మాంసం ప్రియులకు జీహెచ్‌ఎంసీ బ్యాడ్‌ న్యూస్‌
x

మాంసం ప్రియులకు జీహెచ్‌ఎంసీ బ్యాడ్‌ న్యూస్‌

హైదరాబాద్ నగర వాసులకు ఈ ఆదివారం ముక్క తిప్పలు తప్పేటట్లు లేవు. మాంసం ప్రియులకు జీహెచ్‌ఎంసీ బ్యాడ్‌ న్యూస్‌ చెప్పింది.


హైదరాబాద్ నగర వాసులకు ఈ ఆదివారం ముక్క తిప్పలు తప్పేటట్లు లేవు. మాంసం ప్రియులకు జీహెచ్‌ఎంసీ బ్యాడ్‌ న్యూస్‌ చెప్పింది. ఆదివారం రోజు మటన్ షాపులు మూసివేయాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రొనాల్డ్‌ రాస్‌ ఆదేశాలు జారీ చేశారు. అయితే ప్రతీ ఆదివారం చికెన్, మటన్‌ ప్రియులతోపాటు, సామాన్య ప్రజల ఇళ్లలో కూడా ఆ వంటకాలు ఘుమఘుమలాడతాయి. దీంతో జీహెచ్‌ఎంసీ తీసుకున్న నిర్ణయం చికెన్, మటన్‌ ప్రియులకు మింగుడు పడడం లేదని చెప్పవచ్చు.

కాగా హైదరాబాద్ నగరంలో వారం మొత్తం కూరగాయలు, ఆకుకూరలు, పప్పులు ఇలా ఏం తిన్నా.. ఆదివారం వచ్చిందంటే దాదాపు 70 శాతం మంది ఇళ్లలో నీసు కూర ఉండాల్సిందే. ముక్కలేనిదే ముద్ద దిగదు. హైదరాబాద్ లో మాంసం అమ్మకాలు ఎక్కువ శాతం ఆదివారం జరుగుతాయి. మటన్, చికెన్, చేపలు ఇలా ఏదో ఒక వంటకం తప్పనిసరి ఉంటుంది. దీంతో ఆదివారం ఏ గల్లీకి వెళ్లినా మాంసం వంటకాల వాసనలు గుప్పుమంటాయి. నగర వాసులు ఆదివారం ఉదయమే చికెన్, మటన్‌ షాపుల ముందు క్యూ కడుతుండటాన్ని మనం ఆదివారాల్లో గమనిస్తూనే వుంటాం. ఇక చేపల మార్కెట్లైతే కిటకిటలాడతాయి.

ఇంతకీ మాంసం దుకాణాలు ఎందుకు బంద్‌ చేస్తున్నారంటే.. ఆదివారం (ఏప్రిల్‌ 21న) మహావీర్ జయంతి. జైనులు జరుపుకునే పండుగల్లో అతి ముఖ్యమైనది మహావీర్‌ జయంతి. హైదరాబాద్ నగరంలో జైనుల సంఖ్య బారీగానే వుంటుంది. ఈ క్రమంలో జీహెచ్‌ఎంసీ నీసు అమ్మకాలు నిలిపివేయాలని నిర్ణయం తీసుకుంది. మహావీర్‌ జయంతిని జైనులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. జైనులు ఆరోజు ఎలాంటి జీవహింస చేయరు. మాంసాహారం ముట్టుకోరు. ఈ నేపథ్యంలో జైనుల సాంప్రదాయాన్ని గౌరవిస్తూ మటన్, చికెన్, బీఫ్‌, ఫిష్ మార్కెట్లతోపాటు, మాసం అమ్మే అన్ని షాపులు మూసివేయాలని జీహెచ్‌ఎంసీ ఆదేశాలు జారీ చేసింది.

Read More
Next Story