
SLBC ప్రమాదంపై హైకోర్టులో పిల్
ఘటన జరిగిన తొమ్మిది రోజులు దాటినా లోపల చిక్కుకున్న వారి ఆచూకీ కూడా తెలియకపోవడం తీవ్ర ఆందోళనకరంగా ఉందని కోర్టు దృష్టికి తీసుకెళ్లింది.
శ్రీశైలం ఎడమ గట్టు కాలువ సొరంగంలో ఫిబ్రవరి 22న ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న సొరంగం పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది కార్మికులు చిక్కుకుపోయారు. ప్రమాదం జరిగి తొమ్మిది రోజులు అవుతున్నా వారి ఆచూకీ ఇంకా తెలియలేదు. కాగా తాజాగా ఈ ఘటనపై తెలంగాణ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలైంది. ఈ ప్రమాదంలో చిక్కుకున్నవారిని సురక్షితంగా బయటకు తీసుకురావాలని కోరుతూ నేషనల్ యూనియన్ ఫర్ మైగ్రెంట్ వర్కర్స్ ఈ పిల్ దాఖలు చేసింది. ఘటన జరిగిన తొమ్మిది రోజులు దాటినా లోపల చిక్కుకున్న వారి ఆచూకీ కూడా తెలియకపోవడం తీవ్ర ఆందోళనకరంగా ఉందని కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. వీలైనంత త్వరగా గల్లంతైన కార్మికులకు బయటకు తీసుకురావాలని యూనియన్ డిమాండ్ చేసింది.
ఈ పిల్‌పై న్యాయస్థానంలో వాదనలు జరిగాయి. తెలంగాణ ప్రభుత్వం తరపున ఏజీ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించారు. ఎస్ఎల్‌బీసీ దగ్గర యుద్దప్రాతిపదికన సహాయక చర్యలు జరుగుతున్నాయి. ఆర్మీ, సింగరేణి రెస్క్యూటీం, ఎన్‌డీఆర్ఎఫ్ సహా దాదాపు 10 రెస్క్యూ బృందాలు ఈ చర్యల్లో పాల్గొంటున్నాయని ఆయన తెలిపారు. అదే విధంగా సహాయక చర్యలను 24 గంటలూ కొనసాగిస్తున్నామని, వీటిని ప్రభుత్వం క్షుణ్ణంగా పరిశీలిస్తోందని వివరించారు. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం విచారణను ముగించింది.