హైదరాబాద్ లో అసదుద్దీన్ కు కొత్త తల నొప్పి
బిజెపి హిందూత్వ ఫైర్ బ్రాండ్ మాధవీ లతని దించి దేశమంతా హైదరాబాద్ నియోజకవర్గం వైపు చూసేలా చేసింది. ఇపుడు ఎంబిటి పార్టీ కూడా రంగంలోకి వచ్చింది. ఎంఐఎంకు కష్టాలేనా?
పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి మజ్లిస్ బచావో తెహ్రీక్ (ఎంబీటీ) బరిలోకి దిగనుందా? అంటే అవునంటున్నారు ఆ పార్టీ అధినేత అమ్జదుల్లా ఖాన్. వాస్తవానికి అధికార కాంగ్రెస్ పార్టీ పొత్తుతో ఎంబీటీ చీఫ్ అయిన అమ్జదుల్లా ఖాన్ అసద్ పై పార్లమెంట్ ఎన్నికల బరిలోకి దిగనున్నారని ఇటీవల ప్రచారం జరిగింది. అయితే అధికార కాంగ్రెస్ పార్టీ మజ్లిస్ పార్టీతోనే రహస్య అవగాహన కుదరిందని ఇటీవల వార్తలు వచ్చాయి. దీంతో కాంగ్రెస్ పార్టీతో ఎంబీటీకి పొత్తు ఉండదని ఎంబీటీ అధినేతే స్వయంగా ప్రకటించారు. అనంతరం తానే మజ్లిస్ పై పోటీ చేస్తానని ప్రకటించిన అమ్జదుల్లా ఖాన్ ఊహాగానాలకు తెర వేశారు.
పాతబస్తీలో పెరిగిన ఎంబీటీ బలం
పాతబస్తీలో మజ్లిస్‌కు వ్యతిరేకంగా ఏర్పడిన ఎంబీటీ క్రమేణా ఎదుగుతోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఎంబీటీకి వచ్చిన ఓట్ల శాతం పెరిగింది.యాకుత్ పురా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన ఎంబీటీ అభ్యర్థి అమ్జదుల్లా ఖాన్ కేవలం 878 ఓట్ల తేడాతోనే ఓటమి పాలయ్యారు. అనూహ్యంగా ఎంబీటీ నువ్వా నేనా అంటూ ఎన్నికల్లో సవాలు విసరడంతో మజ్లిస్ పార్టీ నేతలు షాక్ అయ్యారు. యాకుత్ పురా నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించిన మజ్లిస్ పార్టీ అభ్యర్థి జాఫర్ హుసేన్ కు 46,153 ఓట్లు రాగా, ఎంబీటీ అభ్యర్థి అమ్జదుల్లా ఖాన్ కు 45,275 ఓట్లు దక్కాయి. అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని మజ్లిస్ పార్టీని వ్యతిరేకించే వారికి ఎంబీటీ ప్రత్యామ్నాయ పార్టీగా మారింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) పార్టీకి ఓట్ల శాతం కొన్ని స్థానాల్లో తగ్గింది. దీంతో ప్రతిష్టాత్మకమైన హైదరాబాద్ లోక్‌సభ స్థానం కోసం జరగనున్న ఈ పార్లమెంట్ ఎన్నికల్లో సీన్ మారిపోతుందా అనే అనుమానాలు తలెత్తాయి. గత ఎన్నికల ఫలితాలతో ఎంబీటీ బలం పాతబస్తీలో పెరిగిందని చెప్పవచ్చు.
సాలార్‌తో అమానుల్లాఖాన్‌కు వైరుధ్యాలు
1993వ సంవత్సరంలో మజ్లిస్ పార్టీలో ఉన్న ముహమ్మద్ అమానుల్లా ఖాన్ ఆ పార్టీ అధినేత సుల్తాన్ సలావుద్దీన్ ఒవైసీ (సాలార్) తో ఏర్పడిన విభేదాలతో విడిపోయి మజ్లిస్ బచావో తెహ్రీక్ పేరిట వేరు కుంపటి పెట్టుకున్నారు. మజ్లిస్ పార్టీలో బంధుప్రీతి పెరిగిందని, అంతర్గత ప్రజాస్వామ్యం లేదని, అవినీతి సాగుతుందని అమానుల్లాఖాన్ అప్పట్లో సంచలన ఆరోపణలు చేశారు. గతంలో అమానుల్లాఖాన్ మజ్లిస్ పార్టీ శాసనసభా పక్ష నేతగా కూడా పనిచేశారు. అప్పట్లో ఎంబీటీకి చెందిన ముంతాజ్ అహ్మద్ ఖాన్ 1999 వరకు ఎమ్మెల్యేగా ఉన్నారు. అప్పట్లో మజ్లిస్ పార్టీకి పోటీగా ఎంబీటీ కూడా చాంద్రాయణగుట్ట, యాకుత్ పురా అసెంబ్లీ స్థానాలను గెల్చుకుంది. నాటి నుంచి నేటి వరకు మజ్లిస్, ఎంబీటీ పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు పాతబస్తీలో నెలకొన్నాయి. ఎంబీటీ అధినేతగా ఎదిగిన అమ్జదుల్లా ఖాన్ మజ్లిస్ కు వ్యతిరేకంగా పాతబస్తీలో రాజీలేని పోరాటం సాగిస్తున్నారు.
