
ఏఐసీసీ గరమ్.. ప్రభుత్వాన్ని ఎవరూ ఏమనలేదన్న వీహెచ్
ప్రతిపక్ష నేతలతో కలిసి సమావేశం నిర్వహించడాన్ని ఏఐసీసీ సీరియస్‌గా తీసుకుంది.
కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావుపై ఏఐసీసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన నివాసంలో కాపు నేతలు సమావేశం కావడమే ఇందుకు కారణం. ఈ సమావేశానికి బీఆర్ఎస్, బీజేపీ నేతలు కూడా హాజరైనట్లు సమాచారం. ఈ విషయం తెలియడంతో వీహెచ్‌పై ఏఐసీసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ అంశంపై తెలంగాణ కాంగ్రెస్ నూతన ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఇప్పటికే అగ్గిమీద గుగ్గిలమయ్యారు. ఈ సమావేశానికి ప్రతిపక్ష నేతలను పిలవడం ఏంటని ఆమె ప్రశ్నించారు. కాగా ఈ విషయంపై వీహెచ్ స్పందించారు. తన ఇంట్లో జరిగిన సమావేశంలో సీఎం రేవంత్‌ను కానీ, ప్రబుత్వాన్ని కానీ ఎవరూ తిట్టలేదని, కనీసం నెగిటివ్‌గా కూడా మాట్లాడలేదని ఆయన వివరించారు. మున్నూరు కాపు సభ ఎప్పుడు నిర్వహించాలి అన్న అంవంపై సీఎంతో కూడా చర్చిస్తానని, ఆ తర్వాతే సభకు తేదీ ఖరారు చేస్తామని ఆయన వెల్లడించారు.
‘‘నా నివాసంలో జరిగిన కాపు నేతల సమావేశంలో సీఎం రేవంత్‌ను కానీ, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ ఎవరూ తిట్టలేదు. కనీస విమర్శించలేదు కూడా. జనాభా లెక్క కొంచెం తగ్గిందని మాత్రమే అన్నారు. ఆ అంశంపై సీఎంతోనే మాట్లాడతాం. సీఎంతో చర్చలు ముగిసిన తర్వాతే మున్నూరు కాపు సభ తేదీని ఫిక్స్ చేస్తాం’’ అని వీహెచ్ ప్రకటించారు.
కానీ ప్రతిపక్ష నేతలతో కలిసి సమావేశం నిర్వహించడాన్ని ఏఐసీసీ మాత్రం సీరియస్‌గా తీసుకుంది. ప్రతిపక్ష నేతలను పిలిచి ప్రభుత్వాన్ని విమర్శించడం ఏంటని ఏఐసీసీ, కాంగ్రెస్ నూతన ఇన్‌ఛార్జ్ మీనాక్షి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది ఎట్టిపరిస్థితుల్లో దీనిని అంగీకరించమన్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షతన జరగాల్సిన సమావేశానికి ఇతర పార్టీల నేతలను పిలిపించడం ఎందుకు? అని ఆమె ప్రశ్నించారు. ఏఐసీసీ, నటరాజన్ ఆగ్రహించడంపై మున్నూరు కాపు నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వీరి స్పందన ప్రస్తుతం కాంగ్రెస్ కాపు నేతల్లో ఆందోళన కలిగిస్తోంది. ఈ క్రమంలోనే పార్టీ పట్ల నిబ్బద్ధత ఉన్న నేతలు ముందుకు రావాలని, ప్రతి ఒక్కరూ పార్ట నియమ నింధనలను తప్పకుండా పాటించాలని ఏఐసీసీ సందేశమిచ్చినట్లు సమాచారం.