ఊ..అంటారా..ఉహు ..అంటారా!
x

ఊ..అంటారా..ఉహు ..అంటారా!

జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ కు మద్దతుపై ఎంఐఎం సస్పెన్స్


అందరి దృష్టి ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఉపఎన్నిక వైపే.ఈ స్థానాన్ని బీఆర్ఎస్ తిరిగి నిలుపుకుంటుందా ,కాంగ్రెస్ హస్తగతం చేసుకుంటుందా,కమలం వికసిస్తుందా అనేది అందరికీ ఉత్కంఠగా మారింది.ఈ నియోజకవర్ఘంలో మైనారిటీ ఓట్లు కీలకంగా ఉండటంతో ఎంఐఎం పోషించే పాత్ర మీద అన్ని పార్టీల గెలుపోటములు కీలకం కానున్నాయి.ఇప్పటిదాకా అందరూ ఊహిస్తున్నది,ప్రచారం సాగుతున్నదీ ఎంఐఎం పోటీకి దూరంగా వుండి ,అధికార కాంగ్రెస్ కు మద్దతు ఇస్తుందని ,మరి ఇప్పుడు కీలకపరిణామాలు చోటుచేసుకోబోతున్నాయా?ఎంఐఎం ఏమి చేయబోతోందనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది.

ఎంఐఎం అధినేత అసద్ చేసిన తాజా వ్యాఖ్యలు ఉత్కంఠ పెంచుతున్నాయి.ఈ ఉప ఎన్నికల విషయంలో తాము ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో తనకు మంచి సంబంధాలున్నాయని ఓవైసీ పేర్కొన్నారు. అయితే, కేవలం ఈ సంబంధాల ఆధారంగా తాము సైద్ధాంతికంగా రాజీ పడలేదని చెప్పారు. కాంగ్రెస్‌తో తమకు ఎటువంటి పొత్తు లేదని అసదుద్దీన్ ఓవైసీ తెలిపారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు మద్దతిచ్చినట్లు గుర్తు చేశారు. తన నియోజకవర్గంలోని మెట్రో లైన్, ఆగిపోయిన రోడ్డు విస్తరణ పనులు, అక్బరుద్దీన్ ఓవైసీ నియోజకవర్గంలోని మురుగునీటి పనుల గురించి సీఎం రేవంత్ రెడ్డితో చర్చించినట్లు వివరించారు.అందరూ ఊహిస్తున్నట్లుగా కాంగ్రెస్ కు ఎంఐఎం మద్దతు ఇవ్వడంలేదా , మరి ఇప్పుడు అసద్ ఎందుకు ఇలా మాట్లాడుతున్నారన్నది చర్చకు దారితీసింది.అయితే మరో రెండు రోజులలో అసదుద్దీన్ ముఖ్యమంత్రితో మరోమారు సమావేశం అవుతారని , అప్పుడు బహిరంగ మద్దతు ప్రకటిస్తారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.పాతబస్తీలో తాము కోరుకుంటున్న పనులను చేయిపించుకోవడానికి ఇదే తగిన సమయం అని భావిస్తున్న ఎంఐఎం ,అధికార కాంగ్రెస్ తో దోబుచులాడుతోందన్న వాదనా వినిపిస్తోంది.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ నవీన్ యాదవ్ ను బరిలోకి దించింది. ఇక్కడ నుంచి అనేక మంది ఆశావాహులు సీటు ఆశించారు. అయితే, సీఎం రేవంత్ పట్టుబట్టి నవీన్ యాదవ్ పేరును ఖరారు చేయటంలో కీలకంగా వ్యవహరించారు. ఇక్కడ ఎంఐఎం విషయంలోనూ రేవంత్ కొంత వ్యూహాత్మకంగా పావులు కదిపారు. గతంలో ఎంఐఎం తరుపున పోటీ చేసిన నవీన్ యాదవ్ కు సీటిస్తే మైనారిటీ ఓట్లు కాంగ్రెస్ కు అనుకూలంగా మారతాయని , ఎంఐఎం కూడా ఎలాంటి అభ్యంతరం చెప్పదని భావించారు.
ఎంఐఎం పోటీ చేయటం లేదని అందరూ భావిస్తున్న దానిపై బీజేపీ విమర్శలు చేసింది. జూబ్లీహిల్స్ లో ఎంఐఎం ఎందుకు పోటీ చేయటం లేదని ప్రశ్నించింది. ఎవరి కి మద్దతుగా నిలుస్తున్నారో స్పష్టం చేయాలని డిమాండ్ చేసింది. జూబ్లీహిల్స్ లో 90 వేలకు పైగా ఉన్న ముస్లిం ఓటింగ్ పార్టీల గెలుపు ఓటముల్లో కీలకంగా మారనుంది. దీంతో, ఎంఐఎం మద్దతు ఉంటే గెలుపు ఖాయమని కాంగ్రెస్ అంచనా వేసింది.
మూడు ప్రధాన పార్టీల అభ్యర్ధులు ఖరారయ్యారు. కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, బీజేపీ నుంచి మాగంటి గోపీనాధ్ సతీమణి సునీత డిసైడ్ అయ్యారు.బీజేపీ అభ్యర్ధిగా దీపక్ రెడ్డి పేరు ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి వుంది.అయితే ఇక్కడ ఎంఐఎం పోటీ చేస్తే రాజకీయం మరో రకంగా మారుతుంది. నామినేషన్ల ప్రక్రియ కూడా మొదలు అయిన తరువాత కూడా ఎంఐఎం తమ నిర్ణయాన్ని చెప్పకుండా దోబూచులాడటం ఆశ్చర్యంగానే వుంది.కాంగ్రెస్ కు ఎంఐఎం చివరి క్షణంలో చేయిస్తుందా..స్నేహ హస్తం ఇస్తుందో చూడాలి మరి.
Read More
Next Story