BRS కి సపోర్ట్ అంటూనే.. మెదక్ లో TRS నామినేషన్
x

BRS కి సపోర్ట్ అంటూనే.. మెదక్ లో TRS నామినేషన్

మెదక్ TRS అభ్యర్థి తన నామినేషన్ దాఖలు చేశారు. టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా మారింది కదా.. టీఆర్ఎస్ అంటారేంటి అని సందేహించాల్సిన అవసరం లేదు. అసలు విషయం ఏమిటంటే...


తెలంగాణలో లోక్ సభ అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియ మొదలైనప్పటి నుండి ఎన్నికల జోరు మరింత పెరిగింది. నేతలు నామినేషన్లు వేసి ప్రచార హోరుని పెంచారు. ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకి చెందిన పలువురు లోక్ సభ అభ్యర్థులు నామినేషన్లు వేసేశారు. ఈ క్రమంలో మెదక్ టీఆర్ఎస్ అభ్యర్థి తన నామినేషన్ దాఖలు చేశారు. టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా మారింది కదా.. టీఆర్ఎస్ అంటారేంటి అని సందేహించాల్సిన అవసరం లేదు. నామినేషన్ వేసింది టీఆర్ఎస్ తరపునే. అసలు విషయం ఏమిటంటే...

తుపాకుల బాల్ రంగం అనే వ్యక్తి కొన్ని నెలల క్రితం.. "తెలంగాణ రాజ్య సమితి" (టీఆర్ఎస్) పేరిట పార్టీ గుర్తింపు కోసం ఎన్నికల కమిషన్ కి అప్లై చేశారు. సదరు దరఖాస్తుని గుర్తిస్తూ ఎన్నికల కమిషన్ తెలంగాణ రాజ్య సమితి పేరిట గ్యాస్ సిలిండర్ గుర్తుని కేటాయిస్తూ అనుమతులిచ్చింది. అప్పటి నుండి బాల్ రంగం తెలంగాణ రాజ్య సమితి పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఆయన స్వస్థలం సిద్దిపేట అర్బన్ మండలం కి చెందిన పొన్నాల గాంధీ నగర్.

సోమవారం బాల్ రంగం కుమారుడు తుపాకుల మురళి తెలంగాణ రాజ్య సమితి (టీఆర్ఎస్) తరపున మెదక్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం ఈయన పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఇంకోవైపు మురళి తమ్ముడి భార్య బీఆర్ఎస్ సిద్దిపేట అర్బన్ మండల జడ్పిటీసి గా కొనసాగుతున్నారు. మరో విశేషమేమిటంటే టీఆర్ఎస్ అధ్యక్షుడు బాల్ రంగం కూడా బీఆర్ఎస్ కార్యక్రమాలకు హాజరవుతూ తన సొంత పార్టీ బాధ్యతలు చూసుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు బీఆర్ఎస్ తో ఫ్రెండ్లీ సపోర్ట్ ఉంటుందని ప్రకటించి... ఇప్పుడు తన కొడుకుని మెదక్ అభ్యర్థిగా బరిలో దింపడం గమనార్హం.

Read More
Next Story