
మేడారం అభివృద్ధి 95శాతం పూర్తి
సబ్‌రిజిస్ట్రార్ సేవల్లో కూడా కీలక మార్పులు రానున్నట్లు చెప్పిన మంత్రి పొంగులేటి.
మేడారం అభివృద్ధి పనులు దాదాపు పూర్తి కావొచ్చాయని తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు 95శాతం పనులు జరిగాయని చెప్పారు. అంతేకాకుండా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న రిజిస్ట్రేషన్ ఆఫీసుల విషయంలో కూడా కీలక పలు విషయాలు వెల్లడించారు. శాసనమండలిలో అడిగిన ప్రశ్నలకు సమాధానంగా రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార–ప్రజాసంబంధాల శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, సమ్మక్క–సారలమ్మ జాతర కోసం మెదారంలో చేపట్టిన అభివృద్ధి పనులు రూ.200 కోట్లకు పైగా వ్యయంతో కొనసాగుతున్నాయని తెలిపారు. ఇప్పటివరకు సుమారు 95 శాతం పనులు పూర్తయ్యాయని వెల్లడించారు.
ఈ అభివృద్ధి పనుల్లో 200 సంవత్సరాలకు పైగా నిలిచేలా రాతితో నిర్మించిన శాశ్వత నిర్మాణాలు ఉన్నాయి. 10 కిలోమీటర్ల పరిధిలో నాలుగు లైన్ల రహదారుల నిర్మాణం చేపట్టారు. ఇప్పటివరకు 29 ఎకరాల భూమి సేకరణ పూర్తయిందని తెలిపారు. భక్తులకు మరింత సౌకర్యాలు కల్పించేందుకు అదనంగా 63 ఎకరాల భూమి సేకరణకు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. జనవరి 29 నుంచి 31 వరకు జరగనున్న జాతరను కుంభమేళా స్థాయిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని మంత్రి వెల్లడించారు.
ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు అభివృద్ధి పనులను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు మంత్రి తెలిపారు. మంత్రి సీతక్క, మంత్రి కొండా సురేఖ సమన్వయంతో పనులు ముందుకు సాగుతున్నాయని చెప్పారు. జనవరి 18న అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి గౌరవ ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఆహ్వానించనున్నట్లు వెల్లడించారు.
రిజిస్ట్రేషన్ ఆఫీసులకు శాశ్వత బిల్డింగ్‌లు
శాసనమండలిలో మరో ప్రశ్నకు సమాధానంగా రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో మొత్తం 144 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయని తెలిపారు. వాటిలో 94 కార్యాలయాలు అద్దె భవనాల్లో పనిచేస్తుండగా, 50 కార్యాలయాలు ప్రభుత్వ భవనాల్లో కొనసాగుతున్నాయని చెప్పారు.
పారదర్శకత, వేగవంతమైన సేవలు, ప్రజలకు అనుకూలమైన విధానాలు అమలు చేయాలనే లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఏ. రేవంత్ రెడ్డి దృష్టికోణానికి అనుగుణంగా 94 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు శాశ్వత భవనాల నిర్మాణం మూడు దశల్లో చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు. మొదటి దశలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లోని 39 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను 11 ఇంటిగ్రేటెడ్ క్లస్టర్లుగా అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. ఇవి రాష్ట్ర రిజిస్ట్రేషన్ ఆదాయంలో 69 శాతం వాటా కలిగి ఉన్నాయని తెలిపారు. ఈ నెలాఖరు నాటికి 10 ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ భవనాలకు శంకుస్థాపనలు జరగనున్నాయని వెల్లడించారు.
ఈ ఆధునిక కార్పొరేట్ స్థాయి సౌకర్యాలను ప్రభుత్వానికి ఎలాంటి వ్యయం లేకుండా నిర్మిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ప్రైవేట్ డెవలపర్లు తొలి ఐదేళ్ల పాటు నిర్వహణ బాధ్యతలు కూడా చేపట్టనున్నారని చెప్పారు. స్లాట్ బుకింగ్ విధానం అమలుతో ఒక్కో డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్‌కు పట్టే సమయం 18 నుంచి 21 నిమిషాలకు తగ్గిందని మంత్రి స్పష్టం చేశారు. దీని ద్వారా ప్రజలకు వేగవంతమైన సేవలు, ఇబ్బందులేని అనుభవం లభిస్తున్నాయని పేర్కొన్నా.

