బీఆర్ఎస్, బీఎస్‌పీ పొత్తు.. మాయావతి ట్వీట్‌పై ఆర్ఎస్‌పీ క్లారిటీ
x
Source: Twitter

బీఆర్ఎస్, బీఎస్‌పీ పొత్తు.. మాయావతి ట్వీట్‌పై ఆర్ఎస్‌పీ క్లారిటీ

బీఆర్ఎస్, బీఎస్‌పీ పొత్తుకు మాయావతి ఆమోదించలేదన్న వార్తలపై ఆర్ఎస్ ప్రవీణ్ క్లారిటీ ఇచ్చారు. సీట్ల సర్దుబాటుపై త్వరలోనే ప్రకటన ఉంటుందని తెలిపారు.



పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. చిరకాల ప్రత్యర్థులుగా ఉంటున్న పార్టీలు కూడా ఎన్నికల కోసం చేతులు కలుపుతున్నాయి. రాష్ట్రంలో కొత్త పొత్తులు వెలుగు చూస్తున్నాయి. తాజాగా బీఆర్ఎస్, బీఎస్‌పీ పార్టీలు లోక్‌సభ ఎన్నికల్లో కలిసికట్టుగా పోటీ చేయనున్నట్లు ప్రకటించాయి. ఈ విషయాన్ని కేసీఆర్ నివాసంలో ఆయనతో సమావేశం అయిన అనంతరం బీఎస్‌పీ తెలంగాణ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వెల్లడించారు. ఈ పొత్తు విషయాన్ని కేసీఆర్ కూడా అధికారికంగా ప్రకటించారు. వీరు ఈ ప్రకటన చేసినప్పటి నుంచి ఈ పొత్తుకు బీఎస్‌పీ అధినేత్రి మాయావతి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని, పొత్తులకు ఆమె ససేమిరా అన్నారని వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో బీఎస్‌పీ, బీఆర్ఎస్ పొత్తు చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఈ వార్తలపై బీఎస్‌పీ తెలంగాణ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ క్లారిటీ ఇచ్చారు. తమ పొత్తుకు మాయావతి అనుమతించలేదన్న వార్తల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు.

బీఆర్ఎస్‌తో పొత్తుకు మాయావతి గ్రీన్న సిగ్నల్

తెలంగాణలో బీఆర్ఎస్‌తో జతకట్టడానికి బీఎస్‌పీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి అనుమతించారని ట్విట్టర్ వేదికగా ప్రకటించారు ఆర్ఎస్‌పీ. లోక్‌సభ ఎన్నికల్లో కలిసి కట్టుగా పోటీ చేసి తెలంగాణ ప్రజల సమస్యలను పార్లమెంటులో వినిపిస్తామని భరోసా ఇచ్చారు. తమ కూటమిపై అనేక మంది బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నారని, అందులో భాగంగా అవాస్తవ ప్రచారాలు కూడా చేస్తున్నారని, వాటిని ఏమాత్రం నమ్మొద్దని కోరారు. ఈ పొత్తుకు మాయావతి ఆదివారం రోజే ఆమోదం తెలిపారని ఆయన వెల్లడించారు.

తెలంగాణలో కూటమికి అందుకే ఓకే

లోక్‌సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా బీఎస్‌పీ ఒంటరిగానే పోటీ చేస్తుందని, ఎటువంటి పొత్తులు ఉండవని బీఎస్‌పీ సుప్రీమో మాయావతి శనివారం ట్వీట్ చేయడంతో తెలంగాణలో బీఎస్‌పీ, బీఆర్ఎస్ పొత్తుపై సందేహాలు మరింత అధికమయ్యాయి. తాజాగా వీటిపై ఆర్‌ఎస్‌పీ స్పష్టత ఇచ్చారు. ‘‘మాయావతి ఏ జాతీయ పార్టీలతో కానీ, ఇప్పటికే కూటమిలో ఉన్న పార్టీలతో కానీ పొత్తు పెట్టుకోమని చెప్పారు. కానీ బీఆర్ఎస్ ఎవరితో పొత్తులో లేనందున ఈ పార్టీతో పొత్తుకు బెహన్‌జీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు’’ అని తేల్చి చెప్పారు.

సీట్ల సర్దుబాటుపై త్వరలోనే ప్రకటన

త్వరలో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 17 పార్లమెంటు స్థానాల్లో బీఆర్ఎస్, బీఎస్‌పీ కలిసి పోటీ చేస్తాయని ఆర్‌ఎస్‌పీ వెల్లడించారు. ఇరు పార్టీల మధ్య స్థానాల కేటాయింపుపై త్వరలో చర్చలు చేసి సంయుక్త ప్రకటన విడుదల చేస్తామని చెప్పారు. త్వరలో కేసీఆర్ అధ్యక్షతన జరిగే సమావేశానికి బీఎస్‌పీ రాజ్యసభ ఎంపీ, బీఎస్‌పీ జాతీయ సమన్వయకర్త రాంజీ గౌతమ్.. మాయావతి దూతగా హాజరవుతారని, ఇందులో ఇరు పార్టీల మధ్య సీట్ల పంపకాలు, ఉమ్మడి భవిష్యత్ కార్యాచరణపై చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. అనంతరం తమ నిర్ణయాలను సంయుక్తంగా విలేకరుల సమావేశం నిర్వహించి ప్రకటిస్తామని, అప్పటి వరకు మీడియాలో వస్తున్న నిరాధారమైన వార్తలు, వదంతులను నమ్మొద్దని ఆయన కోరారు.


Read More
Next Story