పులుల పరిరక్షణ కోసం తరలించారు.
Next Story