మజ్లిస్ తో కాంగ్రెస్ పార్టీకి అవగాహన ఒప్పందం?
మజ్లిస్ తో కాంగ్రెస్ పార్టీకి అవగాహన ఒప్పందం కుదిరిందా అంటే అవునని ఆ పార్టీకి చెందిన నాంపల్లి డీఫెటెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి ఫిరోజ్ ఖాన్ ఇటీవల ప్రకటించారు. సీఎం రేవంత్ రెడ్డి పాతబస్తీలో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన సందర్భంగా మజ్లిస్ సుప్రీం అసదుద్దీన్ ఒవైసీతో దోస్తీ కుదిరింది కాంగ్రెస్ పార్టీ నేతలే చెబుతున్నారు. ఈ దోస్తీని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఫిరోజ్ ఖాన్, అజహరుద్దీన్ లు వ్యతిరేకించినా రేవంత్, అసద్ లు ఒకరి నొకరు చేయి చేయి కలిపి వరుస సమావేశాల్లో పాల్గొన్నారు. అధికారంలో ఎవరు ఉంటే వారితో మజ్లిస్ స్నేహం కొనసాగిస్తుందని గతంలో మజ్లిస్ వ్యవహారశైలిని చూసిన పాతబస్తీకి చెందిన జానో జాగో ఉద్యమం చీఫ్ సయ్యద్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.
అధికారికంగా ప్రకటించకున్నా...
హైదరాబాద్ పార్లమెంట్ స్థానంలో మజ్లిస్ పార్టీకి కాంగ్రెస్ పరోక్ష సహకారం అందిస్తుందని పేరు చెప్పడానికి ఇష్టపడని కాంగ్రెస్ పార్టీ పాత బస్తీ నేత ఓకరు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీతో మైత్రీకి మజ్లిస్ కటీఫ్ చెప్పిందా అంటే ఆ విషయం ఇంకా అధికారికంగా తేలలేదు. 2014వ సంవత్సరం నుంచి మజ్లిస్ పార్టీ కేసీఆర్ నేతృత్వంలోని భారత రాష్ట్ర సమితికి బహిరంగంగా మద్దతు ఇచ్చింది. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఐదు లక్షలకు పైగా ఓట్లతో విజయం సాధించారు. దాని సమీప ప్రత్యర్థి బీజేపీకి 2.35 లక్షల ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు.భారతీయ జనతా పార్టీ మాధవి లతను ఈ స్థానం నుంచి బరిలోకి దించింది. 58 శాతం మంది ఓటర్లు ముస్లింలు కావడంతో ఈ సీటులో ఎవరు గెలుస్తారనేది ఆసక్తికరంగా మారింది.
ఎన్నికల్లో ఎంబీటీ ప్రభావం ఎంత?
ఎన్నికల కమిషన్ నామినేషన్లు ప్రారంభించగానే తన నామినేషన్ ను హైదరాబాద్ పార్లమెంట్ నుంచి దాఖలు చేస్తానని ఎంబీటీ చీఫ్ అమ్జదుల్లా ఖాన్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. పాతబస్తీలో ప్రజల సమస్యలపై గత కొంత కాలంగా ఎంబీటీ చీఫ్ పోరాడుతున్నారు. ఎంబీటీ హైదరాబాద్ పార్లమెంట్ నుంచి బరిలో దిగితే ఇక్కడ పోటీ ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. ప్రజల్లో మజ్లిస్ పార్టీకి ప్రత్యామ్యాయంగా ఎంబీటీ నిలిచిందని రాజకీయ పరిశీలకులు కూడా చెబుుతున్నారు. ఈ ఎన్నికల్లో వరుస విజయాలతో 50 ఏళ్లుగా పాగా వేసిన మజ్లిస్ పార్టీని ఎంబీటీ మట్టికరిపిస్తుందా? బీజేపీ కమలం వికసిస్తుందా? అనేది ఎన్నికల్లో తేలాల్సి ఉంది. అమ్జదుల్లా ఖాన్ అభ్యర్థిత్వం ఏఐఎంఐఎం ను ఎన్నికల్లో ఎలా ప్రభావితం చేస్తుందో ఎన్నికల ఫలితం వెల్లడయ్యే వరకు వేచి చూడాల్సిందే.
Next Story