
రేవంత్‌తో మీనాక్షీ, మహేష్ భేటీ..
ఢిల్లీలో చేయాల్సిన కార్యాచరణకు వ్యూహ రచన.
బీసీల కోసం ఢిల్లీలో చేపట్టనున్న మహాధర్నాపై తెలంగాణ కాంగ్రెస్ ఫుల్ ఫోకస్ పెట్టింది. దాంతో పాటుగా అనేక అంశాలకు సంబంధించి వ్యూహాలు రచించడంలో కాంగ్రెస్ నేతలు ఫుల్ బిజీ అయ్యారు. వీటికి సంబంధించి చర్చించడం కోసమే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్.. బుధవారం సీఎం రేవంత్ రెడ్డితో ఆయన నివాసంలో భేటీ అయ్యారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతం సహా బీసీ రిజర్వేషన్ల విషయంలో అనుసరించాల్సిన వ్యూహాలపై వారు చర్చించారు. వీటితో పాటు అతి త్వరలో తాను చేయనున్న పాదయాత్ర గురించి కూడా మీనాక్షి నటరాజన్ చర్చించారు. ఏయే నియోజకవర్గాల్లో పాదయాత్ర చేయాలి వంటి విషయాలను సీఎం రేవంత్‌తో ఆమె చర్చించారు. పార్టీ బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో పాదయాత్ర చేయడం ద్వారా లాభం ఉండే అవకాశం ఉందని వారు భావించినట్లు సమాచారం. గంటన్నరపాటు జరిగిన ఈ సమావేశంలో పలు కీలక విషయాలు చర్చించారు.
రాష్ట్రంలో పార్టీ నిర్మాణం, క్షేత్రస్థాయి నుంచి పార్టీ బలోపేతం, పాదయాత్ర, బీసీ రిజర్వేషన్లపై ఢిల్లీ చేసే పోరాటానికి సంబంధించి కార్యాచరణపై అన్ని కోణాల్లో భేటీ అయినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈనెల 31 నుంచి వచ్చే నెల అంటే ఆగస్టు 4వ తేదీ వరకు తెలంగాణలోని పలు జిల్లాల్లో మీనాక్షి నటరాజన్ పాద్ర నిర్వహించాలని వారు నిర్ణియించారు. ఆ తర్వాత మరుసటి రోజే అంటే ఆగస్టు 5న వారు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఢిల్లీలో ఆగస్టు 5, 6, 7 తేదీల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశంపై ధర్నా నిర్వహించనున్నారు. ఈ బిల్లుకు కేంద్రం ఆమోదం తెలపాలని డిమాండ్ చేస్తూ చేయాల్సిన పోరాటాన్ని ఎలా ముందుకు నడిపించాలి అన్న అంశాలను తరువుగా చర్చించారు. ఇదే అంశంపై ఆగస్టు 5న పార్లమెంటు ఉభయ సభల్లో ఎంపీల చర్చకు పట్టుబట్టాలని నిర్ణయించారు.
ఆగస్టు 6న ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద భారీ ధర్నా నిర్వహించనున్నారు. అందులో సీఎం రేవంత్ రెడ్డి సహా తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీసీ సంఘాల నేతలు కూడా పాల్గొనేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ ధర్నాలో కాంగ్రెస్ పార్టీ అధిష్టాన నేతలు కూడా పలువురు పాల్గొనే అవకాశం ఉన్నట్లు సమాచారం. రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేను కూడా ఈ ధర్నాకు ఆహ్వానించే ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆగస్టు 7న ఇదే అంశంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి వినతి పత్రాలు అందించనున్నారు. ఇందుకోసం ప్రత్యేక రైలులో తెలంగాణలోని ప్రతి నియోజకవర్గం నుంచి 50 మంది నేతలు, కార్యకర్తలు ఢిల్లీకి చేరనున్నారు. ఢిల్లీ పర్యటన అనంతరం కాంగ్రెస్ పాదయాత్రను తెలంగాణలో యథావిధిగా కొనసాగించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.
కాంగ్రెస్ ధర్నా ప్రభావం చూపుతుందా?
ఈ క్రమంలోనే ఢిల్లీలో భారీ ఎత్తున ధర్నా చేయాలని, పార్లమెంటు ఉభయ సభల్లో చర్చలకు పట్టుబట్టాలను కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నాలపై విమర్శకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ చర్యలన్నీ కూడా బీసీల కంటితుడుపు చర్యలుగానే ఉంటున్నాయని వారు అభిప్రాయపడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా సిద్ధం చేసిన బిల్లును కేంద్రం ఒప్పుకునే పరిస్థితులు ప్రస్తుతం కనిపించడం లేదని, అందులోనూ విపక్ష పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో తెచ్చిన బిల్లును బీజేపీ అంగీకరిస్తుందన్న నమ్మకం చాలా తక్కువ అని వారు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీలో కాంగ్రెస్ చేస్తున్న ప్లాన్స్ అన్నీ కూడా తెలంగాణ బీసీల కంటితుడుపు చర్యలుగానే మిగిలిపోయే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు.